mt_logo

పోడు భూముల‌కూ పెట్టుబ‌డి సాయం.. ల‌క్షా 50వేల మంది రైతులకు వ‌రం

  • వ‌చ్చే నెల 10లోగా రైతుల‌కు బ్యాంకు ఖాతాలు
  • గిరిబిడ్డ‌ల క‌ల సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: స‌మైక్య రాష్ట్రంలో ద‌గాప‌డ్డ గిరిబిడ్డ‌ల‌ను స్వ‌రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క‌డుపులోపెట్టి చూసుకొంటున్నారు. తండాల‌ను పంచాయ‌తీలుగా మార్చ‌డంతోపాటు ఆదివాసీ, గిరిజ‌న బిడ్డ‌ల‌కు స‌క‌ల సౌక‌ర్యాలు క‌ల్పించారు. గిరిజ‌న రిజ‌ర్వేష‌న్ల‌తో విద్యా, ఉద్యోగాల్లో వారికి పెద్ద‌పీట వేశారు. గిరిజన బిడ్డ‌ల‌కు గురుకులాల‌తో నాణ్య‌మైన విద్య‌నందించ‌డంతోపాటు విదేశీ విద్య‌కు స‌హ‌కారం అందించారు. గిరిపుత్రుల‌ను వ్యాపార‌వేత్త‌లుగా తీర్చిదిద్దారు.. ఇన్ని చేసి ఏదో వెలితి. అదే గిరిపుత్రుల ద‌శాబ్దాల క‌ల పోడు భూముల‌కు ప‌ట్టాలు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ వాటిపై దృష్టిపెట్టారు. ఇటీవ‌ల స‌చివాల‌యంలో తెలంగాణ రాష్ట్ర ద‌శాబ్ది ఉత్స‌వాల  కార్యాచ‌ర‌ణ‌పై నిర్వ‌హించిన స‌మీక్ష‌లో పోడు భూముల‌పై కీల‌క నిర్ణయం తీసుకొన్నారు. ల‌క్షా 50వేల‌కు పైగా గిరి రైతుల‌కు ల‌బ్ధి చేకూరేలా పోడు భూముల‌కు ప‌ట్టాలిచ్చేందుకు చ‌క‌చ‌కా ఏర్పాట్టు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఇంత‌టితో ఆగ‌కుండా ఇప్పుడు ఆ భూమికి పెట్టుబడి సాయంకూడా అందించాల‌ని నిర్ణ‌యించారు. ఆదివాసీ, గిరిజనులు ఏండ్ల‌నాటి క‌ల సాకారానికి సీఎం కేసీఆర్ సాహాసోపేత నిర్ణ‌యం తీసుకొన్నారు. 

పోడు రైతులకు వచ్చే వానకాలం సీజన్‌ నుంచే రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించనునున్నాయి. అటవీహక్కు పత్రాలు లేనికారణంగా గిరిజన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్‌.. వారికి అటవీ హక్కు పత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. వచ్చే నెల 24 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో పోడు రైతులకు అటవీ హక్కు పత్రాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. గిరిజన రైతులు హక్కుపత్రాలు స్వీకరించేనాటికి ముందే రైతులందరికీ బ్యాంకు ఖాతాలు తెరవాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,845 గ్రామాలు, తండాలు, గూడేల పరిధిలోని ఆదివాసీ, గిరిజనుల ఆధీనంలో ఉన్న 4,01,405 ఎకరాల పోడు భూమికి హక్కు పత్రాలు స్వీకరించే 1,50,224 మంది రైతులకు బ్యాంకు ఖాతాలను వచ్చేనెల 10లోగా తెరిపించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది.

పోడు భూముల పట్టాలు పొందే ప్రతి లబ్ధిదారుడి పేరుతో ప్రభుత్వమే బ్యాంకు ఖాతాను తెరిపించి సంబంధిత రైతు బ్యాంకు ఖాతా నంబర్‌, బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, లబ్ధిదారుడి మొబైల్‌ నంబర్‌ తదితర వివరాలను అప్‌లోడ్‌ చే సేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది పోడు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు తెరిచేపనిలో నిమగ్నమయ్యారు. కాగా, త‌మ ద‌శాబ్దాల క‌ల నెర‌వేర్చ‌డంతోపాటు ఆ భూమికి రైతుబంధు కూడా ఇచ్చేందుకు నిర్ణ‌యించ‌డంపై గిరిపుత్రులు ఆనందం వ్య‌క్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌తోపాటు రాష్ట్ర స‌ర్కారుకు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.