mt_logo

పెరుగ‌నున్న అత్య‌వ‌స‌ర సేవ‌ల విస్తృతి

  • కొత్త‌గా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహ‌నాలు
  • అద‌నంగా 34 పార్థివ వాహనాలు అందుబాటులోకి
  • మొత్తం 466 వాహ‌నాలు ఆగ‌స్టు 1న ప్రారంభం

సీఎం కేసీఆర్ ఆదేశం మేర‌కు వైద్యారోగ్య శాఖ నూత‌నంగా 204 అంబులెన్సులు, 228 అమ్మ ఒడి వాహ‌నాలు, 34 హ‌ర్సె వాహ‌నాల‌ను కొనుగోలు చేసింది.రాష్ట్రంలో 108 అంబులెన్సులు, 102 (అమ్మ ఒడి), హ‌ర్సె (పార్థివ వాహ‌నాల‌) సేవ‌ల కోసం కొత్త‌గా 466 వాహ‌నాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిని ఆగ‌స్టు 1వ తేదీన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు వైద్య సేవలు అందిస్తున్న 108, 102, పార్థివ వాహనాల పనితీరుపై మంత్రి హ‌రీశ్ రావు గ‌త నెల‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఆయా వాహ‌నాల ద్వారా అందుతున్న సేవ‌ల‌ను కొనియాడారు. సిబ్బందిని అభినందించారు. వాహ‌నాల పనితీరు, రిపేర్లు, మెయింటెనెన్స్ వంటివి ఎప్ప‌టిక‌ప్పుడు పర్యవేక్షించి నివేదిక‌లు రూపొందించుకోవాల‌ని ఆదేశించారు. కాలం చెల్లిన అంబులెన్స్‌లు, అమ్మ ఒడి, హ‌ర్సె వాహనాలను వెంటనే తొలగించి, వాటి స్థానంలో నూతన వాహనాలను చేర్చాలని ఆదేశించారు. త‌ద్వారా గ‌ర్భిణులు, రోగుల‌ను వేగంగా ద‌వాఖాన‌ల‌కు చేర్చేందుకు వీలు క‌లుగుతుంద‌ని చెప్పారు.  ఈ మేర‌కు అధికారులు కొత్త వాహ‌నాల‌ను కొనుగోలు చేసి, బ్రాండింగ్ పూర్తి చేశారు. 

ప్ర‌స్తుతం రాష్ట్రంలో 426 అంబులెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి. 175 అంబులెన్సుల స్థానంలో కొత్త‌వి రిప్లేస్ చేస్తుండగా , మరో 29 అంబులెన్సులను అవసరమున్నట్లు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వినియోగించ‌నున్నారు. ఈ 204 కొత్తవి కలుపుతే రాష్ట్రంలో 108 అంబులెన్సుల సంఖ్య 455కు పెర‌గ‌నున్న‌ది. 

గ‌ర్భిణుల కోసం ప్ర‌వేశ‌పెట్టిన అమ్మ ఒడి వాహ‌నాలు (102 వాహనాలు) ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా 300 ఉపయోగంలో ఉన్నాయి. ఇందులో 228 వాహ‌నాలకు కాలం చెల్లిపోవ‌డంతో వాటిని తొలిగించి, వాటి స్థానంలో కొత్త‌గా 228 వాహ‌నాల‌ను రిప్లేస్ చేస్తున్నారు. 

ప్ర‌ధాన ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో మ‌ర‌ణించిన‌వారి పార్థివ దేహాల‌ను స్వస్థలాలకు తరలించడం కుటుంబ సభ్యులకు ఖర్చుతో కూడుకున్న పని. అందుకోసం ప్రభుత్వం ఉచితంగా హర్ సే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ హ‌ర్సె వాహ‌నాలు ప్ర‌స్తుతం 50 ఉన్నాయి. ఇందులో 34 వాహ‌నాలకు కాలం చెల్లిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కొత్త‌గా 34 వాహ‌నాల‌ను వీటి స్థానంలో రిప్లేస్ చేస్తున్నది. 

మంత్రి హ‌రీశ్ రావు ఆదేశాల మేర‌కు కొత్తగా సమకూర్చుకున్న మూడు ర‌కాల వాహ‌నాల‌కు స‌రికొత్త‌గా బ్రాండింగ్ చేశారు. 108, 102 అనే హెల్ప్ లైన్ సేవల నంబ‌ర్లు స్ప‌ష్టంగా క‌నిపించేలా ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ఫోటో, తెలంగాణ ప్రభుత్వ లోగో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా అమ్మఒడి వాహ‌నాలు మ‌రింత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. వాహ‌నం వెనుక భాగంలో అమ్మ‌కు ఆత్మీయ‌త‌తో.. బిడ్డ‌కు ప్రేమ‌తో.. అనే ట్యాగ్ లైన్ తో పాటు, సీఎం కేసీఆర్ ఓ బాలింత‌కు కేసీఆర్ కిట్ ను అందిస్తున్న ఫొటోను ముద్రించారు. చూడ‌టానికి ఆహ్లాదంగా ఉండే రంగుల్లో, అమ్మ ఒడి కార్య‌క్ర‌మ లోగో, శిశువు ఫొటోల‌తో 102 వాహ‌నాలు కొత్త లుక్ తో అందుబాటులోకి రానున్నాయి. పార్థివ వాహ‌నాల‌ సేవలు ఉచితంగా అందిస్తామనే విషయాన్ని తెలిపేవిధంగా ఉచిత సేవ అని ముద్రించారు.

వైద్య సేవ‌లు మరింత పటిష్టం – ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖల మంత్రి హ‌రీశ్ రావు

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ఉపయోగించే 108, 102తో పాటు, దురదుష్టవశాత్తు చనిపోయిన వారి పార్థీవ దేహాలను ఉచితంగా తరలించే హ‌ర్సె వాహ‌నాలు ఎంతో విలువైన సేవ‌లు అందిస్తున్నాయి. అయితే కొన్ని వాహ‌నాల‌కు కాలం చెల్లిపోవ‌డంతో త‌రుచూ మ‌ర‌మ్మ‌తుల‌కు గుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పాత వాహ‌నాల స్థానంలో కొత్త‌వి సమకూర్చుకోవడంతో పాటు, అవసరమున్నట్లు గుర్తించిన కొత్త ప్రాంతాల్లో వాహనాల సేవలు విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

ఈ మేర‌కు 466 నూత‌న వాహ‌నాలు సమకూర్చుకోవడం జరిగింది. వీటి రాక‌తో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో మరింత వేగం పెరుగుతుంది. ప్రమాదంలో ఉన్న వారికి అత్యవసర సేవలు వెంటనే అందుతాయి. ముఖ్యంగా వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రి నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆసుపత్రికి గర్బిణులు, బాలింతలను ఉచితంగా చేర్చే 102 వాహనాలను మరింత సౌకర్యవంతంగా రూపొందించి అందుబాటులోకి తెస్తున్నాం. ఇవి గర్బిణులు, బాలింతలకు ఎంతో ఉపయోగపడనున్నాయి. ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలు అందించే విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడటం లేదు. పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి వైద్యారోగ్య రంగాన్ని పటిష్టం చేసి, ఆరోగ్య రంగంలో తెలంగాణ దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల మన్ననలను పొందుతుండటం సంతోషకరమన్నారు మంత్రి.