mt_logo

కాంగ్రెస్ పార్టీది ప్రజా పాలన కాదు.. దగా పాలన: బీఆర్ఎస్ నేత బాల్క సుమన్

నిరుద్యోగులు, యువతకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తుక్కుగూడ సభలో రాహూల్ గాంధీ నోటితో పచ్చి అబద్ధాలు మాట్లాడించారు. పాపం రాహూల్ గాంధీకి ఏం తెలియదు రేవంత్ రెడ్డి ఏం చెబితే అది మాట్లాడి పోయాడు అని అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు.. మేము ఇచ్చిన ఉద్యోగాలను వాళ్లు ఏదో ఇచ్చినట్లుగా డబ్బా కొట్టుకున్నారు. బీఆర్ఎస్ హయంలోనే 503 ఉద్యోగాలకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం.. వీటికీ మరో 60 ఉద్యోగాలు కలిపి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లు డబ్బా కొట్టుకుంటున్నారు అని విమర్శించారు.

మేము ఇచ్చిన ఉద్యోగాలను వాళ్ళు ఇచ్చినట్లు చెప్పుకోవడం సిగ్గు చేటు. కాంగ్రెస్ పార్టీ జాబ్ క్యాలెండర్ పేరిట మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్ని పేపర్‌లో యాడ్స్ ఇచ్చారు.. మేము ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను వాళ్లు ఇచ్చినట్లు పెద్ద పెద్ద యాడ్స్ ఇచ్చి గొప్పలు చెప్పుకున్నారు.. నిరుద్యోగులు ఇవన్ని గమనిస్తున్నారు అని పేర్కొన్నారు.

టెట్ పరీక్ష ఫీజ్ వెంటనే తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈరోజే చివరి తేది. 1500లకు పైచిలుకు గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి అని గతంలో మాట్లాడారు.. ఇప్పుడెందుకు 560 ఉద్యోగాలు మాత్రమే రిలీజ్ చేశారో చెప్పాలి. మందికి పుట్టిన బిడ్డను మా బిడ్డ అని చెప్పుకునట్లు 30 వేల ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.

ప్రజలు మోస పోవడానికి సిద్దంగా అంటారు.. ప్రజలున్నది తమ లాంటి రాజకీయ నాయకుల చేతిలో మోసపోవడానికే అని ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డే చెప్పాడు.. పచ్చి అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలి. 25 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఆ డబ్బులను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు, పొంగులేటి కాంట్రాక్టు ఖాతాలోకి వెళ్లాయి అని సుమన్ ఆరోపించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుందో రేవంత్ రెడ్డి మీడియాకు డైరెక్ట్ చెప్పొచ్చు కదా.. చెప్పకుండా ప్రతి రోజు ఏదో ఒక లీక్ చేస్తూ పబ్బం గడుపుతున్నారు. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. నీళ్ళు లేక అవస్థలు పడుతుంటే వీటిని పట్టించుకోకుండా అటెన్షన్ డైవెర్షన్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి చేస్తుండు అని దుయ్యబట్టారు.

ఇక్కడ జరుగుతోంది ప్రజా పాలన కాదు.. నయవంచన పాలన, దగా పాలన.. తెలంగాణ సంపద అంతా డిల్లీకి చేర వేస్తుండు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థులు డమ్మీ అభ్యర్థులే. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు.. కిషన్ రెడ్డి గెలుపు కోసం దానం నాగేందర్‌ను మా పార్టీ నుండి తీసుకోని ప్రకటించాడు అని అన్నారు.

మోడీ బడే భాయ్.. రేవంత్ రెడ్డి ఛోటే భాయ్.. మోడీ చెప్పినట్లుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి డమ్మీ అభ్యర్థులను ప్రకటించారు.కొడంగల్ పోయి ముసలి కన్నీరు కారుస్తున్నడు రేవంత్ రెడ్డి.. మొన్నటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు.. ఇవ్వాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒక్కటే అని పేర్కొన్నాడు.

రెండు పార్టీల కంటే బీఆర్ఎస్ పార్టీనే బలమైన పార్టి అందుకే మా పార్టీ నాయకులను, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తీసుకుని అభ్యర్థులగా పెట్టుకున్నారు అని సుమన్ అన్నారు.