mt_logo

అన్న ఆంధ్ర…తమ్ముడు తెలంగాణ

తెలంగాణ రావటం ఖాయం. వచ్చాక వున్నదంతా పంపకాల సమస్యే. తెలివి మీరిన ఆంధ్రావాళ్లు ‘ఒక్క హైదరాబాదే కాదు. చాలా ఆస్తులు మావే’ అంటారు. మన అమాయకత్వాన్ని తెలివిగా వాడుకుంటారు.నిజానికి ‘నిలువుగా పంచితే కొంత నష్టం… అడ్డంగా పంచితే అంతా నష్టం’ అనే సామెత ఉండనే వుంది. ‘అన్నదమ్ముల్లా విడిపోదాం…ఆత్మీయుల్లా కలిసుందాం’ అన్న మన నినాదాన్ని కూడా వాళ్ళు తెలివిగా వాడుకుంటారు. రక్త సంబంధాల ఆత్మీయతలే ఒక బూటకమైనపుడు ఆంధ్రావాళ్ల ఆత్మీయతల్లో ఇంకెంత మోసముండాలి! ఆ దృష్టినుంచి రాసినవే ఈ ‘పంచోట్కం కథలు’ఇవి చాలా చిన్నవి. ఈ కథల్లో ‘అన్న ఆంధ్ర….తమ్ముడు తెలంగాణ’ అని గమనించాలి.

~ కె.వి.నరేందర్
7-4-264, బి, కెనాల్ దగ్గర, విద్యానగర్
జగిత్యాల, కరీంనగర్ జిల్లా. 94404 0271

**********************

ఇల్లు

పొద్దుగాల్నే…. ‘‘తమ్మీ.. నువ్వన్నట్టే కానియ్…. అన్నదమ్ముల్లాగే విడిపోదాం. ఆత్మీయుల్లా కలిసుందాం. మరి విడిపోయే ముందు ఉన్నవి పంచుకోవాలె గదా’’ అన్నాడు అన్న.
తమ్ముడు ‘‘అవునన్నా.. ఫస్టు ఇల్లుని పంచుకుందాం’’ అన్నాడు.‘‘ఇంత పెద్ద ఇల్లు నాకెందుకు తమ్మీ.. రెండు రూములు చాలు’’ నిష్టూరంగా అన్నాడు.‘‘అయ్యో…గట్లెందుకన్నా…సమానం పంచుకుందాం’’ చెప్పాడు తమ్ముడు.‘‘నీకే విడిపోవాల నుండె… నాకెంత బాధగా వుందో తెలుసా? అందుకే నాకు రెండు గదులు చాలు తమ్మీ’’…అన్నాడు బాధగా మొహం పెట్టి అన్న. ‘‘ఏ రూములు కావాల్నే’’….అమాయకంగా అడిగాడు తమ్ముడు. ‘‘ఒక కిచెన్…ఒక బెడ్ రూం చాలు తమ్మీ…వాకిలి నువ్వే వుంచుకో, వరండా కూడా నువ్వే వుంచుకో, స్టోర్‌రూం నువ్వే వుంచుకో, పశువుల కొట్టం నువ్వే వుంచుకో. ఒక కరెంట్ బిల్లు మాత్రం చెరిసగం కట్టుకుందాం’’ అన్నాడు.

తమ్ముడు కరిగిపోయి ‘‘సరే అన్నా…’’ అన్నాడు.

ఆ రోజు నుంచీ…
తమ్ముడు అర ఎకరం వాకిలి ఊడుస్తుండు.. అలుకు చల్లుతుండు. ముగ్గులు పెడుతుండు. స్టోర్ రూంలో ఎలుకల్ని, పందికొక్కుల్ని చంపుతున్నడు.అన్న మాత్రం కిచెన్‌లో బిర్యాని వండుకుని తిని .. బెడ్‌రూంలో ఏసి వేసుకుని నిద్ర పోతున్నడు. కరెంట్ బిల్లు చెరి సగం కదా!

*****************

మంచినీళ్ల బాయి

ఇంటి ఆవరణలో వున్న నీళ్ల బాయిని పంచుకోవాలనుకున్నారు.‘‘అన్న… మంచినీళ్ల బాయిని ఎట్ల పంచుకుందామే…?’’ అనడిగాడు తమ్ముడు.‘‘నేను రెండు రూములుంచుకొని…ఇంత పెద్ద ఇల్లు నీకు విడిచి పెట్టిన బాయిదేముందిరా?’’ అన్నాడు అన్న.‘‘అన్ని పంచుకుంటున్నపుడు ఇది కూడా తప్పదు గాదే… అందుకని’’ అయాయకంగా చెప్పాడు తమ్ముడు.‘‘సరే.. బాయి బొక్కెన, చేదతాడు, బాయి గిరక ఇనుప స్తంభాలు, అన్నీ నువ్వే వుంచుకో. అయిదు వేలు పొత్తు లేసుకుని ఇటుకలు, సిమెంట్‌తోని కట్టిస్తిమి. అవన్నీ నువ్వే ఉంచుకో..నాకు కొన్ని నీళ్లు చాలు తమ్మీ’’‘‘గట్లెందుకే?’’‘‘నీళ్లకు విలువేముందిరా…అందుకే అన్నీ నీకిచ్చి వట్టి నీళ్లు మాత్రం నాకుండనియ్యి.’’తమ్ముడు సరే నన్నాడు.తర్వాత నుంచి తమ్ముడు తోడిన నీళ్లన్నీ పట్టుకుపోతున్నాడు. ‘‘నీళ్లు నాయే కదరా’’ అంటున్నడు.అలా మొదలై .. బాయికి కరెంట్ మోటర్ పెట్టుకున్నడు. ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ తెచ్చిండు.నీళ్లు అమ్ముకోవడం మొదలు పెట్టిండు.లక్షలు సంపాదిస్తుండు.తమ్ముడు కరెంట్ బిల్లు సగం కడుతనే వున్నడు.

***********************

పొలం

‘‘అన్నా… పొలం పంచుకుందామానె…’’ అడిగిండు తమ్ముడు. ‘‘ఇల్లంతా నీకే ఇస్తిని. బాయిల విలువైన వస్తువులన్నీ నీకే ఇస్తిని.. పొలానిదేముంది తమ్మీ.. మనకున్న ఏడెకరాల భూమిలో రెండెకరాలే పొలం. మిగతా అయిదెకరాలు గుట్టనేనాయె..’’ అన్నాడు అన్న. ‘‘అవునే…మనకు పొలం రెండెకరాలే వున్నట్లు లెక్క. మరేం చేద్దాం. చెరో ఎకురం పంచుకుందాం’’ చెప్పాడు తమ్ముడు.అన్న కొంచెం కోపంగా చూసిండు.‘‘నువ్వు చిన్నోనివిరా… ఎట్ల బతుకుతవ్? ఆ రెండెకరాలు నువ్వే వుంచుకో పో…పనికిరాని గుట్టని నేనుంచుకుంటా తియ్…’’ అన్నాడు.‘‘అయ్యో గట్లెందుకే?’’ గాబరా పడ్డాడు తమ్ముడు. ‘‘నాక్కావల్సింది నువ్వు మంచిగా బతకాలె బిడ్డా.. అందుకే రెండెకరాల పొలం తీసుకో…మంచిగ పండించుకో.. గుట్ట నాకుండ నియ్యి’’ అన్నాడు.తమ్ముడు కరిగి పోయిండు. ‘‘సరేలే’’ అని కండ్లల్ల నీళ్లు తెచ్చుకున్నడు.తర్వాత అన్నగాడు గుట్టకి క్రషర్ మిషిన్లు పెట్టిండు. కంకర సప్లయ్ చేసుడు మొదలు పెట్టిండు. లక్షలు సంపాదించిండు. మిషిన్‌ల రాళ్లని కరకర నమిలేస్తున్నపుడు ‘రాతిధూళి’ పైకి లేస్తూ…తమ్ముడి రెండెకరాల పొలంలో పేరుకుపోతోంది. రోజురోజుకు ఆ ధూళి పొలం మడుల్లో కప్పుకుపోయి రాతి పొరగా మారుతుంది. వడ్ల గింజలే కాదు… గడ్డి కూడా మొలవని పరిస్థితి వచ్చేస్తుంది.

********************

తాటిచెట్టు

‘‘అన్నా… తాటి చెట్టును కూడా పంచుకుందామె…’’ అనడిగిండు తమ్ముడు. అన్న నవ్వి ‘‘తాటిచెట్టు నెట్ల పంచుకుంటవ్‌రా నువ్వే వుంచుకో పో’’ అన్నాడు.

‘‘నువ్వే చెప్తివి కదనే.. లోకం బాధకు అని. ఇది కూడా ఏదో రీతిగ పంచుకుందాం’’ చెప్పాడు తమ్ముడు.అన్న పది నిమిషాలు ఆలోచించిండు.‘‘తమ్మీ తాటి చెట్టుంటే కల్పవృక్షమంటరు. అందుకే తాటిచెట్టులో కన్పించేదంతా నువ్వే తీసుకో… కనబడని దేమన్న వుంటే నాకు పారెయ్’’ అన్నాడు.

‘‘నా కర్థమైత లేదే…’’ తమ్ముడు అమాయకంగా అడిగిండు.‘‘నీకు తాటిచెట్టులో ఏమేం కన్పడుతున్నాయి తమ్మీ’’ అడిగాడు .తమ్ముడు తలెత్తి తాటి చెట్టు వంక చూస్తూ…

‘‘తాటికమ్మలు, తాటిమట్టలు, ముంజకాయలు, తాటి దోనెలు, తాటి పండు.. ఇవే కన్పడుతున్నాయన్నా…’’‘‘కదా…ఇంకేమీ కన్పించట్లేదా?’’‘‘లేదన్నా’’‘‘ఆ కన్పించనిదే నాది అనుకో పో’’ అన్నాడు.తమ్ముడు సంబురపడి పోయిండు.ఆ సాయంత్రమే ..అన్న తాటి చెట్టెక్కిండు. కత్తితో గాట్లు పెట్టి నాలుగు వైపులా.. నాలుగు పెద్ద లొట్లు కట్టిండు.తెల్లారేసరికి లొట్టిల నిండా కల్లు పారింది.వారం తిరుగక ముందే కల్లు దుకాణం తెరిసిండు. వచ్చిన కల్లులో డ్రమ్ము నీళ్లు కలిపిండు. చాకిరిన్ వేసిండు. మత్తు పదార్థం కలిపిండు.తాటిచెట్టు మీద కన్పించని కల్లుతో..లక్షలు సంపాదించుడు షురూ చేసిండు.‘‘అన్న నాకు కల్ప వృక్షాన్నే ఇచ్చిండు..’’ అమాయకపు తమ్ముడు ఆనందంగా మోసపోతూనే వున్నాడు.

*****************

ఆవు

‘‘అన్నీ పంచుకుంటున్నాం… ఆవుని కూడా పంచుకుందాం రా తమ్మీ…’’ అన్నాడు ప్రేమగా అన్న.‘‘ఆవుని నువ్వే వుంచుకోరాదే.. నా కోసం ఇన్ని ఇడిసి పెడుతున్నవ్’’ ఇంకా అమాయకంగానే అన్నాడు తమ్ముడు.‘‘గట్లుంటదా తమ్మీ.. ఆవు పెద్ద ఆస్తి ఏం కాదు గనీ..ఏదో లోకం బాధకు…పంచుకున్నారా అంటే పంచుకున్నాం అన్నట్లుగా కూడా వుండాలె…’’ అన్నాడు అన్న.‘‘అవునెట్ల పంచుకోవత్తదే ?’’ అడిగాడు తమ్ముడు.‘‘దానిదేముందిరా. ఇల్లు, బాయి నీకే విడిచిపెట్టిన. ఆవుదెంత? కాకపోతే నలుగురి కోసం పంచుకున్నట్టుండాలె’’ అన్నాడు ప్రేమగా.. ‘‘అన్నీ తెల్సినోనివి నువ్వే పంచరాదే’’‘‘సరే..ఆవు ముందు భాగం నీకు.. నాకు వుండనీ… వెనుకవైపు ఆవు పెండ, రొచ్చు లాంటి వన్నీ నీకివ్వటం నాకే మంచిగ అనిపిస్త లేదు…’’ చెప్పాడు అన్న.తమ్ముడు కరిగి పోయాడు.ఆ రోజునుంచీ… ముందు భాగం నాదే కదాని… తమ్ముడు గడ్డి కోసుకొచ్చి ఆవు కేస్తున్నాడు. అన్న రోజూ పది లీటర్ల పాలు పిండుకుంటున్నడు. పాలని అమ్ముకుంటున్నడు. అవు పేడని కిలోల లెక్కన, ఆవు మూత్రాన్ని లీటర్ల లెక్కన ఆశ్రమాలకు, ఆయుర్వేద కంపెనీలకు అమ్ముకుంటున్నాడు.తమ్ముడు రోజూ గడ్డి కోసుకొచ్చి వేస్తూనే వున్నాడు. బకెట్ల కొద్ది కుడితి పెడుతూనే వున్నాడు.ఓ రోజు..ఆవు లేగ దూడని పెట్టింది. తెల్లగా…బొద్దుగా వుంది. అది చెంగు చెంగున ఎగురుతుంటే…దూడని ప్రేమగా చూస్తున్న తమ్ముడ్ని గమనించి..‘‘ఈ దూడ పాడుగాను…ముందు నుంచి పుడితే నీకే వచ్చేదిరా.. నుంచి పుట్టె….’’ అన్నాడు అన్న. [నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *