mt_logo

వీరులారా … వందనం

‘జోహార్..తెలంగాణ అమరవీరులకు జోహార్..జోహార్..’ అంటూ సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ స్తూపం ప్రాంతం మార్మోగింది. 1969 ఏప్రిల్ 4న అసువులు బాసిన అమరవీరుల సంతాపసభను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్తూపం ఎదుట నినాదాలు చేస్తున్న తెలంగాణవాదులు

సీమాంధ్ర పాలకుల కుట్రలు.. రిజర్వ్‌డ్ పోలీసుల దాష్టీకానికి విద్యార్థుల నెత్తుటితో తడిసిన ఆ నేల.. బుధవారం సాయంత్రం ఉద్యమకారులతో ఉప్పొంగింది. జై తెలంగాణ.. జై జై తెలంగాణ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని రగిలించింది. స్థూపం కింద ఓ పెట్టెలో దాసిన అలనాటి వీరుల అస్థికలు, లాఠీ చార్జీల ఫొటోలు సజీవ సాక్షులుగా మిగిలిపోయాయని ఉద్యమకారులు అభిప్రాయపడ్డారు.

1956లో తెలంగాణలో ముల్కీ నిబంధనలు అమలు కాకపోవడంతో విద్యార్థి లోకం భగ్గుమంది. దీంతో సీమాంధ్ర పాలకుల ఆదేశాలతో.. పోలీసుల తూటాలకు ఐదుగురు విద్యార్థులు బలయ్యారు. సికింంద్రాబాద్‌లో నిర్మించిన అమరవీరుల స్థూపం వద్ద గత 47 ఏళ్లుగా నివాళులు అర్పిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఓ వైపు వర్షం… ఈదురు గాలులు వీస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులు సికింంద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతానికి చేరుకున్నారు. అమర వీరుల స్థూపం వద్ద నివాళులుర్పించారు. తెలంగాణ సోషలిస్టు ఫ్రంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల సంతాప సభలో పెద్ద ఎత్తున తెలంగాణవాదులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రఖ్యాత రచయిత్రి, శాతవాహన యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సూరేపల్లి సుజాత రచించిన ‘ఇరుసు చక్రబంధిలో తెలంగాణ’ పుస్తకాన్ని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆవిష్కరించారు. తెలంగాణపై జరుగుతున్న దోపీడీపై అరుణోదయ విమలక్క బృందం గీతాలు ఆలపించింది. తెలంగాణ సోషలిస్ట్ ఫ్రంట్ సామాజిక వేదిక కన్వీనర్ అశోక్ చెట్టుపల్లి, కో-ఆర్డినేటర్స్ కమిటీ సభ్యులు కె.ఎన్.రామదాస్, ఎం.యాదవరెడ్డి, కె.రంగారెడ్డి, పి.జె.సూరి, సి.హెచ్.బాలకిషన్‌రావు, ఎం.ఎ.బే గ్, కె.ఎస్.గణేష్‌రావు, గోపాల్‌రెడ్డి, 1969 ఉద్యమకారుడు ప్రతాప్‌సింగ్ కిషోర్ సతీమణి డాక్టర్ సరోజ ఆస్తానా, ఎం.సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు, చలన చిత్ర దర్శకుడు బి.నర్సింగరావు పాల్గొన్నారు. [నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *