
హైదరాబాద్: 2023 సంవత్సరానికి చేపట్టిన ఓటర్ల జాబితా రెండవ సవరణలో అభ్యర్థనలు, అభ్యంతరాల స్వీకరణ ఘట్టం ఈ రోజు(సెప్టెంబరు 19)తో ముగిసింది. అర్హులైన పౌరులు కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే ప్రక్రియ (ఫారం-6), ఓటర్ల జాబితా నుంచి చనిపోయిన వారు, చిరునామా మారిన వారి పేర్లు తొలగించే ప్రక్రియ(ఫారం-7), ఓటర్ల జాబితాలో వివరాలలో సవరణలు చేసే ప్రక్రియ (ఫారం-8) కింద అభ్యర్థనలు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత… మొత్తం రాష్ట్రంలో ఈ నెల 18 వరకు-కొత్త ఓటర్ల నమోదుకు 13.06లక్షల దరఖాస్తులు, పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు, వివరాల సవరణకోసం 7.77 లక్షల దరఖాస్తులు అందాయి.
అలాగే ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకు 14.72 లక్షలమంది కొత్తగా ఓటర్లుగా నమోదు కాగా, 3.39 లక్షల మందిని తొలగించారు. 10.95 లక్షలమంది ఓటర్ల వివరాలలో మార్పులు చేసారు. ఈ మార్పుచేర్పుల ఫలితంగా – ఓటర్ల జాబితాలో మొత్తం 3.13 కోట్లు ఉన్నట్లు, వీరిలో 1.57 కోట్లమంది పురుషులు కాగా, 1.56 కోట్ల మంది స్త్రీలు, 2226 మంది ఇతరులు ఉన్నట్లు తేలింది. దీంతో స్త్రీ పురుష నిష్పత్తి 994 గా, ఓటరు, జనాభా నిష్ఫత్తి (2023 వరకు) 696 గా తేలింది.
కొత్తగా చేరిన యువ ఓటర్లలో చెప్పుకోదగిన మార్పు కనిపించింది. జనవరి 5, 2023 నాటికి 18-19 ఏళ్ళ వయసున్న ఓటర్లు 2.79 లక్షలుండగా, 19 సెప్టెంబరు నాటికి 6.51 లక్షలకు అంటే 234 % పెరిగింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ వికాస్ రాజ్ నిరంతర పర్యవేక్షణలో 33 జిల్లాల ఎన్నికల అధికారులు రాత్రింబవళ్లు చెమటోడ్చడం వల్లనే ఇది సాధ్యమైంది.
18-19 ఏళ్ల మధ్య స్త్రీ పురుష ఓటర్ల నిష్పత్తి 717 గా ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయం. ఈ పరిస్థితిని మెరుగు పరచడానికి జిల్లా ఎన్నికల అధికారులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు. ఈ నెల 19 వరకు అందిన దరఖాస్తు లన్నింటినీ ఈనెల 27 లోగా పరిష్కరించి ఖరారయిన తుది జాబితాను అక్టోబర్, 4న ప్రకటించడం జరుగుతుంది. అభ్యర్ధనలు, అభ్యంతరాలకు గడువు ముగిసినప్పటికీ, అర్హులైన పౌరులు తమ దరఖాస్తులను ఎప్పుడైనా పంపుకోవచ్చని ఎన్నికల జాబితా సవరించిన ప్రతిసారీ వాటిని పరిష్కరించడం జరుగుతుందని.. తెలంగాణ రాష్ట్ర జాయింట్ ప్రధాన ఎన్నికల అధికారి ఒక పత్రికా ప్రకటనలో తెలియచేసారు.