mt_logo

ఉద్యమానికి పునాది మ్యాడం…

అది 25 ఫిబ్రవరి 1970. సికింద్రాబాద్ క్లాక్‌టవర్. చుట్టూ బందూకులు. అప్పటికే అక్కడ చాలా మంది గుమిగూడారు. ఎప్పుడేమి జరుగుతుందా అని అందరిలో ఉత్కంఠ. దీనికి కారణం. రెండ్రోజుల క్రితం (23 ఫిబ్రవరి 1970) గన్‌పార్క్ వద్ద మేయర్ ఎన్. లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో పోలీసుల ఉక్కు కంచెలను తెంచుకొని అమరవీరుల స్థూపానికి పునాదిరాయి వేశారు. ఆ తర్వాత అరెస్టులు. జైళ్లలో పెట్టించడం. బంద్‌లు జరిగాయి.

ఇపుడు సికింద్రాబాద్ లోని క్లాక్‌టవర్ వంతు. ఇక్కడా అదే విధంగా తెలంగాణ కోసం 69 ఉద్యమంలో అసువులు బాసిన అమరుల కోసం స్తూపాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక. ఇది నాటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తీర్మానమై ఉంది. ఈ విషయం పోలీసులకు లీకైంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ల అరెస్టుకు రంగం సిద్ధమైంది. కానీ ఇద్దరూ అజ్ఞాతంలో ఉండిపోయారు. మేయర్ ఎన్. లక్ష్మినారాయణ విజయవంతంగా తనకు అప్పగించిన పనిని పూర్తి చేశారు. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ‘మ్యాడం’ వంతు. అందరిలో ఉత్కంఠ.

అసలు డిప్యూటీ మేయర్ వస్తాడా..? ఆయన్న పోలీసులు అరెస్ట్ చేశారా..? అని గుమిగూడిన జనాల్లో అనుమానాలు. అక్కడికి రయ్యిన రెండుకార్లు దూసుకొచ్చాయి. మొదటి కారులోంచి డిప్యూటీ మేయర్ మ్యాడం రాంచంద్రయ్య ఒక్క ఉదుటన కిందికి దూకారు. మెడలో అమరవీరుల స్థూపానికి పునాది రాయి వేసేందు కోసం చెక్కించిన శిలాఫలకం వేలాడుతోంది. రెండో కార్లో వచ్చిన అప్పటి కౌన్సిలర్లు నలుగురైదుగురు మ్యాడంతో పాటు ముందుకురికారు.

క్లాక్‌టవర్ చుట్టూ ఉన్న గార్డెనంతా బురదమయంగా ఉంది. పోలీసులు ముందు జాగ్రత్తగా అక్కడ నీళ్లు పోసి ఉంచారు. మ్యాడం కాళ్లు బురదలో కూరుకుపోయాయి. అయినా.. లెక్కచేయకుండా అనుకున్న చోట శిలాఫలకాన్ని నాటారు. అమరవీరుల స్థూపానికి పునాదిరాయి పడింది. దీంతో అక్కడ గుమిగూడిన ప్రజల్లో ఆనందం కట్టలు తెంచుకుంది. తెలంగాణ నినాదాలతో ఆ మార్మోగింది. దీంతో పోలీసులకు కోపం నశాలానికంటింది.

బాష్పవాయువు గోళాలు పేల్చారు.. లాఠీలకు పని చెప్పారు. అయినా ప్రజలు పోలీసులను ఎదుర్కొన్నారు. ఇలా ఇద్దరు రెండు చోట్ల అమరుల స్మారక స్థూపాలకు ద్విగిజయంగా శిలాఫలకాలు వేశారు.

రజాకార్ల అంతు చూసేందుకు…

నైజాం, రాజాకార్ల దుశ్చర్యలను ఎదురించే క్రమంలో మ్యాడం క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామ్యమయ్యారు. రైల్వేలో నెలకు రూ. 7 చొప్పున వేతనం తీసుకుంటూ.. క్లీనర్‌గా పని చేసేవారు. చేసే డ్యూటీనే ఉద్యమానికి అంకుశంగా వాడుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కత్తులు, కటార్లను, తుపాకులను తన డబ్బులతోనే దిగుమతి చేసుకుంటూ వాటిని ఉద్యమకారులకు పంపిణీ చేసేవారట.

అయితే గాంధీజీ స్ఫూర్తిగా ‘ఖాదీ టోపీ’ని ధరిస్తే దానికి నైజాం పాలకులు ఒప్పుకోలేదు. ఓ సారి బెదిరించారు. అయినా వినలేదు. మరోసారి బొగ్గు మోపించారు. అయినా తన పట్టువదల్లేదు. టోపీ వీడలేదు. మూడోసారి రూపాయి జరిమానా వేశారు. దీంతో ఆయనకు తిక్కరేగి ఉద్యోగానికి వెళ్లడమే మానుకున్నారు.

