mt_logo

హైకోర్టు విభజన జరగాల్సిందే- టీఆర్ఎస్ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో స్పష్టంగా హైకోర్టు విభజనను పేర్కొన్నారని, రాష్ట్ర విభజన జరిగి 11 నెలలు గడిచినప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని, పార్లమెంటు చేసిన చట్టానికి తగిన గౌరవం లభించలేదని టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం లోక్‌సభ దృష్టికి తెచ్చారు. రాష్ట్ర విభజన కోసం చేసినట్లు హైకోర్టు విభజనకు కూడా చట్టం చేయాలా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాల్సిందేనని అంటూ స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి నిరసన వ్యక్తం చేయడంతో సభ మూడుసార్లు వాయిదా పడింది. అంతకుముందు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కేంద్ర న్యాయ శాఖామంత్రి సదానంద గౌడ గురువారం టీఆర్ఎస్ ఎంపీలతో ఇదే అంశంపై సమావేశమై త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

లోక్‌సభలో ఎంపీ జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో పనిచేస్తున్న 29 మంది న్యాయమూర్తుల్లో కేవలం ఆరుగురు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారున్నారని, మిగతావారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారేనని, తెలంగాణకు చెందిన కేసులన్నీ పెండింగ్‌లో ఉండిపోతున్నాయని, ఆంధ్ర ప్రాంతానికి చెందిన కేసులే విచారణకు వస్తున్నాయని అన్నారు. తెలంగాణ పట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందని చెప్పడానికి హైకోర్టు విభజనలో జరుగుతున్న జాప్యం నిదర్శనమని పేర్కొన్నారు. ఈ సభలే చట్టం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చాయని, అందుకే న్యాయశాఖ మంత్రి ఈ సభలో స్పష్టమైన ప్రకటన చేసి తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఎప్పటికల్లా ఇస్తారో చెప్పాలని కోరారు.

పునర్వ్యవస్థీకరణ చట్టంలో లోపం ఉన్నట్లు హైకోర్టు వ్యాఖ్యానించిందని, ఆ అంశాల్ని అమలు చేయాల్సిన కేంద్ర హోంమంత్రి.. హైకోర్టు అంశం కూడా ఆ చట్టంలో ఉన్నందున ఎప్పటిలోగా విభజన చేస్తారో చెప్పాలని ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. న్యాయవ్యవస్థలోనూ అన్యాయం జరుగుతున్నందునే గత అరవై ఏండ్లుగా తెలంగాణ ప్రజలు కొట్లాడుతున్నారని, వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పడాల్సిన హైకోర్టు ఎక్కడ ఉండాలన్న విషయాన్ని రాష్ట్రపతి ప్రకటిస్తారని, కేంద్ర మంత్రివర్గం ఈ అంశంలో తగిన నిర్ణయం తీసుకుని రాష్ట్రపతికి తెలియజేస్తే రాష్ట్రపతి తుదినిర్ణయం ప్రకటిస్తారని ఎంపీ వినోద్ తెలిపారు. హైకోర్టు విడిగా లేకుండా రాష్ట్రం ఎలా పనిచేస్తుందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. పార్లమెంటు వాయిదా పడటానికి ముందే ఎంపీలతో ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అంతకుముందు లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న ఆందోళనకు ఎంఐఎం, కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *