• పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో కేంద్రానికి బహిరంగ లేఖ
• తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తున్న కేంద్రం
• 9 ఏళ్లుగా తెలంగాణ ప్రగతి ప్రస్థానం పైన అంతులేని వివక్ష
• నదీ జలాల వినియోగం నుంచి మొదలుకొని ప్రాజెక్టుల నిర్మాణం దాకా అన్నింట్లోనూ అడ్డంకులే
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. లేఖ యొక్క సారాంశం.. “తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి పట్ల తీవ్ర నిరాశతో ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించే విధంగా పలుమార్లు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురైన అన్ని రకాల ఆటంకాలను దాటుకొని, తనదైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నది. అయితే తెలంగాణ ప్రగతిని, పురోగతిని ఓర్వలేని కేంద్ర ప్రభుత్వం, తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం గత తొమ్మిది సంవత్సరాలుగా కొనసాగిస్తూనే ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన వివక్షతో వ్యవహరిస్తున్నది. ఈ ప్రాజెక్టుకి రెండవ దశ పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా పక్కనబెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రజల తరపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలైన నాగర్కర్నూల్, మహబూబ్నగర్, వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆశాకిరణం. 12.03 లక్షల ఎకరాలకు పైగా భూమికి సాగునీటిని, ప్రజలకు తాగునీటికి భరోసా అందిస్తూ, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే ఈ బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయం. ఈ ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతో ప్రాజెక్టు పరిధిలోని కోట్లాది ప్రజల జీవితాల్లో కచ్చితంగా గుణాత్మక మార్పు వస్తుంది.
తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో కరువు కాటకాలతో తల్లడిల్లేవి. తాగునీరు లేక నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను ఎదుర్కొంటే, సాగునీటి సౌకర్యం లేక మహబూబ్న నగర్ జిల్లా వలసల పాలయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ తో నల్గొండ ఫ్లోరైడ్ రాక్షస భూతాన్ని మా ప్రభుత్వం తరిమికొట్టింది. నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు కరువుతో తల్లడిల్లిన ఈ జిల్లాల పచ్చబడటం కేంద్రానికి ఇష్టం లేదు. అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అడ్డు తగులుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వాలన్న తెలంగాణ ప్రజల డిమాండ్ ను పెడచెవిన పెట్టిన కేంద్ర ప్రభుత్వం, అనుమతుల పేరుతోనూ అడ్డంకులు సృష్టిస్తున్నది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా నిరాకరిస్తున్న కేంద్రొ, తాజాగా పర్యావరణ అనుమతుల పేరుతో మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నది. పాలమూరుకు పక్కనే ఉన్న కర్ణాటకలోని ఎక్కువ భద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదాను మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం మొండిచేయి చూపించడం కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక వైఖరికి నిదర్శనం.
ఒకవైపు కృష్ణ జలాల పంపిణీ, వినియోగంపై నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి వివాదాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తాత్సారం చేస్తున్నది. దీంతో రాజ్యాంగబద్ధంగా నీటి వినియోగ అంశం రాష్ట్ర జాబితాలో ఉన్నా.. ముందస్తు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తన సొంత సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు వాడుకోలేని దుస్థితిలోకి తెలంగాణను నెట్టివేసింది. కృష్ణా నీళ్లలో 500 టీఎంసీల వాటా కావాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్ ను పట్టించుకోకుండా, కనీసం ట్రిబ్యునల్ కి పంపకుండా 9 సంవత్సరాల తర్వాత కూడా మంచి వేట ధోరణిని అనుసరిస్తున్నది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత, వివక్షాపూరిత వైఖరి దురదృష్టకరం. ఇతర రాష్ట్రాల మాదిరి తెలంగాణ ప్రజలు తమ అవసరాల, ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకొని, అభివృద్ధి పథంలో నడిచేందుకు సైతం కేంద్ర ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద ఆధార పడేలాచేయాలనుకోవడం ముమ్మాటికి తెలంగాణ ప్రజలను అవమానించడమే. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎన్ని విధాలుగా అణచివేతకు ప్రయత్నించినా, తెలంగాణ అభివృద్ధి పట్ల మా నిబద్ధతను, సంకల్పాన్ని అడ్డుకోలేరు. ఇప్పటికే దాదాపు దశాబ్ద కాలంగా కేంద్రం అడుగడుగునా అడ్డంకులు సృష్టించినా, ఏ అంశంలోనూ సహకరించకున్నా అనేక రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల కన్నా ముందు వరుసలో నిలుపుతూ, తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టడంలో మేము విజయం సాధించాం. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అడ్డుకునే ఏలాంటి శక్తులనైనా రాజీ పడకుండా ఎదుర్కొంటాం. అయితే కేంద్ర ప్రభుత్వ పక్షపాత నిర్ణయాలు, వివక్షపూరిత వైఖరి తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోకుండా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాన్ని తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.” – మంత్రి కేటీఆర్