ఉపాధి హామీ కార్మికులకు కూలీ మొత్తాన్ని చెల్లించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ చౌదరి ప్రశంసించారు. ఉపాధి హామీ, పీఎంజీఎస్వై పథకాలపై శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో మంత్రి ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వచించారు. అతి తక్కువ సమయంలో వేతనం చెల్లించేందుకు అవలంబిస్తున్న విధానాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ కేంద్రమంత్రికి వివరించారు. ఉపాధి హామీ కూలీ చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, జాప్యం జరక్కుండా ఉండేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని కూడా ఆమె తెలిపారు.
89 శాతం మంది ఉపాధి హామీ కూలీలకు పనిచేసిన 15 రోజుల్లోగా చెల్లింపులు చేయడాన్ని కేంద్రమంత్రి బీరేందర్ సింగ్ అభినందించారు. కూలీలకు చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్న రాష్ట్రాలు ఇక్కడి విధానాన్ని అధ్యయనం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మంత్రి అన్నారు. కూలీలకు సరైన సమయంలో చెల్లింపులు చేయడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. కరువు ప్రాంతాలను ప్రకటించగానే 150 రోజుల ఉపాధి హామీ పనిదినాలను అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా కేంద్రం నుండి ఉపాధి హామీ నిధులను వెంటనే విడుదల చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని బీరేంద్రసింగ్ హామీ ఇచ్చారు.