mt_logo

విశ్వనగరంగా మారనున్న హైదరాబాద్!

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. సుమారు 18,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని, ఇందులో భాగంగా నాలుగువేల నుండి ఐదువేల కోట్ల రూపాయల వ్యయంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట ఎనిమిది రోడ్లు, ఎనిమిది జంక్షన్లను 70 కిలోమీటర్ల మేరకు అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుండే సర్వే చేపట్టాలని, వారంలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని జీహెచ్ఎంసీ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రోడ్డు వెడల్పు, ట్రాఫిక్ సమస్యను బట్టి అక్కడ ఏం నిర్మిస్తే బాగుంటుందో నిర్ణయించే బాధ్యతను, అందుకు సంబంధించిన డిజైన్లు రూపొందించే బాధ్యతను లీ అసోసియేట్స్ కన్సల్టెంటుకు అప్పగించారు.

జీహెచ్ఎంసీ అధికారులు సర్వే నివేదిక అందించగానే రోడ్లు, జంక్షన్లను ఎలా అభివృద్ధి చేయాలి? ఎక్కడెక్కడ ఎక్స్ ప్రెస్ వేలు నిర్మించాలి? ఎక్కడెక్కడ ఫ్లై ఓవర్లు నిర్మించాలి? వాటి వెడల్పు ఎంత? తదితర వివరాలతో లీ అసోసియేట్స్ సమగ్ర నివేదిక రూపొందించనుంది. వంద కిలోమీటర్ల వరకు ఎక్స్ ప్రెస్ వేలు, 300 కిలోమీటర్ల మేరకు అంతర్జాతీయ స్థాయిలో రోడ్ల అభివృద్ధి, 50 ఫ్లై ఓవర్లు, 56 జంక్షన్లను అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. రోడ్ల విస్తరణలో భాగంగా ప్రస్తుతం ఉన్న రోడ్లని యథాతథంగానే అభివృద్ధి చేయాలని, ఇండ్లు, ప్రజల ఆస్తులకు ఎలాంటి భంగం వాటిల్లకుండా చూడాలని సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *