సమైక్య పాలనలో 60 ఏండ్లు తెలంగాణ అరిగోస పడ్డది. నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇలా ప్రతి అంశంలోనూ వివక్షను ఎదుర్కొన్నది. ఆంధ్రా నాయకులు ఇక్కడి నిధులను దోచి వారి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొన్నారే తప్పా తెలంగాణను పట్టించుకొన్న పాపాన పోలేదు. మన భాష, యాసను ఈసడించుకొన్నారు. ముఖ్యంగా అనేక ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసింది శూన్యం. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. దీంతో కేసీఆర్ తన పదవులను త్యాగం చేసి మరీ, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తన ప్రాణాలు లెక్కచేయకుండా చావు నోట్లో తలపెట్టి మరీ నాటి కేంద్రం మెడలు వంచారు. రాదనుకొన్న తెలంగాణను సాధించారు. ఉద్యమస్ఫూర్తి.. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్‌తో స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన ప్రారంభించారు. అనతికాలంలోనే ఉద్యమ నినాదాలన్నింటినీ నెరవేర్చడంతోపాటు తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టించారు.
దేశానికే ఆదర్శంగా నిలిపారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. ప్రపంచ దిగ్గజ అమెజాన్, గూగుల్, ఫాక్స్‌కాన్ లాంటి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి. అటు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ పంజాబ్‌ను దాటేయగా, ఐటీ రంగంలో దేశానికే ఐటీ రాజధానిగా ఉన్న కర్ణాటకను దాటి ముందుకు వెళ్తున్నది. దీంతో ఢిల్లీ పార్టీల కన్ను తెలంగాణపై పడింది. ఇక్కడ ఎలాగైనా పాగా వేసి, ఇక్కడి నిధులు దోచుకెళ్లాలని భారీ కుట్ర చేశారు.. ఎన్నికల వేళ అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఢిల్లీ బాస్‌లు ఇక్కడికి క్యూకడుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలుతూ ఇక్కడి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు.
తెలంగాణకు మిడతలదండులా ఢిల్లీ పార్టీలు
సీఎం కేసీఆర్ విజన్‌తో అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిన తెలంగాణపై ఢిల్లీ పార్టీల కన్నుపడింది. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినం పేరిట అమిత్ షా హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. ఇక్కడ ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి ఓట్లుగా మలుచుకొనేందుకు యత్నించారు. హిందూ, ముస్లింల మధ్య జరిగిన గొడవగా ఈ సంఘటనను చిత్రీకరించి, ఓట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్ వేశారు. పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర బీజేపీ నిర్వహించిన సమావేశానికి హాజరైన అమిత్ షా.. ఆ కోణంలోనే వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీఆర్ఎస్ కావాలనే విమోచన దినోత్సవాన్ని నిర్వహించడంలేదని, హిందువులకు అన్యాయం చేస్తున్నదంటూ ఓ వర్గాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల పేరిట ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించేందుకు హైదరాబాద్‌లో కాంగ్రెస్ అధిష్ఠానం అడుగుపెట్టింది. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సహా ఢిల్లీ పెద్దలంతా ఇక్కడికి వచ్చారు. రెండోరోజు తుక్కుగూడలో సభ నిర్వహించి, ఆరు గ్యారంటీలు అంటూ అలవిగాని హామీలిచ్చారు.
తెలంగాణలో పూర్వవైభవంకోసం నోటికొచ్చిన హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకు హస్తంపార్టీ ప్రయత్నించింది. అయితే, ఇప్పటికే సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని రుచిచూస్తున్న తెలంగాణ ప్రజలు ఆ రెండుపార్టీలను విశ్వసించడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటివరకూ తెలంగాణకు ఎలాంటి సాయం చేయలేదని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. విభజన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ 50 ఏండ్లు అధికారంలో ఉన్నా తెలంగాణను పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చి ఆరు గ్యారంటీలు ప్రకటిస్తే ఎలా నమ్ముతామని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అమలు చేయని పథకాలను తెలంగాణలో అమలుచేస్తామంటే నమ్మేందుకు తామేమీ అమాయకులం కాదని అంటున్నారు. అభివృద్ధి, సంక్షేమంతో తమను కంటికిరెప్పలా కాచుకొంటున్న సీఎం కేసీఆర్ వెంటే నడుస్తామని, బీఆర్ఎస్ పార్టీనే మళ్లీ గెలిపిస్తామని తేల్చి చెప్తున్నారు.