- రూ.700 కోట్ల వాటా ప్రకటించిన సీఎం కేసీఆర్
- సింగరేణి కార్మికులు, ఉద్యోగాల్లో హర్షం
సింగరేణి.. తెలంగాణకే తలమానికం. ఈ సంస్థలో ఉద్యోగులు, కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశంలో వెలుగులు నింపుతున్నారు. కానీ సమైక్య రాష్ట్రంలో వీళ్ల బతుకుల్లో నిత్యం చీకట్లే. సంస్థ లాభాల్లో వాటా దక్కినా అది నామమాత్రమే. కేవలం 16 శాతం మాత్రమే వాటా దక్కేది. రాష్ట్రం వచ్చినంక సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వం, సింగరేణి సీఎండీ శ్రీధర్ పర్యవేక్షణలో సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత లక్ష్యాలను అధిగమించడంతో సంస్థకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉద్యోగులు, కార్మికులు 30 శాతం లాభాల వాటా తీసుకుంటున్నారు. సింగరేణికి గత ఆర్థిక సంవత్సరం రూ.2,184 కోట్ల లాభాలు వచ్చాయి. ఇందులో ఉద్యోగులు, కార్మికులకు లాభాల వాటాగా రూ.700 కోట్లు చెల్లిస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల మంచిర్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సందర్భంగా ప్రకటించారు. సింగరేణి సంస్థ ఆర్జించిన లాభాల్లోంచి రూ.700 కోట్లు బోనస్ (వాటా) ప్రకటించడంపై కార్మికులు, ఉద్యోగులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. దసరాకు కార్మికులు ఈ బోనస్ అందుకోనున్నారని సీఎం కేసీఆర్ స్పష్టంగా ప్రకటించడంపై హర్షం వ్యక్తంచేస్తున్నారు. లాభాల బోనస్ తమ ఆర్థిక ప్రయోజనాలు తీర్చనున్నదని కార్మికులు సంతోషపడుతున్నారు.
టీబీజీకేఎస్‌తో లాభాల పంట
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా టీబీజీకేఎస్ కొనసాగడం, కార్మికులు సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో వారి ఆకాంక్ష మేరకు ప్రభుత్వం కార్మికులకు ప్రతి ఏటా లాభాల బోనస్ పెంచుతూ వచ్చింది. గడిచిన తొమ్మిదేండ్లలో టీబీజీకేఏస్ కార్మికులకు 15 శాతం నుంచి సంస్థ లాభాల్లో వాటా పెంచుతూ, గత ఏడాది 30 శాతం సాధించి పెట్టింది. సింగరేణిపై స్పష్టమైన అవగాహన కల్పించి సంస్థపై కార్మికుల్లో మనోధైర్యాన్ని నింపింది. నిజాం కాలం నాటి సింగరేణిని గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేంద్రానికి 49 శాతం అమ్మి నాశనం చేసిందని, నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గనులు ప్రైవేట్‌పరం చేసి నాశనం చేయాలని కుట్ర చేస్తున్నదని చెప్పి కార్మికుల్లో మరోసారి ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చింది. సింగరేణిపై పూర్తి భరోసా, భావితరాలకు పునాదిగా ఉండబోతున్నదని ధీమా కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నది.
కార్మికులు, ఉద్యోగుల్లో ఆనందం
దసరాకు మూడు నెలల ముందుగానే సీఎం కేసీఆర్ సింగరేణి లాభాల్లో వాటా ప్రకటించడంపై కార్మికులు, ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. మంచిగ మస్టర్లు చేసుకున్న కార్మిక సోదరులకు లాభాల వాటా రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు కూడా దక్కుతుందని సంతోషం వ్యక్తంచేస్తున్నారు. తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని, మరింత ఉత్సాహంగా పని చేస్తామని అంటున్నారు. సీఎం కేసీఆర్, సింగరేణి సీఎండీ ప్రత్యేక కృషితో రాబోయే రోజుల్లో సింగరేణి మరింత అభివృద్ధి చెంది, మరిన్ని లాభాలు వచ్చి తమకు ఎక్కువగానే మేలు జరుగుతుందనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తంచేస్తున్నారు. కారుణ్య నియామకాల కింద మా కార్మికుల పిల్లలకు మళ్లీ ఉద్యోగాలు వస్తాయని తాము అనుకోలేదని, సీఎం కేసీఆర్ పట్టుదలతోనే ఇది సాధ్యమైందని సంబురపడుతున్నారు. కారుణ్య నియామకాల్లో మహిళలకు కూడా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కృతజ్ఞతలు తెలుపుతున్నారు.