mt_logo

పని చేసుకునే ప్రతి చేతికి పని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం : మంత్రి సింగిరెడ్డి

-వనపర్తిలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్

కుల వృత్తులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉంటుందని, సామాన్యులకు అండగా నిలవాలి అన్నది కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలో దివ్యాంగులకు 3,016 రూపాయల నుంచి 4,016 రూపాయలకు పెంచిన పింఛన్‌, బీసీ కుల వృత్తి దారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు సంక్షేమం మరియు అభివృద్ధిలో రాజకీయాలు లేవని తెలిపారు. కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, న్యూట్రిషన్ కిట్ ల మాదిరిగా పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాల వర్తింపు జరుగుతుందన్నారు. కుల వృత్తులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంది.

సామాన్యులకు అండగా నిలవాలి అన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. వృత్తులు గతంలో మాదిరిగా వారికి ఉపాధి ఇవ్వడం లేదు, వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేసారు. దశలవారీగా అందరికీ రూ.లక్ష సాయం అందుతున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే విడతలవారీగా సాయం ప్రతి ఒక్కరికీ అందుతుంది.. తొలి విడతలో 395 మందికి బీసీ బంధు కింద రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేస్తామని తెలిపారు. పని చేసుకునే ప్రతి చేతికి పని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం. 

వనపర్తి నియోజకవర్గంలో 6551 మందికి లబ్ధి

గత 9 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదే లక్ష్యంతో పని చేస్తున్నారు. నేడు తెలంగాణ నుండి వలసలు ఆగిపోయాయి .. ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు. అన్నార్తులకు అండగా నిలవాలని ఆసరా ఫించన్లు ఇస్తున్నారు.  దివ్యాంగులకు పింఛన్ రూ.4,016 కు పెంచడం మూలంగా వనపర్తి నియోజకవర్గంలో 6551 మందికి లబ్ధి పొందారని తెలిపారు.  

ఒకనాడు పదెకరాల రైతు కూడా తిండికి తండ్లాడిన పరిస్థితి

రైతును నిలబెట్టాలన్న ఉద్దేశంతో ఉచిత కరెంటు, రైతుబీమా, రైతుబంధు, సాగునీళ్లు ఇస్తూ పండించిన పంటలు కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తున్నారు. వ్యవసాయం బాగుపడడంతో దాని చుట్టూ అల్లుకున్న రంగాలు నిలదొక్కుకుంటున్నాయని అన్నారు. వ్యవసాయ రంగం బలపడటంతో అనేక వ్యాపార రంగాలు నూతనంగా ఏర్పాటు అవుతున్నాయి. ఒక్క వనపర్తిలో వెయ్యికి పైగా బంగారు దుకాణాలు, 50 వరకు బిర్యానీ సెంటర్లు ఏర్పాటయ్యాయి.  కార్ల షోరూంలు, బైక్ షోరూంలు, సూపర్ మార్కెట్ రాకతో వేల మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని అన్నారు.  ఒకనాడు పదెకరాల రైతు కూడా తిండికి తండ్లాడిన పరిస్థితి.

రాజకీయాలు, పైరవీలు, దళారులకు అతీతంగా సర్కారు పథకాలు 

తెలంగాణ రాష్ట్రంలో ఆ దుస్థితి నుండి గట్టెక్కడం తెలంగాణ సాధించిన విజయం సమాజంలో వెనకబడ్డ వారికి కార్పొరేషన్ల ద్వారా చేయూతనందిస్తాం. రాజకీయాలు, పైరవీలు, దళారులకు అతీతంగా సర్కారు పథకాల అమలవుతున్నాయి.  పనిచేసిన ప్రభుత్వానికి ప్రజలు చేయూతనందించి, అండగా నిలవాలని కోరారు.  వనపర్తిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 395 మందికి రూ.3.95 కోట్ల విలువైన బీసీ బంధు ప్రొసీడింగ్స్, 361 మంది దివ్యాంగులకు పెంచిన పింఛన్  రూ.3016 నుంచి రూ.4016 ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అందజేశారు.