mt_logo

33% మహిళా కోటలో బీసీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి: ఎమ్మెల్సీ కవిత

  • బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తాం..
  • సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లో బీసీ మహిళలు లేరా ?
  • వచ్చే ఎన్నికల నుంచి రిజర్వేషన్లు అమలు చేయకపోవడం శోచనీయం
  • -బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల బిల్లును స్వాగతిస్తూనే బీసీ మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న పోరాటాన్ని కొనసాగిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లను అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే మహిళా బిల్లు లోక్ సభలో ఆమోదం పొందినందుకు దేశ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆకాశంలో సగం, అవకాశాల్లో సగంగా ఉండే మహిళలు అధికారంలో కూడా సగం అని డిమాండ్ చేశామని అన్నారు. వచ్చే ఎన్నికల నుంచే మహిళా రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉన్న కూడా ప్రభుత్వం అమలు చేయదలచుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. మహిళలు మరో ఐదు సంవత్సరాలు వేచి చూడాల్సి రావడం బాధాకరం అని అన్నారు.

మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు అవకాశాలు కల్పించకపోవడం బాధగా ఉందని, ఆత్మ లేకుండా శరీరంలా ఈ బిల్లు కూడా ఆత్మ కోల్పోయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ వర్గం మహిళలైనా వెనుకబడేస్తే దేశం ముందుకు ఎలా వెళ్లగలుగుతుందో బీజేపీ ప్రభుత్వమే ఆలోచించాలని ప్రశ్నించారు. సబ్ కా వికాస్ సబ్ కా సాత్ అంటున్న బీజేపీ నినాదంలో బీసీ మహిళలను చేర్చకపోవడం శోచనీయమని విమర్శించారు. బీసీ మహిళలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూనే ప్రస్తుతం బిల్లు ఆమోదించినందుకు ఉత్సవం చేసుకుంటామని, దేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషించాలని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.