mt_logo

రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు 11 రైల్వే ప్రాజెక్టులు..

గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు సంబంధించి పలు ప్రాజెక్టులతో పాటు నిధులు మంజూరయ్యాయి. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు, సర్వే నిర్మాణం, లైన్ల నిర్మాణం, అర్వోబీలకు నిధులు కేటాయించడం వెనుక సీఎం కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎంపీల కృషి చాలా ఉంది. సమైక్య రాష్ట్రంలో కనీసం రైల్వే రోడ్డు బ్రిడ్జిని కూడా పొందలేకపోయిన తెలంగాణ ఇప్పుడు కీలకమైన రైల్వే ప్రాజెక్టులను సొంతం చేసుకుంది. సీమాంధ్రుల పాలనలో అరకొర నిధులతో నత్తనడకన సాగిన రైల్వే ప్రాజెక్టులు ఇకపై సొంత రాష్ట్రంలో వేగవంతం కానున్నాయి.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులపై ఇప్పటికే మూడుసార్లు ప్రధాని మోడీతో చర్చించి విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు. అంతేకాకుండా టీఆర్ఎస్ ఎంపీలు పలుసార్లు అప్పటి రైల్వే మంత్రి సదానందగౌడ తోనూ, ప్రస్తుత మంత్రి సురేశ్ ప్రభుతోనూ చర్చించి వినతిపత్రాలు అందజేశారు. సికింద్రాబాద్ నుండి మహబూబ్ నగర్ కు కేవలం ఒక లైన్ మాత్రమే ఉండగా రెండవ లైనుకు ఈ బడ్జెట్ లో రూ. 27.44 కోట్లు కేటాయించారు. ఈ లైన్ పూర్తయితే ప్రతిరోజూ ఈ రెండు నగరాల మధ్య ప్రయాణం చేసే ప్రజలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి వెళ్లే ప్రయాణికులకు సైతం సౌకర్యంగా ఉంటుంది. దీనివెనుక సీఎం కృషితో పాటు ఎంపీ జితేందర్ రెడ్డి కృషి కూడా ఉంది. అలాగే పెద్దపల్లి-కరీంనగర్-నిజామాబాద్ కు రూ. 141 కోట్లు కేటాయించడం వెనుక నిజామాబాద్ ఎంపీ కవిత, కరీంనగర్ ఎంపీ బీ వినోద్ కుమార్ ల ఒత్తిడి ఉంది.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 21 లైన్లు బడ్జెట్ లో మంజూరు చేయగా, వాటిలో తెలంగాణకు 11 దక్కాయి. సుమారు రూ.509 కోట్ల ఖర్చుతో కూడిన 11 ప్రాజెక్టులకు అనుమతి లభించింది. రాష్ట్రంలో మొత్తం 14 చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిలు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు కూడా ఈ బడ్జెట్ లో కేంద్రమంత్రి సురేశ్ ప్రభు విడిగా నిధులు కేటాయించారు. ఇవే కాకుండా ట్రాక్ రెన్యూవల్స్, ప్రధాన స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాట్లు తదితర అంశాలకు సంబంధించి నిధులు కేటాయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *