mt_logo

తెలంగాణ రాష్ట్ర 2022-23 బడ్జెట్ అంశాలు ఇవే…

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సోమవారం శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దాదాపు రెండు గంటలపాటు సాగిన బడ్జెట్ ప్రసంగంలోని వివరాలు ఇలా ఉన్నాయి…

1. ద‌ళిత బంధు ప‌థ‌కానికి ఈ ఏడాది ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు గ‌తంలో ఇచ్చిన హామీ మేర‌కు నిధుల‌ను భారీగా పెంచారు. గ‌త వార్షిక బ‌డ్జెట్‌లో వెయ్యి కోట్ల‌ను కేటాయించ‌గా ఈసారి ఏకంగా వార్షిక బడ్జెట్లో దళిత బంధు పథకం కోసం 17,700 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు. దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌ నియోజకవర్గంతో పాటు చింతకాని, తిరుమలగిరి, నిజాంసాగర్‌, చారగొండ మండలాల్లో ప్రభుత్వం ఇప్పటికే సంపూర్ణంగా అమలు చేస్తోంది. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వందమంది చొప్పున మొత్తం 118 నియోజకవర్గాల్లో 11వేల 800 కుటుంబాలకు దళితబంధు పథకం కింద ఆర్థికసహాయం అందిస్తున్నది. వచ్చే సంవత్సరాంతానికి రెండు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం బడ్జెట్లో 17,700కోట్లరూపాయలను కేటాయించడం జరిగింది.

2. ప్రభుత్వపాఠశాలలను బలోపేతం చేసే దిశగా దృష్టి కేంద్రీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మనఊరు- మనబడి పథకాన్నిప్రారంభించింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధనను అందించడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పేదలకు ఆంగ్ల మాధ్యమం అందని ద్రాక్ష కాకూడదనీ, వారు కూడా మిగతా ప్రపంచంతో సమానంగా ఎదగాలనీ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,289 కోట్ల రూపాయలతో దశల వారీగా పాఠశాలల్లో అభివృద్ది పనులను ప్రభుత్వం చేపడుతున్నది. మొదటి దశలో మండలాన్ని యూనిట్ గా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా 9,123 పాఠశాలల్లో 3,497 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రారంభించింది.

3. రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికోసం ఈ ఆర్థిక సంవత్సరంలో వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది.

4. ఈ ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలో కొత్తగా అటవీ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఈబడ్జెట్‌లో వంద కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది.

5. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాబోయే రెండేళ్ల‌లో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ సంవత్సరం కొత్తగా ఎనిమిది వైద్య కళాశాలలను, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, సిరిసిల్ల, జనగామ, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాలలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2023 సంవత్సరంలోని రాష్ట్రంలోని మిగతా ఎనిమిది జిల్లాలైన మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగు, వరంగల్‌, నారాయణపేట, గద్వాల, యాదాద్రిల్లో మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. నూతన మెడికల్‌ కాలేజీల స్థాపన కోసం ఈ బడ్జెట్‌లో వెయ్యికోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.

6. ప్రభుత్వ హాస్పిటళ్లలో రోగులకు చికిత్సతో పాటు పోషకాహారాన్ని అందించాలనీ, ఇందుకోసం డైట్‌ ఛార్జీలను రెట్టింపు (డ‌బుల్‌) చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. టీ.బి., క్యాన్సర్‌ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్‌ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను 56 రూపాయల నుంచి 112 రూపాయలకు పెంచాలనీ, సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి 40 రూపాయలనుంచి 80 రూపాయలకు పెంచాలని ఈ బడ్జెట్ లో ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 43.5కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.

7. హైదరాబాద్‌ లోని 18 మేజర్‌ ప్రభుత్వ హాస్పటళ్లలో రోగితో ఉండే సహాయకులకు కూడా సబ్సిడీపై భోజన సదుపాయం కల్పించాలన ఈ బడ్జెట్లో నిర్ణయంచడం జరిగింది. రెండు పూటలా వారికి ఈ భోజనం అందుతుంది. ప్రతీ రోజు సుమారు 18,600 మందికి ఈ ప్రయోజనం కలుగుతుందని అంచనావేస్తోంది. దీని కోసం సంవత్సరానికి 38.66 కోట్లు ఖర్చవుతాయి.

8. పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్ లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందు కోసం ప్రభుత్వం 338 కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరం వెచ్చించనుంది.

9. రాష్ట్ర వ్యాప్తంగా 61 మార్చురీల ఆధునీకరణకు 32 కోట్ల 50 లక్షలరూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. (ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది.)

10. 2022-23 సంవత్సరంలో బడ్జెట్ లో పామాయిల్ సాగును ఎక్కువగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2.5 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందు కోసం ఈ బడ్జెట్ లో వేయి కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తోన్న రాష్ట్రం తెలంగాణ తప్ప మరోకటి లేదు.

11. వ్యవసాయ రంగానికి గత ఏడేళ్లుగా ప్రభుత్వం పెద్ద ఎత్తున బడ్జెట్ లో నిధులు కేటాయిస్తోంది. గత ఎనిమిది వ్యవసాయ సీజన్లలో రైతు బంధు పథకం కింద 50,448 కోట్లరూపాయలను 63 లక్షల మంది రైతుల ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. రైతు భీమా పథకం ద్వారా రైతు మరణిస్తే వారి కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇలా ఇప్పటి వరకు 75 వేల కుటుంబాలకు 3,775 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. ఇలా రైతు సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నాం. ఈ వార్షిక బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి మొత్తంగా 24254 కోట్ల రూపాయలు కేటాయించాం. గ‌తంలో హామీ ఇచ్చిన‌ట్టుగా ఈ ఏడాది 75 వేల లోపు రుణాల‌ను కూడా మాఫీ చేయాల‌ని నిర్ణ‌యించాం

12. వృద్ధాప్య ఫింఛన్ల మంజూరు కోసం విధించిన వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్లనుంచి 57 ఏళ్లకు తగ్గించింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సడలించిన వయోపరిమితి ప్రకారం కొత్త లబ్దిదారులకు ఆసరా ఫించన్లను ప్రభుత్వం అందజేస్తుంది. ఆసరా ఫించన్ల కోసం 2022-2023 వార్షిక బడ్జెట్లో11728 కోట్ల రూపాయలు ప్రతి పాదించడమైనది.

13. సొంత జాగ కలిగినవారు తమ స్థలంలో డబుల్‌ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం కోసం మూడు లక్షల రూపాయల చొప్పున అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.ఈ బడ్జెట్ లో అందుకు నిధులు కేటాయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మందికి , సొంత స్థలంలో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం ఇవ్వబోతోంది. నియోజకవర్గానికి మూడువేల ఇండ్ల చొప్పున కేటాయిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణంకోసం 12000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించింది.

14. ఎస్టీ నివాస ప్రాంతాలకు రోడ్ల నిర్మాణం కోసం ఎస్‌టీఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి వేయికోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది.

15. గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. అందులో భాగంగా 11 వేల కోట్ల రూపాయల వ్యయంతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ బడ్జెట్లో గొర్రెల పంపిణీ కోసం ప్రభుత్వం వేయి కోట్ల రూపాయలు కేటాయించింది.

16. రైతు బీమా మాదిరిగానే నేతన్నలు మరణిస్తే వారి కుటుంబాలను ఆదుకునేందుకు ఐదు లక్షల రూపాయల బీమా పథకాన్ని అమలు చేయాలని ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది.

17. గీత కార్మికుల సంక్షేమం కోసం వంద కోట్ల రూపాయలతో ప్రత్యేక పథకాన్ని ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టాలని ఈ బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది.

18. బాలింతలలో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈలోపాన్ని నివారించేందుకు, ‘ కేసీఆర్‌ నూట్రీషియన్‌ కిట్‌’ అనే పేరుతో పోషకాహారంతో కూడిన కిట్‌లను పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ బడ్జెట్ లో నిర్ణయించింది. ఈ కిట్స్‌ ద్వారా ప్రతి సంవత్సరం లక్షా 25 వేల మంది మహిళలు ప్రయోజనం పొందనున్నారు.

19 రాష్ట్రన వ్యాప్తంగా అన్నిప్రభుత్వ పాఠశాలల్లో, జూనియర్‌ కాలేజీల్లో 7 నుంచి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినులకు ఉచితంగా హెల్త్ అండ్ హైజనిక్ కిట్స్ ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఈ పథకం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మంది బాలికలకు ప్రయోజనం చేకూరనుంది.

20. హైద‌రాబాద్ చుట్టూ, ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టు ఉన్న గ్రామాలు, మున్సిపాలిటీల్లో నీటి కొర‌త‌ను శాశ్వ‌తంగా తీర్చేందుకు రూ.1200 కోట్ల‌ను ఈ వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించారు

21. దూప, దీప నైవేధ్య ప‌థ‌కంలో హైద‌రాబాద్‌లోని దేవాల‌యాల‌ను చేర్చాల‌న్న అర్చ‌కుల కోరిక మేర‌కు ఈ ఏడాది 1736 దేవాల‌యాల‌ను కొత్త‌గా ఈ ప‌థ‌కంలో చేరుస్తున్నారు. దూప దీప నైవేద్య ప‌థ‌కానికి రూ. 12.50 కోట్ల‌ను ప్ర‌భుత్వం కేటాయించింది.

22 రోడ్ల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తులు, నిర్వ‌హ‌ణ కోసం 1542 కోట్ల‌ను ప్ర‌భుత్వం ఈ వార్షిక బ‌డ్జెట్‌లో కేటాయించింది.

23. మెట్రో రైలును పాత‌బ‌స్తీలో 5.5 కిలోమీట‌ర్ల‌కు అనుసంధానించేందుకు ఈ బ‌డ్జెట్‌లో 500 కోట్లు కేటాయించ‌డ‌మైంది.

24. భ‌వ‌న నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త ప‌థ‌కం ప్ర‌వేశ‌పెడుతున్నాం. మొద‌టి విడుత‌లో ల‌క్ష మంది కార్మికుల‌కు మోటార్ సైకిళ్ల‌ను ఇవ్వాల‌ని బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించ‌డ‌మైంది. విధివిదానాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారు.

25. గిరిజ‌న‌, ఆదివాసీ గ్రామ పంచాయ‌తీల‌కు సొంత భ‌వ‌నాల నిర్మాణాన్ని చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీని కోసం ఈ ఏడాది 600 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చించ‌నున్నాం.

26. కాళేశ్వరం టూరిజం సర్య్యూట్ కు 750 కోట్లు ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది‌.

27. అర్బన్ మిషన్ భగీరథకు ఈ బడ్దెట్ లో 800 కోట్లు కేటాయించడం జరిగింది.

28. ఏయిర్ పోర్టు మెట్రో కనెక్టవిటీకి ఈ బడ్జెట్ లో 500 కోట్లు కేటాయించడం జరిగింది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు మరో 1500 కోట్లు కేటాయించడం జరిగింది.

29. పరిశ్రమలకు ప్రోత్సాహకాలుగా 2142 కోట్లు , పరిశ్రమలకు విద్యుత్ రాయితీ కింద 190 కోట్లను బడ్జెట్ లో కేటాయించడం జరిగింది.

30. పావలా వడ్డీ స్కీంను ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు, చిన్న తరహా పరిశ్రమలను, మహిళలు ఏర్పాటు చేసి విధంగా ప్రోత్సహించడానికి 187 కోట్లు కేటాయించడం జరిగింది.

31. హైదరాబాద్ మెట్రో పరిధిలో రోజుకు 20 లీటర్ల ఉచితంగా నీరందించే పథకానికి 300 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ లో కేటాయించడమైనది‌.

32. ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కి ఈ బడ్జెట్ లో 1500 కోట్లు కేటాయించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *