విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలంటూ విద్యుత్ నియంత్రణ మండలిని కలిసి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మరియు పలువు సీనియర్ నాయకులు విజ్ఞాపన పత్రం అందించారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి 18,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైంది.. ఇంత భారీగా ప్రజల పైన విద్యుత్ భారాన్ని మోపడం దారుణం అని పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు అన్ని సంక్షోభంలో కూరుకుపోయాయి.. గృహ వినియోగదారులకు సైతం స్థిర చార్జీల పేరుతో విద్యుత్ భారం వేసేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది అని మండిపడ్డారు.
బీఆర్ఎస్ పార్టీ బృందం అందించిన విజ్ఞాపన పత్రంలోని సారాంశం 👇
ప్రజలపైన భారం పడేలా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా దాఖలు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించాలని భారత రాష్ట్ర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.
అనేక వర్గాలకు ఉచితంగా ప్రజలకు విద్యుత్ అందిస్తామంటూ చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలపై 18,500 కోట్ల మేర వివిధ రూపాల్లో వివిధ పేర్లతో ఛార్జీల భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. సుమారు 9 ప్రతిపాదనలను విద్యుత్ నియంత్రణ మండలికి రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది.
తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థలు 963 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు, 16,364 కోట్ల విద్యుత్ ఛార్జీలు (ఆదాయ అవసరాల నివేదిక- ARR), తక్షణమే ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 1,200 కోట్ల విద్యుత్ ఛార్జీల పెంపును అనుమతి కోరుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు రెండు పిటిషన్లను దాఖలు చేశాయి.
ఈ పిటిషన్లను పక్కన పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇళ్లకు వాడుకునే కరెంటు నెలకు 300 యూనిట్లు దాటితే కిలోవాట్‌కు స్థిరఛార్జీని ప్రస్తుతం రూ.10 వసూలు చేస్తుండగా దాన్ని రూ.50 కి పెంచాలని డిస్కంలు కోరుతున్నట్టు సమాచారం ఉన్నది. దీని కారణంగా 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించే వారికి భారీగా భారం పడుతుంది.
ఇక పరిశ్రమలన్నింటినీ ఓకే కేటగిరీ కిందకు తేవాలంటూ చేసిన ప్రతిపాదనలు కూడా ఏమాత్రం మంచిది కాదు. 11 కేవీ సామర్థ్యం కనెక్షన్లకు సమానంగా 33, 132 ఆ పై కనెక్షన్లకు ఛార్జీలు వసూలు చేయాలనటం పరిశ్రమల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం సమర్పించిన ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు అనుమతిస్తే తెలంగాణ ప్రజలపై, అదే విధంగా రాష్ట్ర ప్రగతిపై భారం పడే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విద్యుత్ ఛార్జీల పెంపు రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా మారతాయి. ఇప్పటికే ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో పారిశ్రామిక ప్రగతి మందగించింది. అనేక రంగాలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఓ వైపు అంతర్జాతీయంగా.. మరో వైపు దేశ వ్యాప్తంగానూ పారిశ్రామిక రంగం మందగమనంలో ఉంది. దీనికి తోడు ప్రభుత్వ అర్ధరహిత కార్యక్రమాలు, ప్రణాళికలు, నిర్ణయాల వలన అన్ని రంగాలు పూర్తిగా సంక్షోభం కూరుకుపోయాయి.
ఈ పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు అనేది ఏమాత్రం సమంజసం కాదు. ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపితే తెలంగాణ పారిశ్రామిక రంగం మరింత ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీల పెంపు ఏ మాత్రం మంచిది కాదంటూ విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు.
అదే విధంగా రైతు సంఘాలు, సాధారణ గృహ వినియోగదారుల నుంచి కూడా విద్యుత్ పెంపునకు సంబంధించి చాలా అభ్యంతరాలు వచ్చాయి. అసలే అంతంత మాత్రంగా ఉన్న పారిశ్రామిక ప్రగతికి తోడు రైతాంగం కూడా ఈ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా నిరాశలో ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ విద్యుత్ ఛార్జీల పెంపు అంటే మూలిగే నక్కపై తాటిపండు వేసినట్లు అవుతుంది. కనుక విద్యుత్ ఛార్జీల పెంపు వద్దంటున్న అనేక అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోని ఛార్జీలను పెంచవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాం.
బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ సంస్థలు ఛార్జీల పెంపు ప్రతిపాదనలు తెస్తే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దానికి అంగీకరించ లేదు. పేద ప్రజలపై భారం వేసేందుకు ఆయన ససేమిరా అన్నారు.
విద్యుత్ సంస్థలు ప్రతిపాదించిన ట్రూఅప్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. ఇప్పుడు కూడా ప్రజలపై భారం పడకుండా చర్యలు చేపట్టాల్సి ప్రభుత్వానికి ఆ సోయి లేకుండా పోయింది. కనుక మీరే ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలు అంగీకరించవద్దని విజ్ఞప్తి.
విద్యుత్ ను ఈ ప్రభుత్వం కేవలం ఒక వ్యాపార వస్తువు గా చూడటం దురదృష్టకరం. విద్యుత్ ను ప్రజల జీవనాడిగా ఉన్న ఒక ప్రాథమిక హక్కుగా భావించినప్పుడే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయని మా పార్టీ భావిస్తుంది. అందుకే రాష్ట్ర రైతాంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేశాం.
సమాజంలోని అన్ని వర్గాలకు విద్యుత్తుని ఒక వ్యాపార వస్తువుగా కాకుండా మార్పు తీసుకువచ్చే చోదక శక్తిగా భావించాం. ఆ స్ఫూర్తి ని కొనసాగిస్తూ ప్రజలపై భారం పడకుండా చర్యలు తీసుకున్నాం. తద్వారా గత పదేళ్లలో రాష్ట్ర వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం అద్భుతమైన ప్రగతి సాధించింది. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి. ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరిగింది.
కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయటం లేదు. కేవలం విద్యుత్ ను వ్యాపార వస్తువుగా భావిస్తూ అడ్డగోలుగా ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తోంది. తద్వారా తలెత్తే దుష్ప్రభావాలను పట్టించుకోవటం లేదు. విద్యుత్ ఛార్జీల పెంపు కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి, పెద్ద పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అదే విధంగా రాష్ట్ర ప్రగతి కి గొడ్డలి పెట్టు అవుతుంది. ఎప్పుడు కూడా పరిశ్రమలకు, ప్రజలకు విద్యుత్ ను తక్కువ ధరకు అందిచేందుకు ఎంత కష్టమైన సరే వెనుకడుగు వేయలేదు.
విద్యుత్ ఛార్జీల పెంపు రాష్ట్ర అభివృద్ధితో ముడిపడి ఉన్న కీలక అంశం. కనుక అడ్డగోలుగా చార్జీలు పెంచకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో ప్రజలు, పారిశ్రామిక వర్గాలు, ఎంఎస్ఎమ్ఈ వంటి పారిశ్రామిక వర్గాల తరఫున ఆలోచించాలని కోరుతున్నాం. విద్యుత్ ఛార్జీల పెంపును అడ్డుకునే విధంగా సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం.