mt_logo

పెన్షన్ లు, దళిత బంధు కార్యక్రమాల అమలు పై సమీక్ష : మంత్రులు తలసాని & మహమూద్ అలీ

హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల అమలుపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. శనివారం డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని తన కాన్ఫరెన్స్ హాల్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి నగరానికి చెందిన MLC లు, MLA లు, జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులతో కలిసి జీవో 58, 59, ఆసరా పెన్షన్ లు, దళిత బంధు ఇతర కార్యక్రమాల అమలు పై సమీక్ష నిర్వహించారు. జీవో 58 క్రింద వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలించి పట్టాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న పట్టాలను వారం రోజుల్లోగా పంపిణీ చేసేలా పర్యవేక్షణ జరపాలని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ను మంత్రి ఆదేశించారు. వృద్దులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఎంతో గౌరవంగా బతకాలనే ఆలోచనతో ఆసరా పెన్షన్ క్రింద హైదరాబాద్ జిల్లా పరిధిలో 2.76 లక్షల మంది లబ్దిదారులకు ప్రతినెల 67 కోట్ల రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఆగస్టు నుండి 57 సంవత్సరాలు దాటిన వారికి కూడా నూతనంగా పెన్షన్ లను ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఆదేశాల మేరకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

పెన్షన్ కు అర్హులైన లబ్దిదారులు అందరికి గుర్తింపు కార్డులను పూర్తిస్థాయిలో పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లబ్దిదారులు దరఖాస్తులలో పేర్కొన్న అడ్రస్ లలో ప్రస్తుతం ఉండటం లేదని అధికారులు పేర్కొనగా, అవసరమైతే ఆయా నియోజకవర్గాల MLA ల సహకారం తీసుకోవాలని చెప్పారు. పెన్షన్ ల కోసం వచ్చి పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల వివరాలు అందజేస్తే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి మంజూరుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఎంతో పేదరికంలో ఉన్న దళితులను ఆర్ధికంగా వృద్దిలోకి తీసుకురావాలనే గొప్ప లక్ష్యంతో దళితబందు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారని వివరించారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గ పరిధిలో 100 మంది చొప్పున హైదరాబాద్ జిల్లా లోని 15 నియోజకవర్గాలలో మొత్తం 1484 మంది ని గుర్తించి ఒకొక్కరికి 10 లక్షల రూపాయల వ్యయంతో వివిధ యూనిట్లను అందజేయడం జరిగిందని వివరించారు.

ఈ యూనిట్లు అన్ని సక్రమంగా పని చేస్తున్నాయా? లేదా? పరిశీలించాల్సిన బాధ్యత SC కార్పోరేషన్ అధికారులపైనే ఉన్నదని మంత్రి స్పష్తం చేశారు. నియోజకవర్గాల వారిగా నియమించబడిన దళిత బంధు స్పెషల్ ఆఫీసర్ లు క్షేత్రస్థాయిలో పర్యటించి లబ్దిదారుల వివరాలు, యూనిట్ల సమాచారం తో కూడిన వీడియో, ఫోటో లతో కూడిన నివేదికలను సిద్దం చేసి ఆయా MLA లకు అందజేయాలని మంత్రి ఆదేశించారు. రెండో విడత దళితబందు అమలుకు సంబంధించి ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నదని తెలిపారు.  అదేవిధంగా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకొనే వారికి ప్రభుత్వం 3 లక్షల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయం అందించేందుకు గృహ లక్ష్మి అనేక గొప్ప ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తుందని తెలిపారు. త్వరలోనే పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలు రానున్నాయని చెప్పారు.