mt_logo

ద‌శాబ్దిలోనే శ‌తాబ్ధి అద్భుతాలు.. హైద‌రాబాద్‌లో ఐకానిక్ క‌ట్ట‌డాలు

హైద‌రాబాద్‌.. చారిత్ర‌క న‌గ‌రం..కుతుబ్‌షాహీల పాల‌న‌లో  నిర్మించిన అద్భుత క‌ట్ట‌డాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప‌ర్యాట‌క న‌గ‌రం. అలాంటి న‌గ‌రంలో స‌మైక్య పాల‌కులు వారికి ప‌నికొచ్చే నిర్మాణాలు చేప‌ట్టారే త‌ప్ప‌.. ఈ న‌గ‌ర ఖ్యాతి శాశ్వ‌తంగా  చ‌రిత్ర‌లో నిలిచిపోయే క‌ట్ట‌డాల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. పైగా ట్యాంక్‌బండ్‌పై ఆ ప్రాంత నాయ‌కుల విగ్ర‌హాలు పెట్టుకొని, తెలంగాణ‌పై నిండా వివ‌క్ష చూపారు. కానీ స్వ‌రాష్ట్రంలో చారిత్రక హైదరాబాద్‌లో సరికొత్త చరిత్ర నిర్మాణం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనలతో దశాబ్దిలోనే శతాబ్ది పాటు గుర్తుండేలా అద్భుత కట్టడాలు, ఐకానిక్‌ నిర్మాణాలు రూపుదిద్దుకొన్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న ఈ మహానగరం ప్రతిష్టను ఈ ఐకానిక్‌ నిర్మాణాలు విశ్వవ్యాప్తం చేశాయి. తెలంగాణ వైభవం ఉట్టి పడేలా ఉన్న నిర్మాణాలను చూసి దేశమే విస్తుపోతున్నది.  

అంబేద్కర్‌ విగ్రహంతో ఆకాశానికి తెలంగాణ‌ ఖ్యాతి

హైద‌రాబాద్ న‌డిఒడ్డున హుస్సేన్‌సాగర్‌ తీరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 125 అడుగుల భారీ విగ్రహం సగర్వంగా కొలువుదీరింది. ఇది దేశంలోనే అత్యంత ఎత్తైన విగ్రహం. దీని బరువు 465 టన్నులు. దీని కోసం 96 టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. ఎత్తు 125 అడుగులు, వెడల్పు 45.5 అడుగులు. విగ్రహం ఖర్చు రూ.146 కోట్లు. ఈ ప్రాజెక్టులో మొత్తం 791 టన్నుల స్టీల్‌ వాడారు. విగ్రహం తయారీకి 425 మంది పనిచేశారు. ఇందులో 15 మంది సామర్థ్యంతో 2 లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటుకు 11.7 ఎకరాలు, ప్రధాన, అనుబంధ భవనాలు 1.35 ఎకరాలు, చుట్టూ పచ్చదనంకు 2.93 ఎకరాలు, 1.23 ఎకరాల్లో అభివృద్ధి, 4.82 ఎకరాల్లో కామన్‌ పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఉన్న పీఠం ఎత్తు 50 అడుగులు, మొత్తం ఎత్తు 175 అడుగులు. అంబేద్క‌ర్ సొంత రాష్ట్ర‌మైన మ‌హారాష్ట్ర‌లోనూ ఇంత పెద్ద భారీ విగ్ర‌హం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ విగ్ర‌హ ఏర్పాటుతో తెలంగాణ ఖ్యాతి ఆకాశానికి అంటింది. 

క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌తో అంతర్జాతీయ గుర్తింపు  

హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌కు  అంతర్జాతీయ ప్రమాణాలతో కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ ట్విన్‌ టవర్స్‌ను నిర్మించారు.  సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా 2015 నవంబరు 22వ తేదీన బంజారాహిల్స్‌ రోడ్డు నెం.12లో పోలీసు శాఖ స్థలంలో ట్విన్‌ టవర్స్‌కు శంకుస్థాపన చేశారు. ట్విన్‌ టవర్స్‌లో ఒక‌దాన్ని పూర్తిగా టెక్నాలజీకే కేటాయించారు. మరొకటి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయ భవనం. ఈ రెండింటి మ‌ధ్య సుమారు 40 వేల చదరపు అడుగులతో అత్యాధునిక టెక్నాలజీ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటైంది. ఇందుకోసం తెలంగాణ స‌ర్కారు  వెయ్యి కోట్లు వెచ్చించింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 40 వేల సీసీ కెమెరాలు కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లకు అనుసంధానం చేశారు.  

నీలకంఠేశ్వరస్వామి దేవాలయ ప్రేర‌ణ‌తో స‌చివాల‌యం

డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం దేశంలోనే ఓ అరుదైన అద్భుత నిర్మాణంగా ఖ్యాతిగ‌డించింది. కాకతీయ నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ క‌ట్ట‌డం అడుగడుగునా అదరహో అనిపించింది. దీన్ని షాపూర్‌ జీ పల్లోంజి అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అత్యున్నత ప్రమాణాలతో నిర్మించింది. అయితే, ఈ సచివాలయ డిజైన్‌కు ప్రేరణ నిజామాబాద్‌లోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వరస్వామి దేవాలయం, వనపర్తి సంస్థానపు రాజప్రసాదాల్లోని శైలులు-అకడి గోపురాలు, గుజరాత్‌లోని సారంగాపూర్‌లో ఉన్న హనుమాన్‌ దేవాలయ శైలుల ఆధారంగానే సచివాలయం గుమ్మటాల నిర్మాణాలు జరిగాయి. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నింటినీ ఎర్ర ఇసుకరాతితోనూ, మధ్యనున్న శిఖరం లాంటి బురుజును రాజస్థాన్‌ లోని ధోల్పూర్‌ నుంచి తెచ్చిన ఇసుకరాతితో నిర్మించారు. 28 ఎకరాల్లోని విశాల స్థలంలో 7,79,982 చదరపు అడుగుల విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తుతో ఈ భవనం నిర్మించబడింది.

నిత్యం ప్ర‌జ్వ‌లించే అమ‌రుల స్మార‌కం

తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ఆత్మ‌బ‌లిదానం చేసుకొన్నారు. అలాంటి అమ‌రుల‌ను నిత్యం స్మ‌రించుకొనేందుకు, వారి స్ఫూర్తిని భావి తరాలకు తెలియజేసేలా తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్‌సాగర్‌ సమీపంలో దాదాపు రూ.179 కోట్ల వ్యయంతో భారీ స్మారక మందిరాన్ని నిర్మించింది. ప్రత్యేకంగా దుబాయ్‌ నుంచి తెప్పించిన‌ 316 ఎల్‌ గ్రేడ్‌ రకం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ను ఈ నిర్మాణంలో వాడారు.  సుమారు 150 మీటర్ల చుట్టు కొలతతో ఉండే మొత్తం కట్టడానికి ఈ స్టీల్‌నే బయట వైపు వాడారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా తుప్పు పట్టడానికి అస్కారం ఉండదు. ప్రపంచంలోనే అతి పెద్ద స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ స్ట్రక్చర్‌గా ఈ నిర్మాణం రికార్డు సృష్టించనున్నది. కట్టడం రూఫ్‌ పైన ఉండే జ్యోతి (దీపం) 20 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అమరవీరుల స్మారక మందిరంలోని తొలి అంతస్తులో సుమారు 25వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా మ్యూజియం రూపుదిద్దుకున్నది.

స్టార్టప్‌లకు ఇంక్యుబేటర్‌గా విశాల‌మైన‌ టీ-హబ్‌

ఆలోచనతో రండి… ఆవిష్కరణతో వెళ్లండి అనే నినాదంతో స్టార్టప్‌లకు ఇంక్యుబేటర్‌గా టీ-హబ్ వెలిసింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హైదరాబాద్‌ త్రిబుల్‌ ఐటీ ప్రాంగణంలో సుమారు 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ -హబ్‌ భవనాన్ని నిర్మించారు. మౌలిక సదుపాయాలు, భవన నిర్మాణం కోసం తెలంగాణ స‌ర్కారు సుమారు రూ.10 కోట్లు కేటాయించింది. స్టార్టప్‌ ఎకో సిస్టిం అభివృద్ధి చేయడంతో మొదట్లో 400గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య ప్రస్తుతం 2000 వరకు పెంచారు. టీ హబ్‌లో ఇప్పటి వరకు 1800 స్టార్టప్‌లకు సహాయ సహకారాలు అందాయి. మరిన్ని స్టార్టప్‌లకు అవకాశం ఇచ్చేందుకు టీ హబ్‌ 2ను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. టీహబ్‌ 2 ప్రారంభమైతే ప్రపంచంలోనే రెండో అతి పెద్ద స్టార్టప్‌ ఇంక్యుబేషన్‌ కేంద్రంగా టీ హబ్‌ మారనున్నది.

జర్మన్‌ టెక్నాలజీతో జిగేల్‌మ‌నే కేబుల్‌ బ్రిడ్జి

ఇప్పుడు హైద‌రాబాద్ పేరు చెప్ప‌గానే అంద‌రి మ‌దిలో మెదిలే క‌ట్ట‌డం దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి.

 జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45ను మాదాపూర్‌తో కలుపుతూ 760 మీటర్ల పొడవుతో ఈ వంతెనను నిర్మించారు. రూ.184 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఈ సస్పెన్షన్‌ బ్రిడ్జి పొడవు 426 మీటర్లు. రెండు ఫిల్లర్ల మధ్య పొడవు 244 మీటర్లు. జర్మన్‌ టెక్నాలజీతో 8 దేశాల ఇంజినీర్లు 22 నెలల పాటు శ్రమించి దీన్ని నిర్మించారు. దుర్గం చెరువు నీటి మట్టానికి 20 మీటర్ల ఎత్తులో బ్రిడ్జి నిర్మితమైనది. ఒక్కో ఫైలాన్‌కు 26 దృఢమైన ఐరన్‌ కేబుళ్లు వాడారు. ఐటీ ఉద్యోగులకే కాకుండా నగర ప్రజల రాకపోకలకు ఎంతో సౌలభ్యంగా ఉండేలా దూరాన్ని తగ్గించేందుకు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది.

అత్య‌ద్భుతంగా ఫ్లైఓవ‌ర్లు

 ఇప్పటికే హైదరాబాద్‌ సిగలోకి ఫ్లై ఓవర్ల మీదుగా వెళ్తున్న మెట్రో నిర్మాణం చెరగని ముద్ర వేసుకోగా.. అద్భుతమైన ప్రజా రవాణా వ్యవస్థ జాబితాలోకి హైదరాబాద్‌ మహానగర ట్రాఫిక్‌ పద్మవ్యూహాలను చీల్చుకుంటూ సాకారమవుతున్న వ్యూహాత్మక దారుల పథకం ఎస్‌ఆర్‌డీపీ చేరింది. మొదటి దశలో రూ.8092 కోట్లతో 47 చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు, కేబుల్‌ బ్రిడ్జిలు, స్టీల్‌ బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాల్లో నాలుగు ఫ్లై ఓవర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉప్పల్‌, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ జంక్షన్ల మీదుగా చేపట్టిన ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టులు నిర్మాణాల్లోనే అద్భుతంగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది చివరలో ఉప్పల్‌, వచ్చే నెలలో ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌ ఫ్లై ఓవర్లు అందుబాటులోకి రానున్నాయి.