తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను అంధ్రాలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని మోడీకి చెప్పానని చంద్రబాబు ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో చెప్పారు అని తెలిపారు.
ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడంపై తెలంగాణ బంద్‌కు బీఆర్ఎస్ పిలుపినిచ్చింది. పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలుగా మేము కొట్లాడాము. లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు ఆంధ్రాకు వెళ్ళింది. ఏడు మండలాలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడలేదు అని పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏపీలో పని చేసిన ఆదిత్యనాధ్ దాస్‌ను తెలంగాణ ఇరిగేషన్ సలహాదురుగా నియమించారు. పది సంవత్సరాల తర్వాత తెలంగాణపై చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి కుట్రలు మొదలుపెట్టారు అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఒక్క నాడు జై తెలంగాణ అనలేదు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఐదు మండలాలను తెలంగాణలో కలపాలి. భద్రాచలం రూరల్ మండలంలో ఉన్న యటపాక, కన్నాయిగూడెం, పురుషోత్తపట్నం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలను తెలంగాణలో కలిపే విధంగా రేవంత్ రెడ్డి కృషి చేయాలి అని సుమన్ అన్నారు.
రాష్ట్రంలో కరెంటు కోతలు నడుస్తున్నాయి.. రైతులకు విత్తనాలు సరిగా అందించడం లేదు. ఆదిత్యనాధ్ నియామకాన్ని వెంటనే రద్దు చేయాలి. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకొము అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అంటేనే కమీషన్ల ప్రభుత్వం.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేసీఆర్ పైన కమీషన్లు వేస్తూ కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారు. సింగరేణి బొగ్గు గనులను సింగరేణి సంస్థకు కేటాయించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పని చేయాలి అని హితవు పలికారు.
పార్లమెంట్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఐటీఐఆర్ బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాలి. తెలంగాణ సమస్యల కోసం కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో మాట్లాడాలి అని కోరారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సివిల్ సప్లైస్‌లో జరిగిన కుంభకోణంపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. రైస్ టెండర్లు, ప్యాడీ టెండర్లు రద్దు అయ్యాయా లేదా అని అడిగారు.
సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖపై ఎందుకు రివ్యూ చేయడం లేదు. సివిల్ సప్లైస్ కమీషనర్ అందుబాటులో ఉండటం లేదు. మా దగ్గర ఉన్న ప్యాడీని లిఫ్ట్ చేయాలని రైస్ మిల్లర్లు జిల్లా కలెక్టర్లకు లేఖలు ఇచ్చారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు రైస్ మిల్లర్ల దగ్గర డబ్బులు మాత్రమే అడుగుతున్నారు అని తెలిపారు
సివిల్ సప్లైస్ కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి పాత్ర వుంది.. త్వరలోనే సివిల్ సప్లైస్ భవన్‌ను ముట్టడిస్తాం అని పేర్కొన్నారు.