mt_logo

తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం- నిరంజన్ రెడ్డి

శాసనసభలో ఈరోజు ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు కోటీ 40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల వరినాట్లు వేస్తున్నారు. కేంద్రం సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ నుండి 55 శాతం కొనుగోలు చేసింది. మార్కెట్ విధానం దృష్టిలో ఉంచుకొని పంటలను సాగు చేయాల్సిన అవసరం ఉంది. పంటల నియంత్రిత సాగుకు సీఎం కేసీఆర్ ఈ ఏడాది శ్రీకారం చుట్టారు. నూతన పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని నిరంజన్ రెడ్డి తెలిపారు.

దేశంలో నూనె గింజల ఉత్పత్తి పడిపోయింది. ప్రత్యేకంగా వంట నూనెల వాడకం భవిష్యత్ లో పెరగనుంది. కేంద్రం ఈ ప్రమాదాన్ని గుర్తించి విదేశాల నుండి వంట నూనెలను దిగుమతి చేసుకోవడం మూలంగా అదనంగా నష్టపోవాల్సి ఉంటుందని గ్రహించి వంట నూనెల పంటలను ప్రోత్సహిస్తుంది. పామాయిల్ దిగుమతి కోసం కేంద్రం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తుంది. అందుకే 18 లక్షల హెక్టార్లలో ఆయిల్ ఫామ్ ను సాగు చేయాలని కేంద్రం నిర్ణయించిందని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం కంటే ముందే తెలంగాణలో ఆయిల్ ఫామ్ సాగును విస్తరించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తెలంగాణలో 25 జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా ఉన్నాయి. జాతీయ ఆహార భద్రత మిషన్ ఆయిల్ ఫామ్ పథకం కింద 2,500 హెక్టార్లలో ఈ సంవత్సరం సాగు చేయడం జరిగిందని నిరంజన్ రెడ్డి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *