హైదరాబాద్: సీఎం కేసీఆర్ సంకల్పం.. మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకొంటున్నది. ప్రపంచంలోనే ప్రసిద్ధ కంపెనీలైన గూగుల్, ఆపిల్, అమెజాన్‌లాంటి సంస్థలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. అద్భుత కట్టడాలతో పర్యాటకంలోనూ హైదరాబాద్ దూసుకుపోతున్నది.. ఇలాంటి సమయంలో విదేశాలను తలపించేలా ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ హైదరాబాద్ మహానగరానికి అత్యవసరం… నలుమూలాల శరవేగంగా విస్తరిస్తున్న నగరంలో ట్రాఫిక్ ఇక్కట్లు అనేవి లేకుండా ఉండేందుకు మెట్రో రైలు తరహాలో… కాలుష్య రహితంగా ఉండే రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వం సంకల్పం. ఇందుకు అనుగుణంగానే హైదరాబాద్ మహానగరం, దాని శివారు ప్రాంతాల్లో సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళికను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) పనిచేస్తున్నది. తద్వారా శివారు ప్రాంతాల్లో పట్టణీకరణకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటవుతుంది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ పరిధిలో పనిచేస్తున్న యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ (ఉమ్టా) ఎప్పటికప్పుడు గ్రేటర్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ప్రజా రవాణా వ్యవస్థలపై అధ్యయనం చేస్తూ, భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నది.
సమర్థవంతంగా రవాణా వ్యవస్థ
హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పరిధిలో వివిధ రకాల రవాణా వ్యవస్థను సమన్వయం చేయడం, వాటి పనితీరును సమర్థవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉమ్టా పనిచేస్తున్నది. భవిష్యత్తు మహానగరాలకు కావాల్సింది అన్ని అంశాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ. ఇదే లక్ష్యంతో ఇప్పుడు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పనిచేస్తోంది. టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్, అర్బన్ ఫారెస్ట్, లేక్ ప్రొటెక్షన్, అర్బన్ టాన్స్‌పోర్టేషన్… ఇలా వివిధ విభాగాలు హెచ్‌ఎండీఏ పరిధిలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా పనిచేస్తున్నాయి.
సంపూర్ణ అధ్యయనం..పక్కాగా అమలు
ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థలో రోడ్డు, రైలు, మెట్రో మార్గాలతో పాటు అభివృద్ధి చెందిన నగరాల్లో ఉన్న పట్టణ ప్రజా రవాణా వ్యవస్థలను అధ్యయనం చేయడం, వాటిని నగరంలో ఏ ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకు రావాలన్న దానిపై ఉమ్టా కసరత్తు మొదలు పెట్టింది. కోర్ సిటీ నుంచి శివారు ప్రాంతాల వరకు మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటేనే నగరం మరింత విస్తరించేందుకు అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే హెచ్‌ఎండీఏ కార్యాచరణను రూపొందించే పనిలో ఉంది.
2013లో రూపొందించిన హెచ్‌ఎండీఏ మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ఉన్న రోడ్ల విస్తరణే కాకుండా కొత్తగా జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, భవిష్యత్తులో అభివృద్ధి చెందే ప్రాంతాలను పరిగణలోకి ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధ్యయనం చేయాలని ఉమ్టా విభాగాన్ని ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థలను అధ్యయనం చేయడంతో పాటు వాటి కన్నా మరింత మెరుగైన పట్టణ ప్రజా రవాణా వ్యవస్థలు ఎక్కడ చేపడుతున్నారో గుర్తించే పనిలో ఉమ్టా నిమగ్నమై ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో రోజు రోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాంతానికి అనుగుణంగా అత్యాధునిక శైలిలో ఉండేలా, సులభంగా, పర్యావరణ హితంగా ఉండేలా పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం తీసుకు వస్తే ఎలా ఉంటుందన్న దానిపై కసరత్తు మొదలు పెట్టారు.