తెలంగాణ డయాగ్నస్టిక్ ద్వారా అందించే 134 పరీక్షలను కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ మోడ్ లో మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అన్ని జిల్లాల నుండి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. టీ-డయాగ్నస్టిక్స్ లో నేటి నుంచి 134 టెస్టులు అందుబాటులోకి వస్తాయి. ఇప్పటివరకు 57 టెస్టులు అందుబాటులో ఉన్నాయి. నూతనంగా 8 జిల్లాల్లో పాథాలజీ, 16 జిల్లాల్లో రేడియాలజీ ల్యాబ్స్ ప్రారంభించాము. కొత్తగా అందుబాటులోకి రానున్న టెస్టుల్లో ప్రైవేట్ ల్యాబుల్లో రూ.500 నుంచి రూ.10వేల వరకు ఖరీదు చేసే పరీక్షలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌లోని సెంట్రల్ ల్యాబ్‌లో నాణ్యత ప్రమాణాలు అత్యుత్తమంగా పాటిస్తున్నారంటూ ఇప్పటికే ఎన్‌ఏబీఎల్ సర్టిఫికెట్ వచ్చింది. 13 జిల్లా ల్యాబులు ఎన్‌ఏబీఎల్ ప్రాథమిక అక్రిడిటేషన్ సాధించాయి.
ఇప్పటివరకు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్లకు పైగా టెస్టులు నిర్వహించారు. 57.68 లక్షల మంది రోగులు ప్రయోజనం పొందారు.
-రోగులు – 57,68,523
-సేకరించిన నమూనాలు – 1,11,49,991
-ప్రొఫైల్స్ – 2,07,91,200
-చేసిన పరీక్షలు – 10,40,36,082
ప్రభుత్వ దవాఖాన పై నమ్మకంతో వచ్చే రోగులకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు కావొద్దన్న సంకల్పంతో సీఎం కేసీఆర్ టీ-డయాగ్నోస్టిక్స్‌కు రూపకల్పన చేశారు. 2018 జనవరి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పీహెచ్‌సీ నుంచి అన్ని స్థాయిల దవాఖానల్లో ఉచిత పరీక్షలు ప్రారంభం అయ్యాయి. 57 రకాల పాథాలజీ (రక్త, మూత్ర) పరీక్షలతోపాటు, ఎక్స్‌రే, యూసీజీ, ఈసీజీ, 2డీ ఈకో, మామోగ్రామ్ వంటి రేడియాలజీ పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. ఇకనుండి 134. ఒక్కో రేడియాలజీ, పాథాలజీ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4.39 కోట్లు ఖర్చు చేస్తున్నది. 134 పరీక్షలు నిర్వహించేందుకు మరో రూ.1.70 కోట్లు వెచ్చిస్తున్నది. అంటే ఒక్కో హబ్ ఏర్పాటుకు రూ.6.09 కోట్ల వ్యయం కానున్నది.
సుస్తీ పోగొట్టే దోస్తీ దవాఖానలు
గతంలో ఒక్కో ల్యాబుల నిర్వహణకు ఏటా రూ.2.40 కోట్లు ఖర్చు కాగా.. ఇప్పుడు అదనంగా మరో రూ.60 లక్షల భారం పడనున్నది. మొత్తంగా ప్రభుత్వం ఏటా రూ.3 కోట్లు వెచ్చించనున్నది. ఇలా పేదలకు ఉచితంగా పరీక్షలు, చికిత్స, మందులు అందించే గొప్ప కార్యక్రమం చేస్తున్నది. ఇక ఒక్క రూపాయి ఖర్చు కూడా పేదలకు ఉండదు. ఒకప్పుడు జ్వరం వచ్చినా మరేదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులకు వెళ్లాల్సిందే.
ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా మీకు సమీపం లోనే 350 బస్తీ దవాఖానలు ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 దవాఖానలు సేవలు అందిస్తున్నాయి.పేద ప్రజల సుస్తీ పోగొట్టి దోస్తీ దవాఖానలుగా పేరు గాంచాయి. వీటికి తోడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ సూపర్ హిట్ అయ్యాయి. కాంగ్రెస్ పాలనలో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులనుంచి నేను సర్కార్ దవాఖానకే పోతా అనే రోజులకు సీఎం కేసీఆర్ గారు తీసుకొచ్చారని ప్రసంగించారు మంత్రి హరీష్ రావు.