mt_logo

బుద్ధుని బోధనలను స్మరించుకున్న సీఎం కేసీఆర్‌

సమస్త జీవరాసుల పట్ల ప్రేమ, కరుణ, అహింస తో శాంతి, సహనంతో ప్రకృతితోమమేకమై జీవించాలనే మహాబోధి గౌతమ బుద్ధుని జ్జానమార్గం నేటి సమాజానికి ఎంతో అవసరమని, గౌతముని బోధనలను ఆచరించడం ద్వారా మానవ జీవితానికి పరిపూర్ణత సిద్ధిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.  గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ ని పురస్కరించుకుని ప్రజలందరికీ సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధుని బోధనలను, కార్యాచరణను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు.

  రెండువేల ఐదువందల ఏండ్ల క్రితమే శాంతియుత సహజీవన సూత్రాలను కార్యాచరణను విశ్వమానవాళికి అందించిన బుద్ధుడు సంచరించిన నేలమీద జీవిస్తుండడం ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమని సీఎం అన్నారు. వర్ణ,లింగ జాతి తదితర వివక్షతలకు, ద్వేషాలకు వ్యతిరేకంగా, మహోన్నతమైన దార్శనికతతో తాత్విక జ్జానంతో బుద్ధ భగవానుడు నాడు బోధించి ఆచరించిన సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సూత్రాలు అజరామరమైనవని సీఎం అన్నారు. మానవ సమాజం కొనసాగినన్నాల్లూ బుధ్దుని బోధనలకు ప్రాసంగికత వుంటుందని సీఎం తెలిపారు. 

 అదే సందర్భంలో..తెలంగాణ గడ్డమీద బౌద్ధం పరిఢవిల్లడం మనందరికీ గర్వకారణమని సీఎం అన్నారు. తెలంగాణ  సామాజిక జీవన సంస్కృతి లోని మూలాలు బౌద్ధంలో ఇమిడివున్నాయని సీఎం అన్నారు.  తెలంగాణ లో బౌద్ధం గొప్పగా విస్తరించిందనడానికి, కృష్ణా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వేలఏండ్ల కింద వెలసిన బౌద్ధారామాలు నేటికీ సజీవ సాక్ష్యాలుగా నిలిచాయని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాగార్జున సాగర్ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన ‘బుద్ధవనం’ నేడు ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తున్నదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వెలసిల్లిన నాటి బౌద్ధారామాలను పునరుజ్జీవింపచేస్తూ తెలంగాణ కేంద్రంగా బుద్ధుని బోధనలను ప్రపంచానికి అందించాలనే  రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో అనుసరిస్తున్న కార్యాచరణ కొనసాగుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. సమస్త రంగాల్లో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా పాలన కొనసాగిస్తున్నామన్నారు. కుల వర్ణ వర్గ మతాలకతీతంగా  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా పేదలు.. మొత్తంగా  సకల జనుల సంక్షేమం అభివృద్ధి  దిశగా పథకాలను కార్యాచరణను అమలు చేస్తూ  గౌతమబుద్ధుని ఆశయాలకు కార్యరూపమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళులర్పిస్తున్నదని సీఎం కేసీఆర్ అన్నారు.