mt_logo

కేసీఅర్ ఫార్మ్ హౌజ్ లో నిజంగా ఏం జరుగుతోంది?

గత యేడాది కాలంగా సీమాంధ్ర మీడియాలో తరచుగా వినవచ్చే పదం కేసీఆర్ ఫార్మ్ హౌజ్! సందర్భం వచ్చినా రాకున్నా, అసందర్భంగానయినా ఏదోవిధంగా కేసీఆర్ ఫార్మ్ హౌజ్ ప్రస్తావన తేవడం, తద్వారా కేసీఆర్ పైన ఒక నెగెటివ్ ఇమేజ్ సృష్టించడానికి సీమాంధ్ర మీడియా పడరాని పాట్లు పడుతోంది.

ఈ నేపధ్యంలో కేసీఅర్ ఫార్మ్ హౌజ్ లో అసలు  నిజంగా ఏం జరుగుతోంది? ఎందుకు అవకాశం వచ్చినప్పుడల్లా కేసీఆర్ అక్కడికి వెళ్తున్నారు? అనే ప్రశ్నలు రాష్ట్రంలో అనేకమంది మదిలో మెదులుతున్నాయి. పదండి కేసీఆర్ ఫార్మ్ హౌజును ఒకసారి చూసొద్దాం! స్వయంగా అక్కడేం జరుగుతుందో తెలుసుకుందాం!

హైదరాబాద్ నగరానికి సుమారు 80 కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్ గ్రామ శివారులో దాదాపు 45 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాన్నే సీమాంధ్ర మీడియా “ఫార్మ్ హౌజ్” అని పిలుస్తున్నది.

నిజానికిది ఫార్మ్ హౌజ్ కానేకాదు. కేసీఆర్ మాటల్లోనే చెప్పాలంటే, ఇది ఒక ఫార్మర్స్ హౌజ్!

రెండేళ్ల క్రితం ఇక్కడ వ్యవసాయం చేయాలని కేసీఅర్ నిర్ణయించుకున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక, సాంప్రదాయ వ్యవసాయ మెళకువలను జోడించి వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నారు కేసీఆర్. భవిష్యత్ తెలంగాణ వ్యవసాయానికి ఒక నమూనాలాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారాయన.

ఎక్కడాలేని విధంగా దాదాపు ఎకరం విస్తీర్ణంలో వర్షపు నీటిని నిలువచేయడానికి ఒక పెద్ద బావి వంటి కుంటను తవ్వుతున్నారు. ఇక్కడ నిర్వహిస్తున్న డెయిరీ ఫారం నుండి వస్తున్న వ్యర్ధాలతో ఒక వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని నెలకొల్పి సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు.

 

ప్రస్తుతం ఈ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు 10 ఎకరాల్లో కాకర పంటను వేశారు. ఈ కాకర తోట నుండి ఎకరానికి 70 టన్నులదాకా దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆనపకాయ, మిరప, పసుపు, ఆలుగడ్డ, క్యాప్సికం వంటి పంటలు గత రెండేళ్లలో ఈ క్షేత్రంలో సాగుచేశారు. ప్రస్తుతం గ్రీన్ హౌజ్ విధానంలో బీన్స్ పంటను సాగుచేస్తున్నారు. దీని నుండి ఎకరానికి 40 టన్నుల బీన్స్, తద్వారా 15 లక్షల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందట.

ప్రస్తుతం జర్మనీ దేశంలో బాగా గిరాకీ ఉన్న “చీవ్స్” అనే పంటను ప్రయోగాత్మకంగా సాగు చేయాలని కేసీఆర్ ప్రణాళిక వేస్తున్నారు. అట్లాగే దుబాయ్ లో కిలో రూ.115 పలికే కలర్ క్యాప్సికం కూడా పండించాలని ఆయన ఆలోచన.

నీటి లభ్యత తక్కువ ఉన్న తెలంగాణ వంటి ప్రాంతాల్లో సూక్ష్మ నీటి పారుదల పద్ధతిని విరివిగా వాడటం ద్వారా ఎక్కువ దిగుబడి పొందవచ్చని ఆయన అనుభవపూర్వకంగా నిరూపించారు.

అటు గ్రీన్ హౌజ్, డ్రిప్ ఇరిగేషన్  వంటి ఆధునిక వ్యవసాయ పద్ధతులనూ, ఇటు సేంద్రియ ఎరువుల వాడకం, వాననీటి సంరక్షణ  వంటి సాంప్రదాయ పద్ధతులనూ మేళవించి కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయోగాత్మక వ్యసాయం, తెలంగాణ రైతాంగానికి ఒక దిశానిర్దేశం చేయగలదు.

రాష్ట్రసాధన ఉద్యమాన్ని ముందుండి నడపడమే కాకుండా భవిష్యత్ తెలంగాణకు కేసీఅర్ ఒక మంచి విజన్ ఉన్న నాయకుడు అని ఆయన వ్యవసాయ క్షేత్రం చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *