mt_logo

అదానీ అంశంలో చేతులెత్తేసిన రాహుల్.. రేవంత్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

తాజా పరిణామాలు చూస్తుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే అనిపిస్తుంది. ఒకవైపేమో దేశవ్యాప్తంగా అదానీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ కాలికి బలపం కట్టుకుని తిరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అదానీకి రెడ్ కార్పెట్ వెల్కం చెబుతూ వచ్చింది.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు అదానీ అనైతిక వ్యాపార విధానాలను నిరసిస్తూ.. కేసీఆర్ అదానీని తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి అదానీకి గేట్లు తెరిచాడు. దావోస్ వేదికగా పలు ఒప్పందాలు చేసుకున్నాడు.. అది చాలనట్లు ఈమధ్యే అదానీ నుండి రూ. 100 కోట్ల విరాళాన్ని కూడా స్వీకరించాడు.

సుమారు 2,200 కోట్ల రూపాయల లంచం ఇచ్చడాన్న ఆరోపణతో నిన్న అదానీ మీద అమెరికాలో క్రిమినల్ కేసు నమోదయింది. ఈ కేసు తాలుకు ప్రకంపనలు భారతదేశానికి కూడా తాకాయి. అదానీతో వ్యాపార సంబంధాలు పెట్టుకున్న కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డాయి.

ఈ కేసు గురించి స్పందిస్తూ.. మన దేశంలో కూడా అదానీ మీద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశాడు. ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో అదానీపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అదానీతో సంబంధాలు పెట్టుకున్న కాంగ్రెస్ పాలిత కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాల సంగతేంటని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. బీజేపీ పాలిత రాష్ట్రాలు కానీ, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు కానీ ఎవరైనా సరే అదానీ అంశంలో శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నాడు.

దీంతో.. రేవంత్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డంత పనైంది. ఇప్పటికే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ హైకమాండ్‌కి మధ్య దూరం పెరిగిందని, అసలు రేవంత్‌కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేరని విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. రాహుల్ వ్యాఖ్యాలు సంచలనం రేపాయి.

బీజేపీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ సీఎం రేవంత్ అదానీ గ్రూప్ నుండి రూ. 12,400 కోట్ల పెట్టుబడులను, రూ. 100 కోట్ల విరాళాన్ని ఎందుకు స్వీకరించాడని ప్రశ్నించింది. తద్వారా రేవంత్ మరింత ఇరకాటంలో పడ్డాడు.

ఇదే అదనుగా చూసి తెలంగాణలో సీఎంని మారుస్తారా అని ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. బీజేపీతో సఖ్యత కోసమో లేక ఇతర కారణాల వల్లనో అదానీతో రేవంత్ చేసిన దోస్తీ వల్ల ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది.

.