mt_logo

ఈ అభివృద్ధి ఆగకూడదు

By మనోహరా చారి

మనదేశంలో వున్నన్ని రాజకీయపార్టీలు ప్రపంచంలో మరేదేశంలో లేవని కచ్చితంగా చెప్పవచ్చు. ప్రస్తుత లోకసభలో 36 పార్టీలకు చెందిన సభ్యులున్నారు. దేశాన్ని ఏలేది ఒక పార్టీ అయితే, రాష్ట్రాల్లో వున్న పార్టీలు మరో రకం. వివిధ ప్రాంతీయపార్టీలు మనదేశంలో కొన్నిరాష్ట్రాల్లో ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. ప్రాంతీయపార్టీలు ఎప్పుడూ స్థానిక సమస్యల మీద ఆధార పడివుంటాయి. పెండింగులో వున్న అనేక స్థానిక సమస్యలను కేంద్రంతో పోరాడి మరీ సాధించుకుని ప్రజల మన్ననలను పొందటానికి ఈ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి.

ఈ కోవలోకే చేరుతాయి మన తెరాస గానీ, ఏఐడీఎంకే గానీ, తృణమూల్ కాంగ్రెస్ మొదలైనవి. తెరాస ఏర్పడిందే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. అనేక పోరాటాలు, అరెస్టులు, పోలీసుల లాఠీ దెబ్బలు, బందులు, హర్తాళ్లు, ఒకటేమిటి… ప్రతిరోజూ ఏదో ఒక పోరాటం.. ఇళ్లల్లో ఎవరూ ఉండలేదు.. అందరూ రోడ్లమీద, లేదంటే సభలూ, సమావేశాల్లో పాల్గొనేవారు.. ప్రతివారిలోనూ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష. పరాయివారు ఎవరో వున్నారు. వారిని వెళ్లగొట్టి మనింట్లో మనం ఉందాం అనే భావన. ఇంతటి ఒక బలమైన, అత్యంత జటిలమైన సమస్య తెలంగాణ రాష్ట్ర సాధన. ప్రజల్లోఒక బలమైన సెంటిమెంటుగా నాడు ప్రజల్లో ఉండేది. స్వాతంత్య్రం సిద్ధించిన కొత్తలో నుంచి సుమారు ఏడు దశాబ్దాలుగా పెండింగ్‌లో వున్న తెలంగాణ రాష్ట్రాన్ని చివరికి కేసీఆర్ నాటి కేంద్రంతో పోరాడి సాధించారు. దశాబ్దాల కాలంలో మనం ఏమి కోల్పోయామో కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రజలకు వివరించారు. నీళ్లు, నిధు లు, నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రం బహుశా ఎన్నటికీ కోలుకొని స్థాయిలో దిగజారిపోయిన వైనాన్ని ప్రజల ముందుపెట్టారు. అయినప్పటికీ, వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయ వ్యయాల్ని లెక్కలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కంకణం కట్టుకుని మరీ పోరాడుతున్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్షానికి గురై, మరమ్మతులకు నోచుకోకుండా వున్న46 వేల పైచిలుకు చెరువులను మిషన్ కాకతీయ తో పునరుద్ధరిస్తున్నారు. గత నాలుగేండ్ల కాలంలో మిషన్ భగీరథ కూడా పూర్తి కావచ్చింది.

రాష్ట్ర చరిత్రలోనే అత్యంత భారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నట్టి కోటి ఎకరాల మాగాణి కోసం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పాటుగా అనేక పెండింగ్ ప్రాజెక్ట్ లను పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇటీవలే ప్రారంభించిన మరో పథకం కంటి వెలుగు. పేదలు, శ్రీమంతులు అనే తేడా లేకుండా అవసరమనుకునే అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయిస్తున్నది. కంటి అద్దాలు, మందులు కూడా ఉచితంగానే పంపిణీ చేయడం ఒక బృహత్కార్యం. ధరణి వెబ్ సైట్‌తో భూ రికార్డుల ప్రక్షాళన, అన్ని బీసీ కులాలవారికి ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలంతో పాటుగా కోట్ల రూపాయల మంజూరు చేసింది. ఇవన్నీ జరుగలేదని అనేవారు తమ గుండెల మీద చేయి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోవాలి.

చెరువుల పునరుద్ధరణతో వేలాది చెరువులు నీటితో జలకళ సంతరించుకున్నాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు అందుతున్న వైనాన్ని ప్రజలు చూస్తున్నారు. 99 నియోజకవర్గాల్లోని సుమారు 2 కోట్ల 32 లక్షల మందికి మంచినీరు అందించే మిషన్ భగీరథ పూర్తయే దిశలో వున్నది. ఇక పింఛన్లు, ఉచిత రేషన్ బియ్యం పొందని గ్రామాలూ ఏమైనా వున్నాయోనని ప్రజలు ఎవరికివారు తెలుసుకోవాలి. ఈ నాలుగేండ్లలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, వివిధవర్గాలకు ఆసరా పింఛన్ల అందిస్తున్నది. విద్యార్థులకు సన్న బియ్యం, పేదింటి ఆడ పిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రభుత్వ దవఖానల్లో ప్రసవాల ప్రోత్సాహం కోసం కేసీఆర్ కిట్, ఎకరానికి 4 వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి 8 వేల రూపాయలను రైతులకు పంట పెట్టుబడి కింద రైతుబంధు పథకం అమలు చేస్తున్నది. 18 నుంచి 59 ఏండ్ల వయసున్న రైతులందరికీ 5 లక్షల రైతు బీమా పథకం, స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలాగా నిరుద్యోగులు లాభపడే విధంగాకొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటైంది. పరిశ్రమలకు తొందరలో అనుమతి వచ్చేలాగా ఏర్పాటైన టీఎస్ ఐపాస్, అత్యంత వెనుక బడిన కులాల కోసం ఎంబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మొదలైన ఎన్నో పథకాలు తెరాస ప్రభు త్వం గత నాలుగేండ్ల కాలంలో తీసుకుని వచ్చింది. వీటిలో పింఛన్లు మినహా అన్ని పథకాలు కొత్తవే. గతంలో 50 నుంచి 75 రూపాయలు, ఆ తరువాత కాలంలో రెండు నుండి అయిదు వందలు పొందిన పింఛన్‌దార్లు ప్రస్తుతం తమకు తామే ఆలోచించుకుంటే ఎంత సొమ్ము అదనంగా వస్తున్నదో తేల్చుకోవాలి.

ఎన్నికలు వచ్చినపుడల్లా అన్ని పార్టీలు రంగంలోకి దిగుతాయి. వివిధ పార్టీలు జతకడతాయి. గొప్పగా మ్యానిఫెస్టోలు ప్రకటిస్తాయి. గత ప్రభుత్వాల కన్నా తాము అధికారంలోకి వస్తే, బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేస్తామని, సాధ్యమైతే అన్నీ ఉచితంగానే ఇస్తామనే వాగ్దానాలు చేస్తాయి. చివరికి ఏదో ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.అది సహజమేకావొచ్చు. కానీ పథకాల మాటేమిటి…? కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చిస్తూ అమలు చేస్తున్న భారీ పథకాలైన కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ, రైతులకు పంట పెట్టుబడి, దురదృష్టవశాత్తు రైతు చనిపోతే వారికిచ్చే 5 లక్షల బీమా సొమ్ము… ఇవన్నీ అమలవుతాయా.. ? ప్రభుత్వాలు మారితే వీటిని ఎవరు పూర్తి చేస్తారు…. నిజంగా ఈ పథకాలన్నీ చెడ్డవా? లేక మంచివా? ఇవి ప్రజల కోసం చేపట్టిన పథకాలు కావా? ఈ పథకాలు మధ్యలో ఆగితే ఎవరు ఇందుకు బాధ్యులు? ఇవన్నీఎవరికి వారు ఆలోచించుకోవాలి.

ప్రభుత్వాలు వస్తుంటాయి. పోతుంటాయి. కానీ పథకాలు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ముంబై -పూనా ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం చేపట్టే ముందు ఆ రహదారి ప్రాధాన్యాన్ని నాటి మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరించింది. ఎన్నికల్లో ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ రహదారి నిర్మాణంలో రాజకీయాలకు చోటు ఇవ్వకుండా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి రహదారి నిర్మాణం పూర్తి చేయాలనే ఒప్పందంతో ఆ రహదారి నిర్మాణం పూర్తి జరిగింది. రహదారి నిర్మాణం మొదలైనపుడు ఒక ప్రభుత్వం వుంటే, రహదారి పూర్తయినపుడు మరొక ప్రభుత్వం అధికారంలో వుంది. తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం కావాలంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరం. ప్రపంచ ఇంజినీరింగ్ సిబ్బంది అబ్బురపడే విధంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే కూడా రాజకీయాలకు తావు ఇవ్వరాదు. రాష్ట్రంలో 99 నియోజక వర్గాల్లోని 24,225 గ్రామాలూ, పల్లెల్లో నివసిస్తున్న 2 కోట్ల 32 లక్షల మందికి మంచినీరు అందించే విధంగా 1 లక్ష 69 వేల 705 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి కొత్తగా 36 వేల ఓవర్ హెడ్ రిజర్వాయర్లను నిర్మించి ప్రతి వ్యక్తి కి కనీసం వంద లీటర్ల మంచినీరు అందించాలని చేపట్టిన మిషన్ భగీరథపథకంలో కూడా రాజకీయాలకు తావు ఇవ్వరాదు. ఆగస్ట్ 15 నుంచి ప్రారంభించిన రైతు బీమా పథకంలో కూడా రాజకీయాలకు తావు ఇవ్వరాదు.

టీఎస్ ఐ పాస్ ద్వారా వస్తున్న వందలాది పరిశ్రమల్లో రాజకీయాల జోక్యం వుండకూడదు. ఏటా రంజాన్, క్రిస్మస్ బతుకమ్మ పండుగల రోజుల్లో ప్రభుత్వం పంపిణీ చేయాలనుకున్న దుస్తుల కోసం లక్షలాది మంది చేనేత కార్మికులకు ఉపాధి లభిస్తున్నది. ఈ విషయంలో కూడా రాజకీయాలకు తావు ఇవ్వరాదు. ఎన్నికలప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసే అభ్యర్థి కూడా తాను గెలిస్తే గొప్ప పనులు చేసి పెడతానంటాడు. ప్రతి రాజకీయ పార్టీ తమను గెలిపించాలని ప్రజలకు దండాలు పెడుతుంటారు. అయితే ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వుండాలి. ఓటు వేసే ముందు ఎవరికివారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *