బతుకమ్మ పాటలు న్యూజీలాండ్ లో మార్మోగాయి. ఆ దేశ రాజధాని ఆక్లండ్ సిటీ బతుకమ్మ ఆటాపాటలతో పులకించింది. తెలంగాణ జాగృతి న్యూజీలాండ్ శాఖ, న్యూజీలాండ్ తెలంగాణ సంఘం సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు కన్నులపండువగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపి శ్రీమతి కల్వకుంట్ల కవిత బతుకమ్మ సంబురాలకు హాజరయ్యారు. బతుకమ్మల తయారీలో ఆక్లండ్‌లో ఉంటున్న తెలంగాణ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కవిత బతుకమ్మ పాటలకు కోరస్ ఇస్తూ…తమకు వచ్చిన పాటలను కూడా వారు పాడారు. అనంతరం బతుకమ్మ ఆట ఆడారు. కవిత ఆక్లండ్ కు రావడం సంతోషంగా ఉందన్నారు పలువురు ప్రవాస తెలంగాణీయులు. చిన్నపిల్లల సంతోషం అంతా ఇంతా కాదు. తెలంగాణలోని పల్లెల్లో కనిపించే బతుకమ్మ పండుగ వాతావరణం ఆక్లండ్‌లోనూ కనిపించింది. ఈ కార్యక్రమంలో న్యూజీలాండ్ తెలంగాణ సంఘం అధ్యక్షులు కళ్యాణ్ రావు కాసుగంటి, ప్రధాన కార్యదర్శి దయాకర్ బచ్చు, కోశాధికారి దయానంద్ కటకం తదితరులు పాల్గొన్నారు.