mt_logo

కులము- ప్రాంతము-కన్నీరు

-అల్లం నారాయణ

యాదిరెడ్డికి కులం ఉంది. చందర్‌రావుకు కూడా కులం ఉంది. హరీష్‌రావుకు కూడా కులం ఉంది. కానీ, యాదిడ్డికి ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ చేతివంట తింటే మళ్లీ తన లక్ష్యం నుంచి దారిమళ్లి, గందరగోళపడి వెనక్కి వెళ్తానేమోనన్న సందేహం ఉండింది. అమ్మకన్నా, చెల్లెలి కన్నా ఆయనకొక తల్లి ఎక్కువైంది. ఆ తల్లి తెలంగాణ తల్లి. చనిపోకముందు యాదిరెడ్డి మనసు ప్రశాంతంగా ఉన్నది. పార్లమెంటు పక్కనే చెట్టుకు ఉరిపోసుకునే ముందు కూడా అతని మనసులో బహుశా అతని అమ్మ ఉందో? లేదో? తెలియదు. తెలంగాణ తల్లి మాత్రం ఉండే ఉంటుంది? ఏం చెప్పగలం యాదిడ్డి గురించి. ఎందుకు మరణించినావు నీకు కులముంది కదా! అని ఎట్లా అడగగలం.

రెడ్డివి కదా తెలంగాణ తల్లి కోసం ఆత్మహత్య చేసుకునే అర్హత లేదని ఎట్లా అనగలం. పోనీ అడుగుదామన్నా.. పేగు బంధం పోగొట్టుకున్న, తల్లి కూడా.. ఇప్పుడు వేరే విషయాలేవీ మాట్లాడ్డమే లేదు. ఆమె కంటికి ధారగా ఏడుస్తూ కూడా ‘తెలంగాణ కోసం నా బిడ్డ సచ్చిపోయిండు. మరోబిడ్డ సావకముందే తెలంగాణ ఇయ్యండి.. నా లాంటి మరో తల్లికి కడుపుకోత మిగల్చకండి! అంటున్నది. ‘గిట్ల ఎంత మందిని సంపుతరు’ అని కూడా యాదిడ్డి అమ్మ అడుగుతున్నది. ఇషాన్‌రెడ్డి, వేణుగోపాల్‌డ్డిలకు కూడా కులమున్నది. కానీ వాళ్లు రెడ్డి కుల ఉద్ధరణ కోసం, కుల దురహంకారం కోసం చనిపోలేదు. తెలంగాణ కోసమే బలిదానం చేశారు. బలిదానాలే వద్దనడం వేరు. బలివి తర్ది మీదికి ఎక్కుతున్న వాళ్లని, బరిగీసి నిలవమని అడగడం వేరు.

‘రాలకురా… నువ్వు కాలకురా’ అని పాడడం వేరు. కానీ ఒక మరణాన్ని శంకించే స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది. నిజమే యాదిరెడ్డి కులమూ, హరీష్‌రావు కులమూ ఒకటి కాదు. కానీ, యాదిడ్డి కోసం హరీష్‌రావు కార్చిన కన్నీళ్లనూ శంకించగలమా? కానీ చందర్‌రావు కులమూ వేరే. నిజమే ఆయనను కొట్టేముందో? తిట్టే ముందో? ఆలోచించాల్సిందే. ఎందుకంటే ఆయన కులం తరతరాలుగా తిట్లు భరించిన కులం. కొట్లు భరించిన కులం. కానీ యాదిరెడ్డి అమ్మకన్నా ఎక్కువగా భావించిన తెలంగాణ తల్లి సంగతేమిటి? ఎందుకు యాదిరెడ్డి తెలంగాణ కోసమే ఊళ్లు దాటి, సమయాలు దాటి, కాలాలు దాటి ఢిల్లీకి వెళ్లి మెడకు ఉరి బిగించుకున్నడు. తనది ఆఖరు చావుకావాలని ఎందుకు కోరుకున్నడు. అట్లాంటి యాదిరెడ్డి స్వభావాన్ని శంకించిన, త్యాగాన్ని శంకించిన చందర్‌రావు కులం కన్నా.. ఆయన గుణం ఎక్కడి నుంచి వచ్చింది.

ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చిన ఒక తెలుగువాడి ఉరిపోసుకున్న మృతదేహం మీద ప్రదర్శించిన సంతకందారు చందర్‌రావు ద్వేషం ఆయన కులం వల్ల వచ్చిందేనా? ప్రాంతం వల్లనా? ఎందువల్ల యాదిరెడ్డి మృతదేహం ఆత్మలేని ఒక మహానగరంలో ఆత్మలేని మనుషుల మధ్య అవమానాల పాలైంది. చందర్ రావు ఆత్మ మకిలి ప్రాంతం వల్ల కాదా? అదీ సమస్య. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇంగ్లీషులో నాజూగ్గా ‘బాస్టర్డ్స్’ అని తిట్టగలిగిన చందర్‌రావు కూతురుకు కూడా కులం ఉంది. కానీ ఆమె బహుశా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కులాన్ని ఉద్దేశించి తిట్టి ఉంటుందనుకోను. ప్రాంతం గురించే తిట్టి ఉండవచ్చు. బహుశా.. ఈ ప్రాంతం మీద ఆమె తండ్రి చందర్‌రావుకు, చెప్పు చూపించిన ఆమె తల్లికి కూడా అదే ద్వేషం ఉండి ఉండవచ్చు. కులం కన్నా ప్రాంతం ఈ విద్వేష బీజాన్ని నాటి ఉండవచ్చు. అప్పుడు పోనీ. హరీష్‌రావు ఏమి చేయకుండా ఉండాల్సింది.

తన కులం వల్లనూ, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కులం వల్లనూ ప్రాంతాన్ని మరిచి సమన్వయంతో, సమయస్ఫూర్తితో ఎవరినీ కొట్టకుండా ఉండాల్సి ఉండెను. నిజమే. కానీ యాదిడ్డి మానసిక క్షోభ. యాదిరెడ్డి అంతరంగం. మథనపడి, మథనపడి మనసు కూడదీసుకొని, చలించి, విచలించి, కాగిపోయిన, కరిగిపోయిన నిలువునిలువునా నీరై, కమిలిపోయి, కుమిలిపోయి, మనాదిలో తల్లడిల్లి.. తల్లడిల్లి ప్రశాంత చిత్తానికి వచ్చి ఉరిపోసుకున్న వాడి మానసిక స్థితి నుంచి ఒకసారి ఆలోచించగలమా? యాదిరెడ్డి ఊరిలో కన్నీరు పెట్టుకున్న హరీష్‌రావు అంతరంగంలో ఏమి ఉండి ఉంటుంది? ఏ అవమానాలు కదిలి ఉంటాయి. కుక్కల వలె, నక్కలవలె, సందులలో పందుల వలె.. శవాలకూ మర్యా ద ఇవ్వని ప్రపంచం గురించి.. ఎందుకు యాదిరెడ్డి శవం ఈ ప్రభుత్వా న్ని వణికించింది. యాదిడ్డి కులం వల్లనేనా? ఎందుకు? యాదిరెడ్డి ఉరిపోసుకున్న సుదీర్ఘరావూతి చీకటిలా తెల్లవారిన తర్వాత ఆ మరణ వార్తల మీద తెర కప్పారు.

ఎవరు కప్పారు? ఎందుకు కప్పారు? వారి కులం ఏమిటి? ఏపీ భవన్‌కు వస్తే యాదిరెడ్డి శవం ఎవరికి పీడకల అయ్యేది. చనిపోయి ఇంకో ప్రాంతం ప్రపంచాన్ని కదలబార్చి, బెదిరించిన యాదిరెడ్డి కన్న కలలు ఏపీ భవన్ మెట్లెందుకు ఎక్కలేదు. పన్నెండు అంబుపూన్సులు మార్చి, నాలుగు దారులు మార్చి, గ్రామంలో కరెంటు తీసేసి, చిమ్మచీకట్లు చేసి, శంషాబాద్ లో లాఠీచార్జి చేసి, జర్నలిస్టులను అరెస్టు చేసి, పెదమంగళారం పొడుగూతా ఆర్‌పీఎఫ్ బలగాలను దించి, నీటి ఫిరంగులు, బాష్పవాయుగోళాలు తయారు చేసి ఒక శవం భయపెట్టకపోతే, ఒక శవం మూలాలు కదలించకపోతే, ఒక బలిదానం, ఒక ఉరిపోసుకున్న సాధారణ, సాదాసీదా, రెడ్డి కులం డ్రైవర్ శవం ఈ రాజ్యాన్ని కదిలించకపోతే.. సోదరుడా చెప్పు ఒక శవం ఈ రాజ్యాన్ని వణికించింది. ఒక చందర్‌రావు ఆ శవం తాలుకు స్మృతిని, స్మరణను, ఆ శవానికి సంబంధించిన జ్ఞాపకాలను అన్నింటినీ అవమానించారు.

ఆయన కులం వల్లకాదు. నిజంగానే ఇదికుల సమస్యకాదు. నిజంగానే ఇవ్వాళ్టి తెలంగాణ కులం కోసం జరుగుతున్న పోరాటం కాదు. నిజంగానే ఇవ్వాళ్టి తెలంగాణ పోరాటం కులాలనుంచి విముక్తి కోసం , కులాల విముక్తికోసం, మహాసౌధాలను బద్దలు కొట్టడం కోసం జరగడంలేదు. నిజమే కులం కోసం, లందల్లో కత్తులు నూరే కాలంకోసం నువ్వు కన్న కల నిజమే. నిజమే కులం కోసం ఆరెతో ప్రపంచాన్ని రెండుగా చీల్చి న్యాయం సాధించాలని నువ్వు కలలు కంటూ ఉండొచ్చు. కానీ ఇది కులం కోసం పోరాటం కాదు. ఇది తెలంగాణ కోసం పోరాటం. అచ్చంగా యాదిరెడ్డి భావించినట్టుగానే తన అమ్మకోసం ఇంటికి వెళ్లడానికి కూడా మనసొప్పక, తెలంగాణ తల్లికోసం ఢిల్లీ రైలెక్కి మనసు ప్రశాంతంచేసుకొని చనిపోయిన యాదిరెడ్డి పోరాటం. దీనికి గద్దర్ కంటినీరు, నాకంటినీరు, ఈటెల రాజేందర్ కంటినీరు, హరీష్‌రావు, తారకరామారావు, స్వామిగౌడ్, కోదండరాంరెడ్డి, చుక్క రామయ్య, పిడమర్తి రవి, బాల్క సుమన్, విమలక్క కంటినీరు ఒక్కటే.

అది తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న యాదిరెడ్డి తల్లి దుక్కం. అది యాదిరెడ్డి కోసం తెలంగాణ సబ్బండ వర్ణాల కల్మషంలేని కంటినీరు. నిజమే.. ఉత్త భౌగోళిక తెలంగాణతో సామాజిక న్యాయం రాకపోవచ్చు. కానీ.. వలస పెత్తనం ఒక్క కులాన్నే కాదు, సంస్కృతినీ, చరివూతను, భాష, యాసనే కాదు, మొత్తంగా నాలుగున్నరకోట్ల మంది మూపులమీద నర్తిస్తున్నది. అది మనల్ని మనకు కాకుండా చేస్తున్నది. అది బొంకి, అబద్దమాడి ఢిల్లీని కట్టుకొని తెలంగాణలో యాదిడ్డిని, శ్రీకాంతాచారినీ, యాదయ్యనూ ఆత్మహత్యలకు పురికొల్పుతున్నది. నిజమే.. ఉత్త భౌగోళిక తెలంగాణ ద్వారా నూతన ప్రజాస్వామిక విప్లవం రాదు. కానీ తెలంగాణ స్వయంపాలన, ఆత్మగౌరవ పోరాటం దానికదిగా ఒక ప్రజాస్వామిక పోరాటం. నూతన ప్రజాస్వామ్యం కలలు కనొద్దని కానీ, సామాజికన్యాయం కల వికసించవద్దని కానీ, మాదిగ రిజర్వేషన్లు, వర్గీకరణలు తక్షణమే వర్ధిల్ల వద్దని కానీ యాదిడ్డి ఒక్క మాట కూడా తన మరణ వాంగ్మూలంలో రాయలేదు.

తెలంగాణ నీది, నాది, నాలుగున్నర కోట్ల జనులది. ఒక తల్లి విముక్తి కోసం జరుగుతున్న పోరాటం. మహాసౌధాలను కూలగొట్టాలంటే, కులం గోడలు బద్దలు కొట్టాలంటే మనువుల నయాగడీలను బద్దలు కొట్టాలంటే అది చరిత్ర నిండుగా కారం చేడయి, చుండూరై పదిరికుప్పమయి, నెత్తురోడిన నడుస్తున్న పోరాటమే. నిజమే ఈ నెత్తుటి కోలాటం కొనసాగాల్సిందే. కానీ మిత్రులారా! ముందు వలసాధిపత్యం నుంచి విముక్తిని కోరుకుందాం. పోరాడుదాం. ఇప్పటికే పరివ్యాప్తమై ఉన్న సామాజిక న్యాయపోరాటాన్ని ఇదే పోరు గర్భంలో పసిగట్టి ముందుకు తీసుకెళ్దాం. ప్రజాస్వామ్యమైనా, సామాజిక న్యాయమైనా తెలంగాణ తెచ్చుకున్నంక సాధ్యమే. ఎందుకంటే తెలంగాణ పోరాడుతూనే ఉంటుంది. అంతిమ లక్ష్యాల వైపు.. జై తెలంగాణ. యాదిరెడ్డి మరణం వృథాపోదు.

[నమస్తే తెలంగాణ నుండి]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *