mt_logo

తెలంగాణపై మరొకసారి అఖిలపక్ష డ్రామా!

By – కొణతం దిలీప్

తెలంగాణ విషయంలో చాలాకాలంగా అఖిలపక్షం అనే డ్రామా నడుస్తోంది. అటు అధికార కాంగ్రెస్, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం కలిసి ఈ డ్రామాను గొప్పగా రక్తి కట్టిస్తున్నామనే భ్రమలో ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలు ఇదివరకులా అమాయకంగా లేరని, ఇటువంటి ఛీప్ ట్రిక్స్ కు వారు పడిపోయే స్థితిలో లేరనే విషయం ఈ రెండు పార్టీలకు ఇంకా బోధపడటం లేదు.

తాజాగా డిసెంబర్ 28న తెలంగాణపై  అఖిలపక్షం ఏర్పాటు ద్వారా మళ్లా ఒక కొత్త డ్రామాకు తెరలేపినట్టు కనపడుతున్నది కేంద్ర ప్రభుత్వం

తెదేపా నేత మోత్కుపల్లి నరసింహులు రోజుకొకసారి పత్రికా సమావేశం పెట్టి కేసీయార్ తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చెయ్యమని డీల్లీ పెద్దలపై ఎందుకు వత్తిడి తేవడం లేదని హుంకరిస్తున్నాడు. వారానికోసారి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిందే చెప్పడం మోత్కుపల్లికి రివాజుగా మారింది.

మొన్నామధ్య తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు కూడా ప్రధానికి ఒక లేఖ రాసి అందులో తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేయమని రాశాడు. నిజానికి తెలంగాణ అంశంపై ఇప్పుడు అఖిలపక్షం ఏర్పాటు చేయడమంటే పెళ్ళి అయిన తరువాత పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం వంటిదే.

కేసియార్ నిరాహారదీక్ష సందర్భంగా డిసెంబర్ 7, 2009 నాడు అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో చాలా స్పష్టంగా అన్ని పార్టీలు రాష్ట్ర ఏర్పాటుపై తమతమ వైఖరిని వెల్లడించాయి. ఆరోజు తెలుగుదేశం నిర్ద్వంద్వంగా తెలంగాణ ఏర్పాటుకు మద్ధతు తెలిపింది. ఒకసారి ఆనాటి సమావేశం మినిట్స్ లో తెదేపా ఏమన్నదో చూడండి:

 

 

దాని అధారంగానే డిసెంబర్ 9 నాడు రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. అటుపై సీమాంధ్ర నాయకులు అడ్డంపడటం మూలంగా నిలిచిపోయిన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మళ్ళీ ప్రారంభించాలె అంతే కానీ రెడ్డొచ్చె మొదలాడు లాగ మళ్లా ఏకాభిప్రాయం అంటూ సాచివేత కుట్ర సాగుతున్నది.

అసలీ అఖిలపక్షం అనే డ్రామా స్క్రిప్టు జస్టిస్ శ్రీకృష్ణ కమీషన్ రిపోర్టులోని రహస్య అధ్యాయంలోనే ఉన్నది. ఉద్యమాన్ని అణచివేసేందుకు ఏమేం లఫూట్ పనులు చేయాల్నోఒక మాజీ జస్టిస్ నిర్లజ్జగా రాసిన ఆ రహస్య నివేదికలో ఏమున్నడో ఒకసారి చూడండి:

 

 

“శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు రాగానే కేంద్రం తెలంగాణ అంశంపై విస్తృతస్థాయిలో చర్చలు జరుపాలనుకుంటున్నదని, ఆ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని చెప్పాలి.

కానీ ఈ చర్చలు ఎటువంటి నిర్ణయాత్మక దిశగా సాగకుండా అన్నిరకాలా ఎత్తుగడలు అవలంభించాలి. ఉద్యమం అదుపులోకి వచ్చేవరకు ఈ అంశాన్ని ఇట్లాగే సాగదీయాలి”

అని చాలా దుర్మార్గమైన కుట్రను నలుపు తెలుపులో రాసి మరీ ఇచ్చింది శ్రీకృష్ణ కమిటీ.

ఈ రహస్య అధ్యాయంపై తెలంగాణ ఉద్యమకారులు న్యాయపోరాటం చేసి దానిలో ఏముందో ప్రపంచానికి వెల్లడించగలిగారు. అయినా నిస్సిగ్గుగా కాంగ్రెస్ ఈనాటికీ తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతున్నాయని బొంకుతున్నది.

ఈ కుట్రలో ప్రతిపక్ష తెలుగుదేశం కూడా భాగస్వామి అని శ్రీకృష్ణ కమిటీలో ఈ కింది లైన్లు తేటతెల్లం చేస్తున్నాయి:

“తెలంగాణ అంశంపై భవిష్యత్తులో జరిగే ఏ సమావేశంలో తెలుగుదేశం పార్టీ పాల్గొనకుండా చూసుకోవాలి. ఇట్లా చేయడం వల్ల తెలంగాణ డిమాండును పరిష్కరించేందుకు ఏ అర్థవంతమైన చర్చ జరగకుండా నిరోధించవచ్చు”

ఇదీ ఘనత వహించిన భారత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంపై బాజాప్తాగా చేస్తున్న కుట్ర.

తెలంగాణ విషయంలో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలు కలిసి ఆడుతున్న ఈ నాటకం వెనుక వాస్తవాలేమిటో ఇక్కడి ప్రజలకు తెలుసు. అయినా అటు ఆజాద్ నుండి మొదలుకుని ఇటు చంద్రబాబు వరకూ తెలంగాణాపై అఖిలపక్షం అనే మిధ్య గురించి పచ్చి అబద్ధాలను వల్లెవేస్తుంటారు. మోత్కుపల్లి, ఎర్రబెల్లీ వంటి తోలుబొమ్మలు తమ సీమాంధ్ర బాస్ ఆడమన్నట్టు ఆడుతుంటారు.

రేపు 28 డిసెంబర్ నాడు జరిగే అఖిలపక్షానికి ఒక్కో పార్టీ నుండి ఒక్కరే పోవాలనే డిమాండును మనం పెట్టాలె. అఖిలపక్షానికి ముందే తెలంగాణపై తన వైఖరేమిటో కాంగ్రెస్ పార్టీ చెప్పాలె. వెళ్ళిన ప్రతి పార్టీ తెలంగాణకు అనుకూలమో, ప్రతికూలమో స్పష్టం చేయాలె. సమావేశం తరువాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటుపై ఒక స్పష్టమైన రోడ్-మ్యాప్ ప్రకటించాలె. రేపటి సమావేశంలో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీలను మన ప్రాంతంలో రాజకీయంగా బొందపెట్టాలె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *