కాషాయ పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకొంటారు. దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు ఇస్తామని బీరాలుపోతారు. తమది అన్యాయాలను ఎదురించే పార్టీ అంటూ జనాల్లో ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, క్షేత్రస్థాయిలో నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీ నేతలమని, తమ వెనుక బడా నాయకులున్నారని చెప్పుకొంటూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఇందుకు సిరిసిల్లలో తాజాగా జరిగి ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. బీజేపీ నేతలు తన ఇంటిని అక్రమంగా వారి పేర రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారని ఓ అమాయకపు మహిళ సాక్షాత్తు బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కు ఫిర్యాదు చేయడం సిరిసిల్లలో కలకలం రేపుతున్నది. బీజేపీ నాయకుల అక్రమాలకు అద్దం పడుతున్నది.
తన ఇంటిని ఇప్పించాలని బండి సంజయ్ కాళ్లపై పడ్డ మహిళ
సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన షమీం సుల్తానాకు తంగళ్లపల్లిలోని టెక్స్‌టైల్స్ పార్కులో ఇల్లు ఉంది. ఈ ఇంటికోసం ఆమె కొడుకుతో గొడవ జరుగుతున్నది. దీన్ని పరిష్కరిస్తామని చెప్పి బీజేపీకి చెందిన రాజాసింగ్, కమలాకర్ నమ్మబలికారు. ఆ ఇంటిని వారిపేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకొన్నారు. అనంతరం షమీం సుల్తానా పేరు మీదకి మారుస్తామని బుకాయించారు. రిజిస్ట్రేషన్ చేయాలని అడిగితే.. ప్రాణాలు తీస్తామని బెదిరిస్తున్నారంటూ బాధిత మహిళ సిరిసిల్లలోని సాయికృష్ణ కల్యాణ మండపంలో బీజేపీ నియోజకవర్గ సమావేశానికి హాజరైన బండి సంజయ్‌కి ఫిర్యాదు చేసింది. తన ఇంటిని బీజేపీ నేతలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బండి దృష్టికి తీసుకెళ్లింది. తన ఆస్తిని తనకు ఇప్పించి ప్రాణ రక్షణ కల్పించాలని బండి సంజయ్ కాళ్ల మీద పడి మరీ వేడుకొన్నది. దీంతో అక్కడే ఉన్న బీజేపీ నేతలు బాధిత మహిళలను బలవంతంగా స్టేజీ మీద నుంచి పంపించారు. ఈ ఘటనతో బీజేపీ నాయకుల అసలు రంగు బయటపడిందని సిరిసిల్ల ప్రజలు పేర్కొంటున్నారు. మత ఘర్షణలు రేపే, అక్రమాలు, అన్యాయాలకు పాల్పడే కాషాయ పార్టీని తాము నమ్మబోమని చెప్తున్నారు.