mt_logo

కలిసి ఉన్నాం సరే, కలిసిపోయామా మరి?

By: అపర్ణ తోట 

 

రెండు రోజుల బట్టీ జరుగుతున్న సంతాప పోస్టులూ, దిక్కుతోచని కామెంట్లూ, కాస్త నిష్టూరాలూ, కొన్ని ఆనందాల మధ్య ఇన్నాళ్ళూ నా పరిమితమైన జ్ఞానం ప్రదర్శించడం ఇష్టం లేక ఊరుకున్నా, ఈ వాతావరణంలో నేను గమనించిన విషయాలు పంచుకొవడం మంచి తరుణమనిపించింది..

నాకు ఆంధ్రుల చరిత్ర, తమిళనాడు నుండి విడిపడడం, నైజాం ప్రాంతాన్ని కలుపుకుని ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం గురించి వివరంగా తెలియదు. ప్రత్యేక తెలంగాణ పోరాటం గురించీ, బడ్జెటరీ అలొకెషన్స్ గురించీ, డాములూ, కట్టడాల గురించీ, అంకెలూ, ఇన్వెస్ట్మెంట్ల గురించి కూడా తెలియదు. ఈ మాత్రం ప్రస్తావన కూడా పోయిన నాలుగేళ్ళల్లో ఏవో తిరగేస్తే తెలిసిన పదాలు.

నాకు నాలుగేళ్ళు దాటాక ’84-’85 లో విజయవాడ నుండి హైదరాబాదు వచ్చాము. చిన్నప్పుడు నేను నా తెలంగాణా మిత్రులనుండి నేర్చుకున్న భాషని చూసి, “అబ్బా, పక్కా తెలంగాణాదానిలా మాట్లడుతుంది.””నువ్వు అనకు, మీరూ అను”, “అస్తున్నా అనకు, వస్తున్నాను అను” అంటూ విసుక్కునేవారు.

నార్తిండియాలో మావయ్య పిల్లల్లు సెలవలకు మా దగ్గరకు వచ్చినప్పుడు హిందీలో మాట్లాడితే ముచ్చట. కానీ నేను తెలంగాణలో ఉంటూ ఆ భాష మాట్లాడితే సరిదిద్దేవారు. అప్పుడు చిన్నదాన్ని, అందుకే వారు చెప్పినట్లే నా భాష మార్చుకోవడానికి ప్రయత్నించేదాన్ని. చిన్నప్పుడేమి అర్ధమవుతాయి? మట్టి వాసనవేసే తెలంగాణని వదిలి ఆంధ్రుల భాషని అంటించుకున్నా. ఇప్పుడాలోచిస్తే అనిపిస్తుంది – ఇంగ్లీషులో మాట్లాడితే గొప్ప, బ్రాహ్మణ భాష మాట్లాడితే గొప్ప, సినిమాల్లో భాష, సాహితీ భాష – ఇదంతా అమోదయొగ్యమైన భాష. తెలంగాణా మాట్లాడితే ఎగతాళి, చిన్న చూపు. బ్రాహ్మణ భాష, దళిత భాషలా ఆంధ్ర తెలుగు, తెలంగాణా తెలుగు. ఎప్పుడూ ఓటు ఆంధ్ర తెలుగుకే…

మా ఆయన ఆఫీసులో ఒకమ్మాయి గురించి, “పిల్లెంత చక్కగా ఉంటూందో, కానీ నోరు తెరిస్తే, వచ్చిన్రు, పోయిన్రు, ఊషిపొయింది…అంటూ తెలంగాణ” అని వాపోతాడు.

“వాళ్ళూ చదువుకోలేదు.”
“పొద్దస్తమానం తాగుతారు.”
“బసివి, జోగిని, పోతురాజు, దొరలు, బానిసలు…ఇక్కడ ఎన్నో దురాచారాలు..”
“వీళ్ళకి బుర్రతక్కువ.. ”

చిన్నప్పటి నుంచీ వింటున్న మాటలు.

“జీన్స్, జెనెటిక్స్, సొషల్ ఆర్డర్, ఎదుగుదల, పోషకాహారం, లైఫ్ స్టైల్, తరాల తరబడి బానిసత్వంలో మొద్దుబారినవారికి రెండు తరాల్లో తేడావచ్చేస్తుందా..? ”

“నిజంగానే తెలంగాణా వాళ్ళకి కష్టపడడం రాదు.” తెలంగాణా అమ్మయిని చేసుకున్న ఒక మిత్రుడి సెలవు.” సింగరేణి కని భూములు పది రూపాయలకు అమ్ముకున్నారు. ఆ డబ్బులు అయిపోగానే, వారంలో మూడురోజులు పనికి నాలుగు రోజులు తాగుడుకి.”రియల్ యెస్టేటు లో పొలాలు పోగొట్టుకుని డబ్బుతో జల్సాలు చేసారన్న మాట. ఇంతకీ అమ్ముకున్న భూమిలోంచే మైనింగ్ కి వెళ్ళవలసిన పరిస్థితులెంటి? తాగుడా, అజ్ఞానమా? మరి ఇంత అజ్ఞానులతో ఎందుకున్నాం?

మనమందరం భాయి, భాయి అనుకునా? లేక మెత్తటి మట్టీ , నీరూ, కంఫర్ట్లూ, ఉద్యోగాల కోసమా..? ఆంధ్రాలొ ఇళ్ళూ, స్థలాలూ అమ్ముకుని ఇక్కడ కొన్నాం కదా వాటి భవిష్యత్తెంటి? అమీర్ పేటలో ఇళ్ళూ- క్రిష్ణా జిల్లా కాలని. కె.పీ.హెచ్. బి కాలని- భీమవరం రాజులు…అక్కడంతా మనాళ్ళే. ఇల్లు వెతికితే మీదే ఊరమ్మా? విజయవాడా? ఇంకేం, మనాళ్ళైతేనే ఇద్దామనుకున్నామమ్మా..కాస్త తక్కువైనా పర్లేదు, మీ వారితో మాట్లాడి చెప్పు. ఇవన్నీ నిజంగా నాకైన అనుభవాలే.

సరే ఇంత పెట్టూబడీ పెట్టీ, తెలంగాణా ప్రజలకు మన వద్ద ఉద్యొగాలు కూడా ఇస్తే మనల్ని పెట్టుబడీదార్లన్నారూ, వారు శ్రామికులైపోయారు.. కనీసం ఈ అభివృద్ధికి మన శ్రమని గుర్తించరు. కానీ ఒకటే ప్రశ్న. ఆంధ్రులు తెలంగాణ ఎందుకు వెళ్ళారు? తెలన్గాణా వారు అంధ్రా ఎందుకు వెళ్ళలేక పొయారు? నిజంగా తెలీదు? వారికి చేతగాలేదు. మాకు చేతనైంది. అందుకే పడి ఏడుస్తున్నరు. (ఇదెక్కడో విన్నట్టనిపిస్తొందే..)

మనకేంటీ? పంట, సాహిత్యం, ఉద్యమాలూ, అవగాహన, తిరగబడే ధైర్యం ఉన్నవారం. ఇక్కడ నదులూ, మట్టీ అన్నీ ఉన్నాయి. ప్రశ్నించే ధైర్యం లేక పొయింది. నిజాం పాలనలో దొరల క్రింద బానిసలై నలిగి, గడీలో గడియగాచిన వారికి ఉన్నట్లుండీ అభ్యుదయం ఎక్కడి నుంచి వస్తుంది? కానీ దొరలు రాజకీయ నాయకులైతే ప్రజలు బానిసలవరా ? ముందు ముందు ఏమవబోతోంది?…కాస్త నిజం బెంగా కాస్త ఆస్తుల, ఉద్యోగ, భవిష్యత్తు గురించి కంగారు..

మనమిక్కడ చేరి అరవయ్యేళ్ళు. ఉద్యోగాలు తెచ్చుకున్నాం, ఇళ్ళు కట్టుకున్నాం, ఇక్కడ సంబంధాలే చేసుకున్నాం, కష్టపడ్డం, ఇక్కడ సెటిల్ అయ్యం. మరి బాధనిపించదా?

నిజమే, ఎవరో చెప్పినట్లు దళితులూ, ఆడవారూ అభివృద్ధి లోకి రాకపోవడం ఆయా వర్గాల వారి తప్పైతే, తెలంగాణా వృద్ధిలోకి రాకపోవడం తెలంగాణావారి తప్పే.

కాబట్టి కలిసి ఉండాలనుకున్న అన్నలారా(అక్కలు కూడానూ)! విడదీయాలనుకునే రాజకీయ నాయకుల స్వార్ధంలా కలిసుండాలని చెప్పే మీ స్వార్ధం తక్కువేమీ కాదు. అసలా లెక్కలో మనం బ్రిటీషర్లు రాకముందు ఎవరెక్కడున్నారో ఎవరికి తెలుసు? సొషల్ రీకన్స్ట్రక్షన్ జరుగుతూంటేనే మార్పులొచ్చేది. మనల్ని వదిలి వెళ్ళేముందు బ్రిటీషర్లు మనకు దేశాన్నేలే సామర్ధ్యం లేదనీ, మన అభివృద్ధికి కారణం వారేనని చెప్పారు. కొట్టుకునో తన్నుకునో, విడీపోయో , కలిసో ఉన్నాం కదా మన స్వతంత్ర దేశంలో? కొహినూర్ వజ్రాన్ని దోచుకెళ్ళారనీ, అదేదొ సిమ్హాసనం పట్టూకుపోయారని, మన ముడి సరుకులు వాడేసారనీ దెప్పుతాం. ఇప్పుడూ మీ పరిశ్రమల పిచ్చిలో స్వచ్చమైన మా వనరులు యధేచ్చగా వాడుకున్నారనీ, కాలుష్యాన్ని తగిలించారనీ, భూములని నిస్సారంగా చేసారనీ అనరా?

అనొచ్చు. “మూర్ఖత్వం” వీరి రక్తంలొనే ఉందిగా…చూద్దాం ఏమి జరుగుతుందో. కానీ ఉద్ధరించే ఉద్దేశం ఉన్నవారు కాసేపు అబద్ధాలు ఆపండి.
Disclaimer:

నాకు ఎదురైన అనుభవాలు పెంచుకోవడం విద్వేషాలు రెచ్చగొట్టడానికి కాదు. రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామాలో ఎంతో కొంత ఎంపతీని నటిస్తున్న కొందరిని గురించి మాత్రమే ఉద్దేశిన్చి రాసింది. ఇక్కడి భాష మీద గౌరవం, పరిస్థితుల మీద అవగాహన, సహనం లేనివారికీ, అభిజాత్యం ఉన్నవారికీ , ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడి వారినే విమర్శించేవారి గురించే ఇదంతా. బ్రిటీషర్లతో పొల్చడం, వారిని సమర్చించినట్లు కాదు.జ్యాత్యాహంకారంతో, మిడి మిడి జ్ఞానం తో మాట్లాడి ఎంతో కొంత మాట్లాడి రెచ్చగొట్టడం రెండు వైపులా ఉంది. కానీ కలిసి ఉన్నాం అన్నప్పుడు ఎంతగా కలిసిపోయాం అనేది ఒక పెరామీటర్ అవుతుంది కదా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *