mt_logo

మహిళా సంక్షేమంలో బీఆర్ఎస్ పాలన యావత్ భారతదేశానికే ఆదర్శం: కేటీఆర్

మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశంలో సగం కాదు…ఆమే ఆకాశం. సంక్షేమంలో సగం కాదు.. ఆమే అగ్రభాగం అని కేటీఆర్ అన్నారు.

మహిళా సంక్షేమంలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన యావత్ భారతదేశానికే ఆదర్శం.. అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరుపదులు దాటిన అవ్వల వరకు అందరినీ కంటికి రెప్పలా కాపాడింది మనసున్న బీఆర్ఎస్ సర్కార్ అని పేర్కొన్నారు.

గర్భిణీలకిచ్చిన న్యూట్రిషన్ కిట్లు..ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి తొలి మెట్లు అని.. ఆడబిడ్డ పుట్టిందంటే ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టే కేసిఆర్ కిట్‌తోపాటు అందిన 13 వేలు.. ప్రతి పుట్టిల్లు ఎప్పటికీ మరువలేని మేలు అని తెలిపారు.

లక్ష్మీ కటాక్షమే కాదు.. తెలంగాణ ఆడబిడ్డలకు సరస్వతి కటాక్షం అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే సొంతం అని కార్పొరేట్‌కు ధీటైన గురుకులాలతో పేద మధ్య తరగతి తల్లిదండ్రుల కలలు సాకారం చేశారని అన్నారు.

ఆడబిడ్డలకు రక్షణ కవచంగా నిలిచిన షీ టీమ్స్.. ఓ సంచలనం… మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దిన వీ హబ్.. ఓ సంకల్పం.. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు.. ఓ నవశకం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

ప్రతి బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ.. ఓ గొప్ప సంప్రదాయం… కళ్యాణలక్ష్మి కేవలం పథకంకాదు.. ఒక సరికొత్త  విప్లవం.. ఓవైపు భ్రూణహత్యలకు బ్రేక్.. మరో వైపు బాల్య వివాహాలకు ఫుల్ స్టాప్.. ఇంకోవైపు తల్లిదండ్రుల భారాన్ని దించిన భరోసా అని పేర్కొన్నారు.

గుక్కెడు మంచినీళ్ల కోసం మైళ్లదూరం నడిచిన మహిళల కష్టాలను భగీరథతో శాశ్వతంగా తీర్చిన మిషన్.. మన అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు అత్యధిక పారితోషికాలతో.. గౌరవప్రదంగా జీవించే విజన్ అని అన్నారు.

ఆరోగ్యలక్ష్మి పథకంపై నీతి ఆయోగ్ ప్రశంసల వర్షం.. అమ్మఒడి వాహనాలపై సర్వత్రా హర్షం.. మహిళా సంక్షేమంలో.. నాటి మన పాలనకు ఎదురులేదు.. మహిళా సాధికారతలో.. నాడు మన తెలంగాణకు తిరుగులేదు అని కేటీఆర్ తెలిపారు.

భర్తను కోల్పోయిన అక్కాచెల్లెళ్లకు అన్నలా.. ఒంటరి మహిళలకు తండ్రిలా…ఆడబిడ్డలకు మేనమామలా.. అవ్వలకు పెద్దకొడుకులా…
కొండంత అండగా నిలిచిన ఏకైక పాలకుడు.. మన కేసీఅర్ అని అన్నారు.

పదేళ్ల పాలనలో సముద్రమంత సంక్షేమాన్ని అందించి ఆడబిడ్డల సమగ్ర అభివృద్ధికి బంగారు బాటలు వేసిన బీఆర్ఎస్ పక్షాన యావత్ నారీశక్తికి హృదయపూర్వకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని కేటీఆర్ తెలియచేశారు.