mt_logo

రైతులను నష్టపర్చే మిల్లులపై కఠిన చర్యలు తప్పవు : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

  •  ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాలి 
  •  అన్నివిధాలా ఆదుకుంటామని అన్నదాతకు భరోసా అందించాలి 
  •  అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం… ధాన్యం కొనుగోలు పై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 
  •  పాల్గొన్న నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు ,వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు 
  •  కడ్తా పేరిట రైతులను నష్టపర్చే మిల్లులపై చర్యలకు ఆదేశం 
  •  సేకరించిన ధాన్యాన్ని వెంటదివెంట మిల్లులకు తరలించి అన్ లోడింగ్ చేయించాలని హితవు 

నిజామాబాద్: రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికందిన దశలో దురదృష్టవశాత్తు కురుస్తున్న అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం యావత్తు రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తూ, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామనే భరోసాను కల్పించాలని సూచించారు. ఈ విషయంలో ఇప్పటికే రైతు పక్షపాతి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతను ఆదుకునేందుకు తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా రైతులకు ఆపన్నహస్తం అందేలా క్షేత్రస్థాయిలో అధికారులు అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టం… వరి ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. 

అన్నదాతలు అధైర్యపడవద్దని మంత్రి భరోసా

ఇప్పటివరకు సేకరించిన ధాన్యం ఎంత, ఇంకను సేకరించాల్సి ఉన్న ధాన్యం నిల్వల వివరాల గురించి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. వీటిలో తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలించాలని సూచించారు. ఏప్రిల్, మే మాసాల్లో కురిసిన అకాల వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో 31,567 ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో 63 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలతో కూడిన నివేదికలు అందాయన్నారు  పంట నష్టం అంచనాల రూపకల్పన విషయంలో అధికారులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, రైతు కోణంలో ఆలోచన చేయాలని మంత్రి సూచించారు. నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందిస్తుందని, అన్నదాతలు అధైర్యపడవద్దని మంత్రి భరోసా కల్పించారు. ఇప్పటికే గత మార్చిలో నిజామాబాద్ జిల్లాలో 467 ఎకరాల విస్తీర్ణంలో పంట కోల్పోయిన రైతాంగానికి ప్రభుత్వం ఎకరాకు పదివేల చొప్పున 46 లక్షల పైచిలుకు నష్టపరిహారాన్ని మంజూరు చేసిందన్నారు. త్వరలోనే ఈ మొత్తాన్ని బాధిత రైతుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సేకరించిన ధాన్యంలో  95% మేర నిల్వలు రవాణా, అన్లోడింగ్

     ధాన్యం సేకరణలో రైతులకు ఏ చిన్న ఇబ్బంది సైతం తలెత్తకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతుల నుండి సేకరించిన ధాన్యాన్ని ఏ రోజుకారోజు వెంటదివెంట నిర్దేశించిన రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. మిల్లుల వద్ద లారీలు నిలిచిపోకుండా తక్షణమే ధాన్యం అన్లోడింగ్ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతుల కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల్లో ఐదు శాతానికి మించి ధాన్యం నిలువలు మిగిలి ఉండకూడదని, సేకరించిన ధాన్యంలో  95% మేర నిల్వలు రవాణా, అన్లోడింగ్ జరిగిపోవాలని సూచించారు. ధాన్యం దిగుమతి చేసుకునేందుకు ఎవరైనా రైస్ మిల్లర్లు ఇబ్బందులు పెడితే, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అలాగే కడ్తా పేరిట రైతులను నష్టపరిచే ప్రయత్నాలు చేస్తే మిల్లులను సీజ్ చేయిస్తామని కరాఖండిగా తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వానికి రైతు ప్రయోజనాలే ముఖ్యమని, ఈ విషయంలో ఎంత మాత్రం రాజీ పడబోమని, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలకు లోబడి రైతులు చన్నీ పట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను తీసుకువచ్చేలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు.