mt_logo

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని బెదిరించి కాంగ్రెస్‌లోకి లాక్కుంటున్నారు: కేటీఆర్

ప్రోటోకాల్ ఉల్లంఘనలపై, కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పిటీషన్లు సమర్పించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయమైన, అక్రమమైన చేరికల అంశాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం పార్టీ ఫిరాయింపుల అంశంలో మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఉంది. ఈ విషయాన్ని స్పీకర్ గారికి గుర్తుచేశాం ఆని తెలిపారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన మరో ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్‌కు ఫిర్యాదు చేయటం జరిగింది. ఇప్పటికే దానం నాగేందర్ పైన ఇచ్చిన ఫిర్యాదు పైన వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరాం. మణిపూర్‌‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారిన సంఘటనలో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఆయన పై అనర్హత వేటు వేశారు అని అన్నారు.

స్పీకర్ గారు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పరిధిలోనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వెంటనే నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారికి విజ్ఞప్తి చేశాం. లేదంటే పదవికి అగౌరవంగా ఉంటుందన్న విషయాన్ని ఆయనకు తెలియజేశాం. సుప్రీం కోర్టు జడ్జిమెంట్‌‌లో ఉన్న విషయాన్ని కూడా స్పీకర్‌కి చదివి వినిపించాం అని అన్నారు.

మూడు నెలల్లోగా స్పీకర్ గారికి అందిన ఫిర్యాదుల పైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా ఉంది. మణిపూర్ ఎమ్మెల్యే విషయంలో స్పీకర్ మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌‌ను కోరటం జరిగింది అని కేటీఆర్ తెలిపారు.

ఢిల్లీలో రాజ్యాంగాన్ని కాపాడుతామని రాహుల్ గాంధీ ఫోజులు కొడుతారు. కానీ మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తోంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పార్టీ ఫిరాయింపుపై గగ్గోలు పెట్టే రాహుల్ గాంధీ.. తెలంగాణలో మాత్రం ఎమ్మెల్యేల ఫిరాయింపులను వెన్నుతట్టి మరి ప్రోత్సహిస్తున్నారు అని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టో పార్టీ మారితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అని అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం. కర్ణాటకలో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య రూ. 50 కోట్లకు ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ కొనేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మరి తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయో పరిశీలించాలని స్పీకర్ గారిని కోరటం జరిగింది అని అన్నారు.

గోవాలో కాంగ్రెస్ అభ్యర్థులను పార్టీ మారమని రాహుల్ గాంధీ శపథం చేయించిన అంశాన్ని కూడా స్పీకర్ గారికి గుర్తు చేశాం. హర్యానా, హిమాచల్‌లో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల పైన స్పీకర్ గారికి ఫిర్యాదు చేస్తే వారు సానుకూల నిర్ణయం తీసుకున్నారని స్పీకర్‌కు వివరించాం. స్పీకర్ గారిని అధికారులు, ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తున్నారు అనే విషయాన్ని విజ్ఞప్తి చేశాం అని తెలిపారు.

ఈ అంశంలో నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ పదవికి ఎలాంటి కళంకం రాదనే తీరుగా ప్రభుత్వాధికారులు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. స్పీకర్ గారు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒక పార్టీపై గెలిచిన అభ్యర్థులు ఇంకో పార్టీలోకి వెళ్లొద్దు అనే విషయాన్ని స్పష్టం చేశారు. స్పీకర్ గారి గొప్ప ఆలోచన విధానాన్ని అభినందిస్తున్నట్లు తెలిపాం అని కేటీఆర్ అన్నారు.

ఇంటర్వ్యూలలో మాత్రమే కాకుండా మేము ఇచ్చిన ఫిర్యాదుపైన వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాం. స్పీకర్ గారి పైన మాకు విశ్వాసం ఉంది. వెంటనే ఆయన పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోకపోతే తప్పకుండా సుప్రీంకోర్టు వెళ్తాం అని స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి పాలనలో దుర్మార్గమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. పార్టీ మారని మా ఇద్దరూ ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉండే ఇద్దరు డీఎస్పీలు ఫోన్ చేసి మీకు ప్రాణ భయం ఉందనే విషయాన్ని పరోక్షంగా హెచ్చరించారు అని పేర్కొన్నారు.

బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్ అదే పనిని తెలంగాణలో చేస్తోంది. మా పార్టీ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి గారి ఆస్తులు, భవనాలపైన దాడులు చేస్తున్నారు. కొంతమందికి ప్రాణగండం ఉందంటూ పార్టీ మారేలా ఒత్తిడి తెస్తూ బెదిరిస్తున్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేల వ్యాపారాలపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారు అని కేటిఆర్ అన్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్న ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ద్వారా బెదిరిస్తున్నారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకున్నట్లుగానే.. ఇక్కడ చోటే భాయ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ విభాగాలను ఉపయోగించుకుని మా ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేస్తున్నారు.ఎన్ని చేసినా సరే ప్రజాక్షేత్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఖచ్చితంగా ప్రజలు శిక్షిస్తారు అని విశ్వాసం వ్యక్తం చేశారు.