mt_logo

రూ.887 కోట్లతో మూడు ఆధునిక జూట్ మిల్లులు, 10వేల మందికి ఉపాధి : కేటీఆర్

వ్యవసాయ రంగంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని, సీఎం కేసీఆర్‌ విజన్‌తో వ్యవసాయ దిగుబడులు ఐదింతలు పెరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు. రూ.887కోట్లతో రాష్ట్రంలోని కామారెడ్డి, వరంగల్, సిరిసిల్లలో మూడు ఆధునిక జూట్‌ మిల్లుల ఏర్పాటుపై మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ సమక్షంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జూట్‌ మిల్లుల ఏర్పాటుతో 10 వేల మందికి పైగా ఉపాధి లభిస్తుందన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణానికి జూట్‌ ఉత్పత్తులు ఉపయోగపడతాయని చెప్పారు. మన రాష్ట్రంలో ఇప్పటివరకు జూట్‌ మిల్లులు లేవని, కొత్తగా ఏర్పడబోయే జూట్‌ మిల్లులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వచ్చే 20 ఏళ్లలో సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ ద్వారా జూట్‌ ఉత్పత్తులు కోనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో జూట్‌ పరిశ్రమకు రాష్ట్రంలో మంచి డిమాండ్‌ ఉందని అన్నారు.
మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ ఇవాళ ఏం ఆలోచిస్తే రేపు దానిని దేశమంతా అనుసరిస్తుందని, మిషన్‌ భగీరథ పథకాన్ని దేశంలోని చాలా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకే తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని, ఇది సీఎం కేసీఆర్‌ విజన్‌కు నిదర్శనమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో ఉత్పత్తుల నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 50 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమవుతాయని అన్నారు. జూట్‌ మిల్లుల ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక్కడ తయారయ్యే జూట్‌ ఉత్పత్తులను మొదట రాష్ట్రానికి ఇవ్వాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *