mt_logo

తెలంగాణ బీజేపీలో వాళ్ల‌కు ప్రాధాన్య‌మే లేద‌ట‌.. కొత్త అధ్య‌క్షుడి వ్యాఖ్య‌ల‌తో షాక్ తిన్న క‌మ‌లం నేత‌లు!

టీబీజేపీలో ఇప్ప‌టికే నాట‌కీయ ప‌రిణ‌మాలు చోటుచేసుకొన్నాయి. బండి సంజ‌య్‌ని అధ్య‌క్ష ప‌ద‌వినుంచి తొల‌గించి కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డికి ఆ పోస్టు క‌ట్ట‌బెట్టారు. ఈట‌ల రాజేంద‌ర్‌కు ఎన్నిక‌ల మేనేజ్‌మెంట్ క‌మిటీ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అప్ప‌టినుంచి తెలంగాణ బీజేపీ ప‌రిస్థితి మూడు ముక్క‌లాట‌గా త‌యారయ్యింది. కొత్త అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌క‌ముందే కిష‌న్‌రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య‌లు క‌మ‌లం నేత‌ల్లో గుబులు రేపుతున్నాయి. బీజేపీలో మొద‌టినుంచి ఉన్న‌వాళ్ల‌కే ప్రాధాన్యం ఉంటుంద‌ని, వేరేపార్టీనుంచి వ‌చ్చినోళ్ల‌కు ప్రాధాన్యం ఉండ‌ద‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెప్ప‌డంతో ర‌ఘునంద‌న్‌రావుతోపాటు ఈట‌ల‌, డీకే అరుణ ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక‌లా త‌యార‌య్యింది.
కిష‌న్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌కు ర‌ఘునంద‌న్‌రావు తెల్ల‌ముఖం!
బాట‌సింగారం డ‌బుల్ బెడ్‌రూంల పేరిట కిష‌న్‌రెడ్డి హైడ్రామా చేశారు. ఎలాంటి అనుమ‌తి లేకుండానే వాటి ప‌రిశీల‌న‌కు బ‌య‌లుదేరారు. శాంతిభ‌ద్ర‌త‌ల దృష్ట్యా ఆయ‌న‌ను పోలీసులు అడ్డుకొని, అరెస్ట్ చేశారు. అనంత‌రం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. త‌మ రాజ‌కీయ జీవిత‌మే పోరాటాల‌తో ప్రారంభ‌మైంద‌ని, తాము పార్టీ మారే వ్య‌క్తులం కాద‌ని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యే రఘునంద‌న్‌రావు ఈ మాట‌లు విని కంగుతిన్నారు. కిష‌న్‌రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేస్తుండ‌గా.. ఆయ‌న ముఖ‌క‌వ‌ళిక‌లే మారిపోయాయి. పార్టీ మారినోళ్ల‌కు బీజేపీ ప్రాధాన్యం ఉండ‌ద‌ని సాక్షాత్తూ కొత్త అధ్య‌క్షుడే అన‌డంతో ర‌ఘునంద‌న్‌తోపాటు ఈట‌ల రాజేంద‌ర్‌, డీకే అరుణకు ఇక పార్టీలో ఏం ప్రాధాన్యం ఉంటుంద‌ని వారి అనుచ‌ర వ‌ర్గాలు గుస‌గులాడుతున్నాయి. కిష‌న్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌తో పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలు మ‌ళ్లీ ఒక‌సారి బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.