mt_logo

ఆగస్టు 2 గడువు.. తర్వాత 50 వేల మంది రైతులతో కన్నెపల్లి పంప్‌ను స్టార్ట్ చేస్తాం: కేటీఆర్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్ హౌస్‌, మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఈరోజు సందర్శించారు. అనంతరం మీడియాతో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. కాలంతో పాటు పోటీ పడి ప్రపంచంలోనే అతి పెద్ద మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ కాళేశ్వరంను కేసీఆర్ గారు నిర్మించారు. ఉన్న ఆయకట్టుతో పాటు కొత్త ఆయకట్టును అందుబాటులోకి తెచ్చేందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది అని తెలిపారు..

తెలంగాణలో కరవు అనే మాటే వినబడకుండా ఉండేందుకు అఖండమైన సంకల్ప బలంతో కేసీఆర్ గారు కాళేశ్వరం నిర్మించారు. తెలంగాణను భౌగోళికంగా చూస్తే మనకు నీళ్లు కావాలంటే ఎత్తిపోతలే మార్గం. అందుకే ప్రాణహిత, మానేరు, గోదావరి కలిసే ఈ ప్రాంతంలో నీళ్లు తీసుకోవచ్చవని కేేసీఆర్ గారు మేడిగడ్డ పాయింట్‌ను ఎంచుకున్నారు అని అన్నారు.

తెలంగాణకు ఇంచు ఇంచుకు నీళ్లు ఇచ్చే బహుళార్థ ప్రాజెక్ట్ కాళేశ్వరం. సముద్ర మట్టం నుంచి దాదాపు 618 మీటర్ల వరకు నీళ్లను ఎత్తిపోయగల కామధేనువు, కల్పతరువు కాళేశ్వరం. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులం మొత్తం ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించాం అటు ఎల్ఎండీలో, మిడ్ మానేరులో 5 టీఎంసీల నీళ్లు కూడా లేవు. శ్రీరాంసాగర్‌లో 90 టీఎంసీలకు గాను 25 టీఎంసీలే ఉన్నాయి. పై నుంచి నీళ్లు వచ్చే పరిస్థితి మనకు కనబడటం లేదు అని పేర్కొన్నారు.

గతంలో మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్ట్ కడితే మేము ఆందోళన చేశాం. ఇప్పుడు మేడిగడ్డ వద్ద దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయి. బటన్ ఆన్ చేస్తే చాలు సిరిసిల్ల, సిద్దిపేట, దుబ్బాక, భువనగరి, ఆలేరు వరకు మనం సస్యశ్యామలం చేయవచ్చు.మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయకమ్మ సాగర్, అన్నపూర్ణ జలాశయానికి నీళ్లు రావాలంటే ఎత్తిపోతలే శరణ్యం అని అన్నారు.

నీళ్లను ఎత్తిపోసి కాళేశ్వరంలోని రిజర్వాయర్లన్నింటినీ నింపితే హైదరాబాద్‌కు కూడా పుష్కలంగా నీళ్లు ఇవ్వవచ్చు. మేడిగడ్డ నుంచి అటు హైదరాబాద్ వరకు ఇటు ఆలేరు వరకు తాగు, సాగు నీళ్ల బాధ లేకుండా చేయవచ్చు. ఇప్పుడు నీళ్లను ఎత్తిపోయటమనేది ప్రధానాంశం. మేము ఇంజనీర్లను అడిగితే బ్రహ్మండంగా నీటిని ఎత్తిపోయవచ్చని అన్నారు అని కేటీఆర్ తెలిపారు.

సుందిళ్ల, అన్నారం విషయంలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటూ తప్పించుకునే సాకులు వెతుక్కుంటున్నారు. నిజానికి సుందిళ్ల, అన్నారంలో డ్రౌటింగ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్‌లో భాగమేనని ఇంజనీర్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కరీంనగర్‌లో మూడురోజులకొకసారి నీళ్లు ఇస్తున్నారు. రైతులు కరవు పరిస్థితులున్నాయని ఆందోళన చెందుతున్నారు అని పేర్కొన్నారు.

కేసీఆర్ ఉన్నప్పుడు నిండు కుండలా ప్రాజెక్ట్‌లు కళకళలాడాయి. ఇప్పుడు నీళ్లకు కరవు ఏర్పడిందని చెబుతున్నారు. కాళేశ్వరంలో ప్రాజెక్ట్‌లో వంద కంపోనెంట్లలో ఒక్కటైన మేడిగడ్డ వద్ద చిన్న సమస్యను భూతద్దంలో చూపెట్టారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేశాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటూ కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు ఒక్క రోజులో రిపోర్ట్ పేరుతో డ్రామా చేశాయి అని దుయ్యబట్టారు.

అటు కాంగ్రెస్ నాయకులు కూడా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాలు చేశారు. మొత్తంగా కేసీఆర్ పై కక్షగట్టి ఆయనను గద్దె దించారు. మీ లక్ష్యం నెరవేరింది కదా.. ఇంకా కేసీఆర్ మీద పడి ఏడ్వటం ఎందుకు ఆయనను బద్నా చేసే కుట్రలు ఎందుకు. ఎన్నికలకు ఆరు నెలల ముందు మాత్రమే రాజకీయాలు చేద్దాం. ఆ తర్వాత నాలుగున్నరేళ్లు ప్రజల కోసం పనిచేద్దాం. ప్రజలకు మీకు మంచి అవకాశం ఇచ్చారు. అధికారాన్ని ప్రజలకు మంచి చేసేందుకు వినియోగించండి అని కేటీఆర్ సూచించారు..

గత డిసెంబర్-జనవరిలో కూడా రాజకీయాలు వద్దు రైతులకు నీళ్లు ఇవ్వండంటూ కోరాం.. కానీ కేసీఆర్ గారి మీద కోపంతో రైతులకు అన్యాయం చేసి పంటలను ఎండబెట్టారు. ఇవ్వాళ కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉధృతి చూస్తుంటే మనసు ఉప్పొంగింది. కానీ ఎల్ఎండీ, మిడ్ మానేరు, శ్రీరాం సాగర్ ఎండిపోతుంటే మనసుకు బాధ అవుతోంది.. కావాల్సిన నీళ్లు ఉన్నాయి.. ఇప్పుడు కావాల్సింది ఒక్క రాజకీయ నిర్ణయం మాత్రమే. ఒక్క బటన్ నొక్కితే చాలు అటు సిరిసిల్ల నుంచి హైద్రాబాద్ వరకు, ఇటు కరీంనగర్ నుంచి తుంగతుర్తి వరకు నీళ్లు వెళ్తాయి అని అన్నారు.

కేసీఆర్ గారు బంగారు పల్లెంలో పంచభక్ష పరమాన్నాలు మాదిరిగా మీకు అన్న సిద్ధం చేసి పెట్టారు.. వాటిని కూడా వాడుకోలేని దౌర్భగ్యపు పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వానికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. రాజకీయ కక్షలు మానండి.. రైతులకు మేలు చేయండి. వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్‌ను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే వరకు అంటే ఆగస్ట్ 2 వరకు ప్రభుత్వానికి సమయం ఇస్తున్నాం.. ఈలోపు అసెంబ్లీ సమావేశాల్లోనూ రైతుల పంటలను ఎందుకు ఎండబెడుతున్నారో చెప్పాలంటూ చర్చను కూడా కోరతాం.. ఆగస్ట్ 2 లోపు ప్రభుత్వం గానీ పంపింగ్ స్టార్ట్ చేయకపోతే.. 50 వేల మంది రైతులతో మేమే కన్నెపల్లి పంప్ హౌస్‌ను స్టార్ట్ చేస్తాం ఆని హెచ్చరించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొంది అన్ని ప్రాంతాల రైతులతో వచ్చి పంప్ హౌస్లను స్టార్ట్ చేసి చూపిస్తాం. ప్రభుత్వం బేషజాలకు పోవద్దు. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు.. రైతులకు, ప్రజలకు మంచి చేయాలని మాత్రమే మేం కోరుతున్నాం. కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న కుట్రలు మొత్తం గోదావరి ప్రవాహం లో కొట్టుకుపోయాయి. కాళేశ్వరం నుంచి నీళ్లను లిప్ట్ చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని ప్రభుత్వ భయపడుతోంది అని వ్యాఖ్యానించారు.

గతంలో కేసీఆర్‌ను బద్నాం చేశాం. ఇప్పుడు నీళ్లు లిప్ట్ చేస్తే ఎట్లా అని తేలు కుట్టిన దొంగల్లా వాళ్ల పరిస్థితి మారిపోయింది. ఈ ప్రభుత్వం క్రిమినల్ నెగ్లిజెన్స్, నేరపూరిత నిర్లక్ష్యంతోనే రైతులకు అన్యాయం చేస్తోంది. ఇది ఎంతమాత్రం మంచి పద్దతి కాదు వెంటనే పంప్ హౌస్‌లను ప్రారంభించి రైతులకు మేలు చేయాలి. మేడిగడ్డ వద్ద కూడా నీళ్ల ప్రవాహాన్ని మీడియా ద్వారా ప్రజలకు చూపిస్తాం. కాళేశ్వరంపై కేసీఆర్ మీద చేసిన తప్పుడు ప్రచారాలు ఇప్పుడు ప్రజలకు తెలుస్తున్నాయి అని అన్నారు.

దేశంలో ఏ ప్రాజెక్ట్ వద్ద ప్రమాదం జరిగినా సరే ఏళ్లకు ఏళ్లు రిపోర్ట్ ఇవ్వని వాళ్లు కాళేశ్వరం విషయంలో మాత్రం ఒక్కరోజులో నివేదిక ఇచ్చారు. ప్రాజెక్ట్‌ను సందర్శించకుండానే తప్పు జరిగినట్లు నివేదిక ఇచ్చి కేసీఆర్‌ను బద్నాం చేశారు. అయిన సరే ఇప్పుడు రాజకీయాలు వద్దు.. రైతులకు మేలు జరగాలనే మేము కోరుకుంటున్నాం అని కేటీఆర్ తెలిపారు.