
హైదారాబాద్: సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకొనే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలకు ఇక అతిత్వరలోనే గృహయోగం రానున్నది. ఇప్పటికే పైసా ఖర్చులేకుండా నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇచ్చిన తెలంగాణ సర్కారు.. సొంత జాగాలో తమకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవాలనే నిరుపేదల కోసం బీఆర్ఎస్ సర్కారు గృహలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకం మార్గదర్శకాలను గత నెలలోనే ప్రభుత్వం విడుదల చేసింది. సొంత జాగా ఉన్న అర్హులకు రూ. 3లక్షల సాయం చేయనున్నది. ఇందుకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నది. దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తారు. దీంతోపాటు లోకల్ ఎమ్మెల్యే, జిల్లా మంత్రికి దరఖాస్తులను నేరుగా సమర్పించవచ్చు. దరఖాస్తులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో స్క్రుటినీ చేస్తారు. అర్హులను గుర్తించి, జాబితాను రూపొందిస్తారు. ఈ స్కీంకు జిల్లాలో అయితే కలెక్టర్, జీహెచ్ఎంసీ పరిధిలో అయితే కమిషనర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొన్నది. ఒకవేళ దరఖాస్తుల సంఖ్య ఎక్కువగా ఉంటే వెయిటింగ్ లిస్ట్ కూడా రూపొందిస్తారు. అందరికీ ప్రాధాన్యతా క్రమంలో రూ.3లక్షల సాయం అందజేస్తారు.
గృహలక్ష్మి పూర్తి విశేషాలు..
-ఈ పథకం కోసం తెలంగాణ సర్కారు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.12,000 కోట్లు కేటాయించింది.
-ఒక్కో నియోజకవర్గంలో కనీసం 3000 ఇండ్ల చొప్పున మంజూరు చేస్తారు.
– స్టేట్ రిజర్వు కోటా కింద 43,000 కలిపి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా
4 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
– ఈ ఇండ్లను మహిళల పేరుమీదే మంజూరు చేస్తారు.
-బడుగు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు-20 శాతం, ఎస్టీలకు-10 శాతం, బీసీలు, మైనారిటీలకు 50 శాతానికి తగ్గకుండా కేటాయిస్తారు.
-లబ్ధిదారులు తమకు ఇష్టమొచ్చిన రీతిలో ఇల్లు కట్టుకొనే వెసులుబాటు ఉంటుంది.
-ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి రూ. లక్ష చొప్పున మూడుసార్లు డబ్బులు మంజూరు చేస్తారు.
-లబ్ధిదారు నిర్మించుకోబోయే ఇంటిలో రెండు గదులు, టాయ్‌లెల్ మాత్రం తప్పకుండా ఉండాలి.
-లబ్దిదారుకు లేక ఇంట్లో ఎవరిపేరునైనా తప్పనిసరిగా ఆహార భద్రతకార్డు, లోకల్ ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డు తప్పనిసరి.