mt_logo

19000 కోట్ల రూపాయల రైతు రుణ మాఫీని  పూర్తి చేయాలి : సీఎం కేసీఆర్ ఆదేశం

-ఆగస్టు 3వ తేదీ నుంచి పునఃప్రారంభం 

 19000 కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.  ఈ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలొచ్చినా  రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం,  కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు… తదితర కారణాల వల్ల  ఆర్థిక లోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని సీఎం కేసీఆర్ తెలిపారు.  తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకునే నేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రగతి భవన్ లో బుధవారం నాడు సీఎం కేసీఆర్ గారు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. ‘‘ ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల., కేంద్రం ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణ కు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో  కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది.  రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరాఘటంగా కొనసాగిస్తూనే వస్తున్నది. మేము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరైనా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తే లేదు.’’ అని స్పష్టం చేశారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం తెలిపారు. ఈకార్యక్రమాన్ని రేపు అనగా ఆగస్టు 3వ తేదీ నుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.  రైతు బంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేను రోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు.