mt_logo

వీణావాణీల సొమ్ము స్వాహా!

వీణ-వాణి..! పత్రికల్లో.. టీవీల్లో వారిని చూస్తే గుండె కలుక్కుమంటుంది. ఏ దేవుడి శాపమోగానీ తలలు అతుక్కుని అవిభాజ్య కవలలుగా పుట్టి బతకలేక, విడిపోయే దారిలేక వాళ్లు నరకయాతన పడుతున్నారు. వాళ్లను చూసినవారికి ఎవరికైనా హృదయం ద్రవిస్తుంది. మనసు వికలమవుతుంది. కన్నీళ్లు కార్చకుండా ఉండలేం! అంతటి దయనీయస్థితిలో ఉన్నవారిని అడ్డుపెట్టుకుని సొమ్ము చేసుకోవడం అనేది ఊహించగలమా? అలాంటి పాపిష్టివాళ్లు ఈ భూమ్మీద ఉంటారని కలనైనా అనుకోగలమా? కానీ దురదృష్టం.. జర్నలిజం ముసుగులో ఓ టీవీ చానెల్ యజమాని ఆ కవలల కన్నీళ్లనూ కాసులుగా మార్చుకున్నాడు. వాళ్ల యాతనను రంగుల్లో చూపించి ఆబగా లక్షల రూపాయలు వసూలు చేసుకుని మింగేశాడు. ఇదేం అన్యాయం? అని అడిగిన ఆ పిల్లల తండ్రి మీద బెదిరింపులకు దిగుతున్నాడు. మాట్లాడేందుకు ప్రయత్నించినా కసురుకుంటున్నాడు. ఒక్కపైసా ఇచ్చేది లేదు.. ఏమైనా చేసుకోండంటూ తెగేసి చెప్తున్నాడు. అంత నీచస్థాయికి దిగజారేది ఎవరనేది ప్రత్యేకంగా చెప్పే పనిలేదు. ఆయనే వేమూరి రాధాకృష్ణ!!

-ప్రోమోలు, లైవ్‌తో దాతలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గాలం
-విరాళాల్లో పిల్లల కుటుంబానికి ఒక్కపైసా ఇవ్వని కక్కుర్తి రాధాకృష్ణ
-తండ్రి అడిగితే గద్దింపులు, బెదిరింపులు
-కేసు పెట్టి విచారణ జరిపించాలని బాధితుల డిమాండ్
-చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి నీచమైన పనులు

వీణావాణీల అసహాయత మీద పత్రికలు, టీవీల్లో అనేక కథనాలు వచ్చాయి. వారి దైన్యస్థితిని, హాస్పిటల్‌లో వారి పెంపకం తీరును ప్రజలకు వివరించాయి. వారిని విడదీసే మార్గాలమీద, ఇలాంటికేసుల్లో ఇప్పటికి జరిగిన ఆపరేషన్ల మీద ఎప్పటికప్పుడు ఎన్నెన్నో వార్తలు, విశ్లేషణలు! ఏది రాసినా.. ఏది ప్రసారం చేసినా సమాజం వారికి సంఘీభావంగా నిలవాలన్న ఆలోచన తప్ప మరో భావన లేదు. వాళ్లను సురక్షితంగా విడదీస్తే బాగుండునని ప్రజలు కూడా కోరుకున్నారు. మీడియా కానీ, ప్రజలు కానీ వాళ్లు బాగుండాలని, మామూలు జీవనం గడపాలని ఆకాంక్షించారు తప్ప.. మరో ఆలోచన చేయలేదు. కానీ ఏబీఎన్ చానల్ అధినేతకు మాత్రం ఈ అసహాయతనుంచి డబ్బులు పిండుకునే ఆలోచన వచ్చింది. మా వాళ్లకు ఎంటర్‌ప్రైజింగ్ నేచర్ ఎక్కువ అని పదేపదే చెప్పుకునే సదరు యజమాని, తమ ఎంటర్‌ప్రైజింగ్ లక్షణాలేమిటో చూపించాడు.

2012 జనవరిలో ఆ చానెల్ లో వీణావాణీలపై ఓ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమైంది. రండి రండి చేయి కలుపుదాం, వీణావాణీలకు అండగా నిలుద్దాం అని పిలుపునిస్తూ ఓ ప్రోమో విపరీతంగా ప్రసారం చేశారు. జనవరి 18న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి గంటా 14 నిమిషాల 31 సెకండ్ల పాటు వీణావాణీల మీద లైవ్ షో నిర్వహించింది. నిస్సహాయస్థితిలో ఉన్న వీరికి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే అకౌంట్ నంబర్ 527601010033263లో ఆమోదా పబ్లికేషన్స్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, జూబ్లీహిల్స్, హైదరాబాద్ పేరున డిపాజిట్ చేయాలని లైవ్ షోలో పదేపదే విజ్ఞప్తి చేశారు. అకౌంట్ నంబర్‌ను, ఇతర వివరాలను ఆ కార్యక్రమం పొడవునా గ్యాప్ లేకుండా స్క్రోలింగ్‌లలో ఇచ్చారు. వాస్తవానికి ఈ కార్యక్రమం గురించి చెప్పినపుడు వీణావాణీల తండ్రి మురళీగౌడ్ తన ఖాతా నంబరు వేయాలని అడిగాడు. కానీ ఏబీఎన్ తన ఖాతా నంబరు మాత్రమే ప్రసారం చేసింది.

ప్రసారంలో పిల్లల యాతన చూసి మనసు కరిగి అనేకమంది దాతలు, ముఖ్యంగా ఎన్నారైలు భారీ మొత్తాల్లో విరాళాలు ప్రకటించారు. ప్రత్యక్ష ప్రసారంలో అనేకమంది దాతలు తాము వీణావాణీ కుటుంబానికి సహాయం చేస్తామని ప్రకటించారు. కొందరు ఆపరేషన్ చేయిస్తామన్నారు. కాల్స్‌చేసిన వారు తామే కాకుండా తమకు తెలిసిన వారు, ఫ్రెండ్స్, చుట్టాల దగ్గరకూడా కలెక్ట్‌ చేసి తప్పకుండా సహాయం చేయిస్తామని లైవ్ ఫోన్‌ఇన్‌లో భరోసా ఇచ్చారు. సహాయం చేయనున్న మొత్తాలను కూడా అనేకమంది బహిరంగంగా ప్రకటించారు. ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న వీణావాణీల తండ్రి మురళీగౌడ్ చర్చ సందర్భంగా తన ఆర్థిక పరిస్థితిపై, కూతుళ్ల ఆరోగ్యం, భవిష్యత్తుపై బెంగతో భోరున విలపించాడు.

లైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్న చానల్ ఇన్‌పుట్ హెడ్ కమ్ యాంకర్ మూర్తి ఆపరేషన్ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వం తీసుకుంటుంది.. ఇప్పుడు మురళీగౌడ్‌కు వీణావాణీతోపాటు మరో ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. ఆ కుటుంబం పూట గడుపుకోవడానికి ఇబ్బందులు పడుతున్నది. వారికి సహాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని పదేపదే ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. దీంతో మరింత ఎక్కువ సంఖ్యలో కాల్స్ రావడంతోపాటు భారీ మొత్తంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అకౌంట్‌లో డబ్బులు జమ అయ్యాయి. కార్యక్రమం పూర్తయింది. ఎక్కడి వారక్కడకు పోయారు. ఏబీఎన్ ఖాతా నిండింది. కానీ మురళి చేతికి చిల్లిగవ్వ రాలేదు. ఖాతాలో ఎంత జమైందో కూడా ఎవరూ చెప్పలేదు. మురళి ఎవరిని అడిగినా సమాధానం రాలేదు. సహనం నశించి నిలదీస్తే బెదిరింపులు ఎదురయ్యాయి.

ఇంతవరకు ఒక్క పైసా కూడా ఆ అసహాయులకు అందలేదు. అడిగేవారు లేరు. తర్వాత ఆ కార్యక్రమాన్ని అంతా మరిచిపోయారు. ఈ కార్యక్రమం ఏదో బాగుందనుకున్నట్టుంది. రెండేండ్లకు మళ్లీ నవ్యాంధ్ర రాజధాని పేరిట విరాళాల సేకరణ మొదలైంది. అదీ అయిపోయింది. ఇప్పుడు రైతన్నల పేరిట మళ్లీ దేశం మీద పడ్డాడు. ఎవరెవరో వస్తున్నారు. ఇస్తున్నారు. విరాళాలు కుమ్ముకునేందుకు పత్రిక మొదటి పేజీ అంకితమై పోయింది. అక్కడ ఉరికొయ్యకు రైతు వేలాడుతుంటే ఇక్కడ రాధాకృష్ణ గల్లాపెట్టె గలగలలాడుతున్నది. ఈ సొమ్ములు ఏమవుతాయో తెలియదు. ఎవరికి చేరుతాయో తెలియదు.. అసహాయ కవలల సొమ్ములే మింగేసిన వాడికి రైతులు ఒక లెక్కా?

మురళి కుటుంబ దైన్యం..
వరంగల్ జిల్లా నర్సింహులుపేట మండలం వీరిశెట్టిపల్లి గ్రామంలో మురళీగౌడ్ కుటుంబం ఉంటున్నది. హాస్పిటల్లో ఉన్న కన్నబిడ్డలను చూసుకోవడానికి నెలకోసారైనా ఇంటిల్లిపాది రావడానికి డబ్బులు సరిపోని దుర్భర దారిద్య్రం. వీణావాణీ పుట్టే సమయానికి మురళికి ఎకరం పొలం ఉండేది. భార్యకు పెద్ద ఆపరేషన్, పిల్లలను దవాఖానలవెంట తిప్పడంలో ఈ ఎకరం హరించుకుపోయింది. అందినకాడికి అప్పులుచేసి పిల్లలను విడదీసేందుకు శక్తిమేర పోరాడాడు. చివరికి అప్పులు మాత్రం మిగిలాయి. వీణవాణీల కంటే ముందు పుట్టిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు అఖిలకు 15 ఏండ్లు. చిన్న కూతురు అంబికకు పదేండ్లు. ఇద్దరూ చదువుకుంటున్నారు.

పొలం దాటి పోవటంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు మురళి ఒక పాత ఆటో కొనుక్కుని నడుపుకుంటున్నాడు. రోజువారి సంపాదన రూ.150 దాటడం లేదు. నిలోఫర్ హాస్పిటల్‌లో ఉన్న బిడ్డలను చూసిరావాలంటే కనీసం రూ.1000 ఖర్చు అవుతున్నది. కూతుళ్లకు ఏదైనా ఇచ్చిపోకుండా ఉండలేని తల్లిదండ్రుల మనసు! డబ్బులు సరిపోని స్థితిలో వెళ్లలేని నిస్సహాయత! అక్కడ బిడ్డలు ఎదురుచూస్తారనే ఆవేదన! నెలకోసారైనా వెళ్లలేక నాలుగైదు నెలలకోసారి వస్తూ వెళ్తున్నారు.

విచారణతోనే నిజాలు వెల్లడి
పిల్లల్ని ఎత్తుకుపోయేవాళ్లను చూశాం.. శవాలతో వ్యాపారం చేసే వాళ్లను చూశాం.. మాయచేసి కిడ్నీలు కాజేసే దగుల్బాజీలను చూశాం.. కానీ పసిపిల్లల నరకయాతనను రంగుల్లో చూపించి విరాళాలు నొక్కేసే వాళ్లను ఇపుడే చూస్తున్నామని ప్రజలు విమర్శిస్తున్నారు. నాలుగేండ్ల కింద ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వసూలు చేసిన విరాళాలు ఇప్పటి దాకా వీణా-వాణీలకు, వారి కుటుంబానికి అందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.

లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో వేయించుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి యాజమాన్యంపై విచారణ జరిపించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. ఒక దైన్యాన్ని చూసి చలించి ఇచ్చిన విరాళాలను కాజేయటం దారుణమని అంటున్నారు. లక్షలు దగ్గర పెట్టుకుని యాజమాన్యం ఒక్క పైసా కూడా ఇవ్వకపోవడం ఏ నీతికిందకు వస్తుందని ప్రశ్నిస్తున్నారు. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న మురళీగౌడ్ కుటుంబానికి కూడా పైసా సాయం చేయకుండా పైగా బెదిరింపులకు దిగడం ఎంత వరకు సమంజసమని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తున్నది.

ఎవరికి ఫోన్ చేశావ్?.. తెలివుండే మాట్లాడుతున్నావా?
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లైవ్ కార్యక్రమం నిర్వహించిన తరువాత లక్షల రూపాయలు ఈ బ్యాంక్ అకౌంట్‌లో పడ్డాయి. లైవ్ కార్యక్రమానికి ముందే మురళీగౌడ్ తన బ్యాంక్ అకౌంట్ నంబరు ప్రసారం చేయాలని కోరాడు. కానీ ఏబీఎన్ హెడ్ మీ అకౌంట్ అయితే డబ్బులు సరిగ్గా రావు.. అదే మా అకౌంట్ అయితే నమ్మకంతో ఇస్తారు.. అని చెప్పారు. సరే.. ఎవరి అకౌంట్ అయితే ఏమిటి అనుకున్నాడు మురళి. లైవ్ కార్యక్రమం తరువాత మురళి ఏబీఎన్ ఇన్‌పుట్ హెడ్ కమ్ యాంకర్ మూర్తికి ఫోన్ చేశారు.

-మురళీగౌడ్ : సార్ నేను వీణావాణీ ఫాదర్‌ను.
-మూర్తి: ఆ.. చెప్పండి.
-మురళీగౌడ్: మొన్న డొనేషన్లు వచ్చినయ్ కద సార్. మాకు సాయం చేస్తరేమోనని ఫోన్ చేసిన.
-మూర్తి: మీకు.. ఇచ్చేదేముంది?
-మురళీగౌడ్: కనీసం రూ.5 వేలు అయినా ఇవ్వండి సార్. చాలా కష్టంగా ఉంది.
-మూర్తి: ఆ విషయం నాకు తెలియదు. నేను ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్ మా బాస్‌ది. ఆయన్నే అడుగు.
-మురళీగౌడ్: సరే సార్. నంబర్ ఇవ్వండి.
-అనంతరం మూర్తి ఇచ్చిన రాధాకృష్ణ నంబర్‌కు ఫోన్ చేశాడు.
-మురళీగౌడ్: సార్ నేను వీణావాణీల తండ్రిని మాట్లాడుతున్నా.
-బాస్: చెప్పండి.
-మురళీగౌడ్: మా పాపల పేరు మీద డొనేషన్లు వసూలు అయ్యాయి కదా.. కొంత సాయం చేస్తారేమోనని ఫోన్ చేసిన.
-బాస్: ఏయ్.. ఏం మాట్లాడుతున్నవ్! నేనెవరో తెలిసే మాట్లాడుతున్నావా? అందులోనుండి మీకు ఏమీ ఇవ్వరు. ఫోన్ పెట్టేయ్!

మురళి ఫోన్ పెట్టేశాడు.. నాటినుండి నేటి వరకు మురళిని ఆ చానల్‌వారు కలవలేదు. ఎంత వసూలైందో కూడా చెప్పలేదు. అసలా డబ్బు ఏం చేస్తారో కూడా ఈయనకు తెలియదు. ఒక్క పైసాకూడా ఈయన చేతికి రాలేదు. నాలుగేండ్లు గడిచాయి. అడిగేవారు లేరు. ఇస్తానన్నవాళ్లూ లేరు. ప్రజలు ఉదారంగా ఇచ్చిన డబ్బులు ఆఖరుకు రాధాకృష్ణ పాలయ్యాయి.

మందలించినోల్లు లేరు : మురళీగౌడ్
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో లైవ్ తరువాత మమ్మల్ని మందలించినోల్లు లేరు. మాకెవ్వరూ డబ్బులివ్వలేదు. వీణావాణీలు కాకుండా ఇద్దరు పెండ్లికి ఎదుగుతున్న కూతుళ్లు ఉన్నారు. నాకున్నది డొక్కు ఆటో. నడుపుకుంటే రోజుకు రూ.150 దొరుకుతాయి. రిపేర్ పెడితే కూడబెట్టుకున్న డబ్బులన్నీ పోయినట్టే. కుటుంబం నడుసుడు కష్టంగ ఉంది. బిడ్డలను చూడనీకి పోవాలంటే ఒక్కొక్కరికి రూ.500 అయితయి. భార్యభర్తలం ఇద్దరం పోతే వెయ్యి అయితయి. పోవాలంటే ఇన్ని డబ్బులు ఉంటలేవు. ఎప్పుడో నాలుగైదు నెలలకోసారి పోతున్నాం. బిడ్డలు యాదికస్తె బువ్వ తినబుద్దికాదు. వాళ్లను వదిలేసి మనసు చంపుకుని ఇంటికాడ బతుకుతున్నం

వీణావాణీల గురించి…
పుట్టుకతోనే రెండు తలలు అతుక్కుని వీణ-వాణి జన్మించారు. నాటినుంటి వరకు వీరిద్దరి జీవనం భారంగా సాగుతున్నది. ప్రస్తుతం వీరిని నిలోఫర్ దవాఖానలో కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. వీరిని వేరుచేసే శస్త్రచికిత్సకోసం ఎందరెందరో డాక్టర్లు వచ్చారు. చూశారు. చర్చించారు. అయితే ఆపరేషన్ విజయవంతం మీద ధీమా ఇవ్వలేని స్థితి ఉంది. ఖర్చుగురించి ఆలోచించవద్దని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లతో పలుమార్లు చర్చించారు. అయినా ఒక అంచనాకు రాలేదు. తాజాగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఎయిమ్స్‌కు లేఖ రాశారు. వచ్చి ఒకసారి వీరిని పరిక్షించి వెళ్లాలని కోరారు.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *