
ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాక సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించింది. తొలుత వ్యవసాయరంగంపైన దృష్టిపెట్టిన తెలంగాణ సర్కారు.. ఆ రంగంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా, ఎరువులు, వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్‌లాంటి సంక్షేమ, విప్లవాత్మక పథకాలతో నేడు తెలంగాణ బువ్వగిన్నెగా మారిపోయింది. అనంతరం విద్య, వైద్యంపైనా దృష్టిపెట్టిన తెలంగాణ సర్కారు ఆ రంగాల్లోనూ పురోగతి సాధించింది. గురుకులాలు, మన ఊరు-మన బడితో నిరుపేద బిడ్డలకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకొంటున్నది. పల్లె, బస్తీ దవాఖానలు, మల్టీ స్పెషాలిటీ దవాఖానలు, టీ డయాగ్నొస్టిక్స్, జిల్లాకో మెడికల్, నర్సింగ్ కళాశాలతో తెలంగాణ జిల్లాలకు నాణ్యమైన వైద్యం, విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఎం కేసీఆర్ సంకల్పంతో కేవలం తొమ్మిదేండ్లలోనే తెలంగాణలో వచ్చిన విప్లవాత్మక మార్పును రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలతోపాటు పక్క రాష్ట్రం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పక్క రాష్ట్రపు ప్రతిపక్ష పార్టీ అధినేత అనుంగు శిష్యుడు రేవంత్‌రెడ్డి తెలంగాణలో ఉచిత కరెంట్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు మరువకముందే.. తెలంగాణలో విద్యా వ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కించపరిచే వ్యాఖ్యలు చేశారు. చూచిరాతలు.. కుంభకోణాలు అంటూ తెలంగాణ విద్యార్థులను కించపరిచేలా దురహంకారంగా మాట్లాడారు. ఏపీ నుంచి విడిపోయి అన్నిరంగాల్లో ఆ రాష్ట్రాన్ని దాటిపోయి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణపై విషం చిమ్మారు.
బొత్సపై తెలంగాణ సమాజం గరంగరం..
తెలంగాణపై బొత్స సత్యనారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై యావత్తు తెలంగాణ సమాజం భగ్గుమన్నది. సమైక్య ప్రభుత్వంలో వేలకోట్లు కుంభకోణం చేసిన బొత్స తమకు నీతులు చెబుతారా? అంటూ తెలంగాణ ప్రజలు మండిపడ్డారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రి బొత్స చేసిన ఫోక్స్‌వ్యాగన్ కుంభకోణాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సీబీఐ ఎంక్వైరీని కూడా ఎదుర్కొన్న బొత్స ఇప్పుడు తెలంగాణలో కుంభకోణాలు జరుగుతున్నాయని అనడమంటే ‘దొంగే, దొంగ… దొంగా’ అని అరిచినట్టు ఉందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బొత్స వ్యాఖ్యలను తెలంగాణకు చెందిన బీఆర్ఎస్ మంత్రులు ఖండించారు. తెలంగాణలో ఒక్కో విద్యార్థిపై రూ. 1.25 లక్షలు ఖర్చు చేస్తున్నామని, మరి ఏపీలో ఎంత ఖర్చు చేస్తున్నారో బొత్స సమాధానం చెప్పాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిలదీశారు. తెలంగాణపై మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోమని ఘాటుగా హెచ్చరించారు. బొత్సను వెంటనే మంత్రివర్గంనుంచి బర్తరఫ్ చేయాలని ఏపీ సీఎం జగన్‌ను మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. రాజధాని ఎక్కుడుందో చెప్పుకోలేనివారు.. తెలంగాణపై విమర్శలు చేస్తారా? అని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చురకలంటించారు. మిస్టర్ బొత్స.. ఇది ఆఫ్ట్రాల్ తెలంగాణ కాదు.. అన్నంపెట్టే తెలంగాణ అంటూ విరుచుకుపడ్డారు.