mt_logo

అపూర్వ విజయం

తెలంగాణ రాష్ట్ర తొలి ఎన్నికల సంగ్రామంలో స్వీయ రాజకీయ శక్తియైన తెలంగాణ రాష్ట్ర సమితి విజయదుందుభి మోగించడం చరిత్రాత్మక ఘట్టం. సంపూర్ణ తెలంగాణ ఇవ్వకుండా అడ్డుపడడంతోపాటు, ఇక్కడ తిష్టవేసిన సీమాంధ్ర వ్యాపార శక్తులు నయావలసవాద పాలన సాగించాలని కుట్రలు పన్నుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఇంటి పార్టీకి అనుకూలంగా విస్పష్టమైన తీర్పు ఇవ్వడం ప్రశంసనీయం. టీఆర్‌ఎస్ ఉత్తర తెలంగాణకే పరిమితం కాకుండా అన్ని జిల్లాలలో ఉనికిని, సత్తాను చాటుకున్నది. దీనివల్ల తెలంగాణవ్యాప్త ఆమోదం లభించినట్టయింది. పూర్తి మెజారిటీ సాధించడం ద్వారా చిన్న రాష్ర్టాలు అస్థిరతకు ఆలవాలమని ఆధిపత్య శక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టింది.

మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిష్క్రియాపరత్వంతో విసిగిపోయిన ప్రజలకు మోడీ ఘటికుడైన నాయకుడిగా కనిపించారు. ఒకే పార్టీకి పట్టం కట్టినంత మాత్రాన భారతీయ సమాజం వైవిధ్య భరితమైందనే వాస్తవాన్ని మోడీ మరిచిపోకూడదు. ప్రాంతీయ శక్తుల అస్థిత్వాన్ని విస్మరించినప్పుడు ఎంత దృఢమైన దేశాలైనా సంక్షోభాల పాలయ్యాయి. తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పులోని అంతరార్థాన్ని మోడీ గ్రహించి వ్యవహరిస్తాడని ఆశిద్దాం.

తెలంగాణ అస్థిత్వ పోరాటంలో భాగంగా రాష్ట్ర సాధన ఉద్యమం సాగింది. ఆ తరువాత వచ్చిన ఎన్నికల ఘట్టాన్ని ప్రజలు ఈ పోరాటానికి కొనసాగింపుగానే గుర్తించారు. కేసీఆర్ ఈ సందేశాన్ని ప్రజలకు చేరవేయడంలో కృతకృత్యులయ్యారు. ఉద్యమాలతో రగిలిపోయిన గడ్డమీద ఎన్నికల బాట పట్ల విశ్వాసం కలిగించడంతో పాటు, తాను నమ్మిన బాటలో లక్ష్యాన్ని సాధించడం కేసీఆర్ ఘనత. వ్యూహంలో, ఎత్తుగడలలో కేసీఆర్‌కు వర్తమాన రాజకీయాలలో మరెవరూ సాటి కాలేకపోయారు. ఉపఎన్నికలను సృష్టించడం, తాను వ్యతిరేకించే రాజకీయ పార్టీతోనే పొత్తు పెట్టుకోవడం వంటి కొన్ని చర్యలలోని ఔచిత్యం చర్చానీయాంశం అవుతుండేది. అవన్నీ దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని నమ్మేవారూ ఉన్నారు. ఏది ఏమైనా ఆయన ప్రత్యర్థుల అంచనాలకు అందకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. రాష్ట్ర సాధన తరువాత కూడా ఎన్నికల కోసం మిగిలిన కొద్ది వ్యవధిలోనే కేసీఆర్ వేగంగా పావులు కదిపారు. తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తరువాత ఢిల్లీ నుంచి రాగానే విమానాశ్రయం నుంచి అమరవీరుల స్థూపం వరకు సాగించిన ఊరేగింపు- విజయ ఫలానికి తానే అర్హుడిననే సందేశాన్ని పరోక్షంగా ప్రజల్లోకి తీసుకు వెళ్ళడానికి దోహదపడింది.

ఆయన తెలంగాణ గడ్డమీద వేసిన తొలి అడుగే ఎన్నికల యుద్ధ క్షేత్రంలో వేశారనేది ప్రత్యర్థులు అర్థం చేసుకునే లోగానే ఆయన అధికార సౌధానికి చేరువయ్యారు. కాంగ్రెస్‌తో విలీనం వల్ల స్వీయ రాజకీయ అస్థిత్వం ఏర్పడదని భావించి ఒంటరి పోటీకి దిగారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీగా మాత్రమే ప్రజల ముందుకు వెళ్లలేదు. తెలంగాణ సాధనా లక్ష్యం ఇంకా అసంపూర్ణంగానే ఉండిపోయిందని, దానిని సాధించడానికి తమ నాయకత్వం అవసరమని ప్రజలకు వివరించగలిగారు. తెలంగాణ పునర్నిర్మాణంపై కేసీఆర్‌కు స్పష్టత ఉన్నదనే అభిప్రాయం జనానికి ఏర్పడింది. ఆయన పునర్నిర్మాణమనేది అస్పష్ట భావనగా చూపలేదు. కోటి ఎకరాలకు సాగునీళ్ళు, రెండు గదుల ఇల్లు వంటి నిర్ధిష్ట అంశాలతో ఎన్నికల ప్రణాళిక రూపొందించి దానిని ప్రచారం చేసుకోగలిగారు. తెలంగాణ అంతా సుడిగాలిలా చుట్టి ప్రభంజనం సృష్టించగలిగారు. సీమాంధ్ర శక్తులు తెరచాటు ఎత్తుగడలు వేయలేదని చెప్పలేము. కానీ ఆయన విశ్వరూపం ముందు ఆ మాయోపాయాలు పారలేదు.

2009లోనే తెలంగాణ ఇచ్చి ఉంటే కాంగ్రెస్ తామే ఇచ్చామని, తెచ్చామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉండేది. సోనియా మీద ప్రజలలో ఉన్న సదభిప్రాయాన్ని కూడా ఓట్లుగా మలుచుకోలేని అర్భకత్వం కాంగ్రెస్ నాయకులది. బీజేపీ ఒంటరిగా టీఆర్‌ఎస్‌ను ఢీకొంటే కొంత అనుకూలత వ్యక్తమయ్యేది. కానీ టీడీపీతో పొత్తు, పవన్ కళ్యాణ్ ప్రచారం ప్రతికూల ఫలితాలనిచ్చాయి. చివరకు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యర్థులే లేకుండా పోయారు. అధికారం కట్టబెట్టడం ద్వారా టీఆర్‌ఎస్‌పై ప్రజలు ఎంతో బాధ్యతను కూడా పెట్టారు. ఈ బాధ్యతను నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. సీమాంధ్రతో గల నీటి పంచాయితీని పరిష్కరించుకుంటూ, భారీ ధన వ్యయంతో కూడుకున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలె. ఎన్నికల ప్రణాళికను అమలు చేయడానికి అవసరమైన నిధులు కూడగట్టడం కూడా తేలిక కాదు. అయితే ప్రజా సంక్షేమ పథకాలు ప్రకటించడాన్ని మేధావులు ఎప్పుడూ తప్పు పట్టకూడదు. దానిని అమలు చేసే విధానాలు సూచించాలె. పారిశ్రామిక సంస్థలకు కోట్లు వెచ్చించి, ప్రజల అవసరాలను విస్మరించే విధానాలకు భిన్నంగా ప్రజల అవసరాలకు ప్రాధాన్యమివ్వడమే మంచి పద్ధతి. వీటిని అమలు పరచడంలోనే రాజకీయ నాయకుల దక్షత వెల్లడవుతుంది.

బంగ్లాదేశ్ యుద్ధానంతరం 1972లో దేశమంతా ఇందిరాగాంధీ ప్రభంజనం వీస్తున్నప్పుడు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజాసమితికి ఘనవిజయం కట్టబెట్టారు. ఇప్పుడు దేశమంతా మోడీ గాలి వీస్తుండగా తెలంగాణ జాతి స్వీయ అస్థిత్వాన్ని మరోసారి చాటుకున్నది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత భారత ప్రజలు మళ్ళీ ఒకే పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వ నిష్క్రియాపరత్వంతో విసిగిపోయిన ప్రజలకు మోడీ ఘటికుడైన నాయకుడిగా కనిపించారు. ఒకే పార్టీకి పట్టం కట్టినంత మాత్రాన భారతీయ సమాజం వైవిధ్య భరితమైందనే వాస్తవాన్ని మోడీ మరిచిపోకూడదు. ప్రాంతీయ శక్తుల అస్థిత్వాన్ని విస్మరించినప్పుడు ఎంత దృఢమైన దేశాలైనా సంక్షోభాల పాలయ్యాయి. తెలంగాణ సమాజం ఇచ్చిన తీర్పులోని అంతరార్థాన్ని మోడీ గ్రహించి వ్యవహరిస్తాడని ఆశిద్దాం.

నమస్తే తెలంగాణ సౌజన్యంతో:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *