డిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన కేసీఆర్ నిన్న సాయంత్రం జేయేసీ నేతలతో సమావేశం అయ్యారు. కేకే నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ బిల్లు, ఇటీవలి పరిణామాలు చర్చించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పడటం ఖాయమని అన్నారు. పదిజిల్లాలతో కూడిన, హైదరాబాద్ పై ఏ షరతులు లేని క్లీన్ తెలంగాణకే తెలంగాణ సమాజం ఒప్పుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. మరే ఇతర ప్రతిపాదన కూడా తమకు ఆమోదయోగ్యం కాదని కుండబద్దలు కొట్టారు. రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ సూచించారు.
మా సభకు వచ్చిన డ్రైవర్లంత మంది లేరక్కడ:
సెప్టెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన సభ లాంటివి తెలంగాణా ఉద్యమం అనేకం నిర్వహించిందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యోగ గర్జనకు వచ్చిన డ్రైవర్లంత మంది కూడా ఏపీ ఎన్.జీ.వో ల సభకు రాలేదని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లో త్వరలో భారీ సదస్సు:
త్వరలోనే హైదరాబాద్‌లో భారీ సదస్సు నిర్వహిస్తామని కేసీఆర్, కోదండరాం ప్రకటించారు. ఈ నెల 12న జరిగే జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో సభా నిర్వహణపై చర్చించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు తెలిపారు.