నాడు చెన్నారెడ్డి ద్రోహం

1969లో ఉవ్వెత్తున ఎసిగిన తెలంగాణ ఉద్యమం హింసాయుతంగా మారింది. కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాతావరణమంతా రాష్ట్రావిర్భావానికి అనుకూలంగా మారుతున్న తరుణంలో మర్రి చెన్నారెడ్డి, ఇందిరాగాంధీతో చేతులు కలిపి ద్రోహం చేశారని ఆయన చెప్పుకొచ్చారు. కొద్ది మంది ఎమ్మెల్యేలు మినహాయించి అపుడు అంతా తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించిన వారేనన్నారు.

మలిదశలో గాంధీగిరిలో సాగాలి

మలిదశ ఉద్యమం ఊపందుకుంది. దీనికి 2009 కేసీఆర్ ఆమరణదీక్ష ఆయువు పోసింది. గాంధీగిరి తరహాలో ఉద్యమం శాంతియుతంగా జరగాలి. హింసాయుతంగా మారొద్దు. కేసీఆర్ మాదిరిగా ఇక ప్రజలే ఆమరణదీక్షలకు దిగాలి. సత్యాగ్రహాలు చేయాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రావిర్భావానికి ఆలస్యమయ్యే విధంగా ఉన్నాయి. అంతా ఒక్కతాటిపైకి వచ్చి సమష్టి ఉద్యమాలు చేయాలి. అపుడు తెలంగాణ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.

నగరాన్ని దోచేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు

మేమే పెట్టుబడులు పెట్టాం. అభివృద్ధి అంతా మేం చేసిందే అని సీమాంధ్ర పెట్టుబడిదారులు గగ్గోలు పెడుతున్నారు. వాళ్లిక్కడ పెట్టుబడుల పేరుతో నగరాన్ని దోచేశారు. భూములన్నీ కబ్జా చేసేశారు. శివారు ప్రాంతాలనూ వదల్లేదు. ఉద్యోగాల్లో నాటి నుంచి నేటి వరకు దోపిడీ కొనసాగుతూనే ఉంది. ఆఖరుకు స్వాతంత్ర సమరయోధులకు 10 ఎకరాల చొప్పున ఇవ్వాల్సిన భూములనూ కాజేశారు.

కోట్లకెలా పడగెత్తారు?

నేను 20 ఏళ్ల పాటు కౌన్సిలర్‌గా చేశా. ఏడాది డిప్యూటీ మేయర్‌గా విధులు నిర్వహించా. కానీ ఉండేందుకు ఇల్లు తప్ప మరేమీ లేవు. మరి మంత్రులు కోట్ల రూపాయలకెట్లా పడగెత్తుతున్నారు..? ప్రజలు గమనిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నాయకులుకు గాంధీ భావాలున్నాయా..? ఎంతమందికి ఉన్నాయి.. ? ఎవరైనా ఖాదీ టోపి ధరిస్తున్నారా..? రాను రాను కాంగ్రెస్ పరిస్థితి గాంధీ భావాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇది ప్రమాదకరమైన పరిణామ’మని వివరించారు.

పదవీ త్యాగశీలి

మ్యాడం రాంచంద్రయ్య త్యాగానికి వెనక్కితగ్గడు. మేయర్‌గా తనకు అవకాశం వచ్చింది. డిప్యూటీ మేయర్‌గా ఎన్. లక్ష్మినారాయణను నియమించాలని భావించినా.. స్నేహితుని కోసం నాడు మేయర్ పదవిని ఆయనకిచ్చేసి.. డిప్యూటీగానే కొనసాగాడు.

ఇద్దరు కలిసి చరిత్రలో నిలిచేపోయే విధంగా.. ఇపుడు యావత్ తెలంగాణ ప్రజలకు ఉద్యమ స్ఫూర్తిగా నిలిచిన అమరవీరుల స్థూపానికి వీరు కేంద్రబిందువులయ్యారు. తర్వాత సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చినా కె. కేశవరావు (కేకే) కోసం ఎమ్మెల్యే టికెట్‌ను తనకు కాదని ఆయన కిప్పించిన పదవులపై తనకు వ్యామోహం లేదని నిరూపించుకున్నారు.(కేకే పోటీచేసి ఓడిపోయారు.)

-సిటీబ్యూరో, టీన్యూస్

అమరవీరుల స్థూపం ఫొటో: ముషంపల్లి దామోదర రావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *