హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రపంచ ప్రఖ్యాత ప్రవేట్ ఈక్విటీ పెట్టుబడిదారు సంస్థ అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకు వచ్చింది. అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రంగంలో రెండు బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 16650) కోట్ల రూపాయల మేర భారీ పెట్టుబడులను హైదరాబాద్ నగరంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ భారీ పెట్టుబడి కేవలం భారత దేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో ఈలైప్ సైన్సెస్ రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా చెప్పవచ్చు.
ఈ పెట్టుబడి ద్వారా తమ సంస్థ ఏపీఐ మరియు కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు దోహదపడుతుందని తెలిపింది. తమ పెట్టుబడితో పాటు జినోమ్ వ్యాలీలో 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబ్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అడ్వెంట్ ఇంటర్నేషనల్ తెలియజేసింది. అడ్వెంట్ ఇంటర్నెషనల్ సంస్థ హైదరాబాద్ సువెన్ ఫార్మస్యూటికల్ కంపెనీలో దాదాపు 9,589 కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నది. దీంతోపాటు తన కోహన్స్ ప్లాట్ఫారం ద్వారా మరిన్ని సంస్థలలో పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. తన ఆర్ ఏ కెమ్ ఫార్మా, జెడ్ సి ఎల్ కెమికల్స్, అవ్రా లాబరేటరీ వంటి సంస్థలకు హైదరాబాద్ ను తన కేంద్ర స్థానంగా ఎంచుకొనున్నది.
ఈరోజు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పట్వారి, ఆపరేటింగ్ పార్ట్నర్ వైదీష్ అన్నస్వామి, మంత్రి కే తారక రామారావు తో ప్రగతి భవన్లో సమావేశమై తమ సంస్థ పెట్టుబడులను, విస్తరణ ప్రణాళికలను చర్చించారు. మంత్రి కేటీఆర్ తన అమెరికా పర్యటనలో భాగంగా అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్ట్నర్ జాన్ మల్డొనాడొతో జరిగిన సమావేశంలో హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మా ఈకో సిస్టం గురించి విస్తృతంగా చర్చించిన అంశాన్ని ఈరోజు జరిగిన సమావేశంలో పంకజ్ పట్వారి ప్రత్యేకంగా ప్రస్తావించారు
హైదరాబాద్ నగరంలో అడ్వెంట్ ఇంటర్నేషనల్ తన పోర్ట్ఫోలియోను భారీగా విస్తరించుకోవడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణలో నూతన పెట్టుబడుల ద్వారా భారీ ఎత్తున విస్తరిస్తుండడం తెలంగాణ ఐటీ మరియు లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టం బలానికి నిదర్శనం అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్ ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలను చేపట్టామని, ముఖ్యంగా పరిశ్రమ భాగస్వాములతో కలిసి చేపట్టిన అనేక కార్యక్రమాలు ఈరోజు లైఫ్ సైన్సెస్ ఈకోసిస్ట్ వేగంగా వృద్ధి అయ్యేలా చేస్తున్నాయన్నారు.
అడ్వెంట్ ఇంటర్నేషనల్ సంస్థ తెలంగాణ కేంద్రంగా మరింత పెద్ద ఎత్తున వృద్ధి సాధిస్తుందని, ఇందుకోసం సంస్ధకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టంలో తమ పెట్టుబడులను ఈరోజు ప్రకటించడం పట్ల అడ్వెంట్ ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ పట్వారి సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఇన్నోవేషన్ మరియు వృద్ధి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తమ కోహన్స్ ప్లాట్ఫారం ద్వారా భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు.