రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన వేయాలనుకున్న రూ. 18,500 విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రజల తరఫున నేడు, రేపు సంబరాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పది సంవత్సరాల్లో ఏనాడూ విద్యుత్ చార్జీలు పెంచని బీఆర్ఎస్ ప్రభుత్వానికి భిన్నంగా కేవలం 10 నెలల్లోనే 18,500 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ప్రభుత్వం చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా వాటిని వ్యతిరేకించాలని పబ్లిక్ హియరింగ్‌లో పాల్గొని ఈఆర్సీని ఒప్పించగలిగామని కేటీఆర్ అన్నారు.
మొత్తం ఉమ్మడి రాష్ట్ర చరిత్ర నుంచి మొదలుకొని ఇప్పటిదాకా ప్రధాన ప్రతిపక్షం యొక్క వాదనలోని సహేతుకతను, న్యాయాన్ని విని సంపూర్ణంగా ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించడం ఇదే మొదటిసారి అని కేటీఆర్ అన్నారు.
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకను వినిపించిన ఇలాంటి సందర్భం చారిత్రాత్మకం అన్నారు. రాష్ట్ర ప్రజలపైన అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సరైన పద్ధతిలో శాస్త్రీయంగా ఈఆర్సీ ముందు ఉంచడంలో విజయం సాధించామన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు స్వయంగా తనతో పాటు మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు, రాష్ట్ర ఈఆర్సీని కలిసి విద్యుత్ ఛార్జీల పెంపును ఆపాలని కోరామని, ఆ తర్వాత జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొని ప్రజల తరపున వాదనలను గట్టిగా వినిపించారన్నారు
తాను స్వయంగా సిరిసిల్లలో జరిగిన విద్యుత్ ఛార్జీల పెంపు ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని ప్రజల వాదనను ఈఆర్సీకి ఒప్పించడం జరిగిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఈఆర్సీ ప్రజల నుంచి వచ్చిన తీవ్రమైన వ్యతిరేకతను, ప్రజాభిప్రాయ సేకరణను, ప్రధాన ప్రతిపక్షంగా తాము వినిపించిన వాదనలను పరిగణలోకి తీసుకొని ప్రజలపైన భారీ విద్యుత్ భారాన్ని మోపకుండా ప్రభుత్వాన్ని నియంత్రించిన తీరు గొప్పది అన్నారు.
ప్రజలపైన భారీ విద్యుత్ భారం మోపకుండా ప్రజల పక్షాన నిలిచిన ఈఆర్సీకి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి జిల్లా కేంద్రంతో పాటు, నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ చార్జీల పెంపును ఆపినందుకు ప్రజల తరఫున సంబరాలు చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.