ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయి అని మండిపడ్డారు.
తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బాల్క సుమన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజల దృష్టిని మళ్ళించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఏవీ నెరవేర్చలేదు అని అన్నారు.
తొమ్మిది నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు.. జాబ్ క్యాలెండర్ తూతూ మంత్రంగా ప్రకటించారు. తెలంగాణ సుపరిపాలన లేదు.. దరిద్రపు పాలన నడుస్తోంది అని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసింది కేవలం రూ. 17,933 కోట్లు మాత్రమే. ఎంత మంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడ్డాయనేది ఇంత వరకు ప్రకటించలేదు. రుణమాఫీ పచ్చి మోసం, దగా ఇచ్చిన హామీలు చర్చకు రావొద్దనే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అని దుయ్యబట్టారు.
సునీల్ కనుగోలు స్క్రిప్ట్ ప్రకారమే తిట్ల పురాణం.. హైడ్రా డ్రామాలు. అర్హత లేని వాళ్ళు అందలం ఎక్కారు. ఇందిరమ్మ రాజ్యంలో అవినీతి కుటుంబ పాలన, దందాలు నడుస్తున్నాయి అని అన్నారు.
పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీది ఒక విధానం.. రేవంత్ రెడ్డికి ఇంకో విధానమా. హైడ్రా పేరుతో భయపెట్టి వసూళ్ల దందా చేస్తున్నారు అని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిలింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్.. తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టిన సిపాయి హిమాయత్ సాగర్‌లో ఉన్న ఆనంద కన్వెన్షన్ ఎందుకు కూల్చలేదు. నాగార్జునను రూ. 400 కోట్లు డిమాండ్ చేశారు.. ఇవ్వనందుకే కూల్చారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌజ్‌లను కూల్చరు. ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు అని సుమన్ ధ్వజమెత్తారు
ప్రజాపాలన నడుస్తలేదు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్‌తో పాటు మా నాయకుల వ్యక్తిత్వాల మీద సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్‌లు పెడుతున్నారు. రేవంత్ టీమ్‌లో ఉండి ఫేక్ న్యూస్‌లు పెడుతున్న వారిని కేసీఆర్, కేటీఆర్ వదిలిపెట్టినా నేను వదిలిపెట్టను అని హెచ్చరించారు.