mt_logo

గ్రేట‌ర్‌లో బీజేపీకి నో బ‌ల‌మైన‌ క్యాడ‌ర్‌.. టికెట్ల కోసం అల్లాట‌ప్పా లీడ‌ర్ల అప్లికేష‌న్‌!

రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి అత్యంత దారుణంగా త‌యారైంది. బండి సంజ‌య్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పుకొని.. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ప‌ద‌వి చేప‌ట్టాక కాషాయ హ‌వా పూర్తిగా ప‌డిపోయింది. ఇందుకు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిస్థితే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తున్న‌ది. రాబోయే ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు గ్రేటర్‌లో ఒకటి రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన ఏ నియోజకవర్గానికి కూడా సరైన అభ్యర్థులు దొర‌క్క‌పోవడం ఆ పార్టీ దుస్థితికి అద్దంప‌డుతున్న‌ది. ఇటీవ‌ల ఆ పార్టీ రాబోయే ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తు కోర‌గా, ఒక్కో సీటుకు 20 మంది దాకా అల్లాట‌ప్పా లీడ‌ర్ల‌నుంచే ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. త‌మ‌ కంటే గొప్ప లీడ‌ర్ ఎవ్వ‌రంటూ ముక్కూ మొఖం తెలియ‌న చోటామోటా లీడ‌ర్లంతా ద‌ర‌ఖాస్తు చేసుకొన్నార‌ని ఆ పార్టీ వ‌ర్గాలే అసహ‌నం వ్య‌క్తంచేస్తున్నాయి. 

సీట్ల లొల్లి ఇప్ప‌ట్లో తేలేనా?

ఎమ్మెల్యే సీట్ల‌కోసం ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి 20కి పైగా ద‌ర‌ఖాస్తులు బీజేపీ ఆఫీస్‌కు చేరాయి. కంటోన్మెంట్‌, సికింద్రాబాద్‌, ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌, ఎల్బీనగర్‌, మలక్‌పేట, నాంపల్లి తదితర నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 20 నుంచి 40 దరఖాస్తులు రావ‌డంతో కాషాయ అధిష్ఠానం కంగుతిన్న‌ది.  కంటోన్మెంట్‌ టికెట్‌ కోసం ఏకంగా 22 మంది దరఖాస్తు చేసుకోగా అందులో మాజీ మంత్రి శంకర్రావు కూతురు సుస్మిత కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప్రాంతం నుంచే ఉద్యోగ సంఘం నాయకుడు, మరొక జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకొన్నారు. ఇక  సికింద్రాబాద్‌లో అభ్యర్థులు కరువయ్యారు. అంద‌రూ కొత్త‌వాళ్లే ద‌ర‌ఖాస్తు చేసుకొన్నారు. ఈ ద‌ర‌ఖాస్తుల‌న్నీ స్క్రుటినీ చేసి, టికెట్లు కేటాయించేస‌రికి పుణ్య‌కాలం కాస్తా గ‌డిచిపోతుంద‌ని బీజేపీ అధిష్ఠానం ఆందోన చెందుతున్న‌ది. ఓ వ‌ర్గానికి టికెట్ కేటాయించి, మ‌రో వ‌ర్గానికి కేటాయించ‌క‌పోతే అంత‌ర్గ‌త క‌ల‌హాలు ఏర్ప‌డి పార్టీ నామ‌రూపం లేకుండా పోతుంద‌ని అంత‌ర్మ‌థ‌నం చెందుతున్న‌ది. అస‌లు ఈ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఎందుకు పెట్టామా? అని బీజేపీ అగ్ర‌నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకొంటున్నారు.