సంగారెడ్డిలో నిర్వహించిన యువ ఆత్మీయ సమ్మేళంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఫేక్ ప్రచారం పెరిగిపోతున్నది.. రాజకీయం కోసం మాట మార్చుతున్నారు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. మంచి చేసే వారి గురించి ఆలోచించి ఓటు వేయాలి అని అన్నారు.
పదేళ్లు బీజేపీ పాలన ఉంది.. కేంద్రంలో, రాష్ట్రంలో మీరు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. చేసింది లేదు, చెప్పుకునేందుకు పథకాలు లేవు.. కాబట్టే చిత్ర పటాలు, క్యాలెండర్‌లు పంచుతున్నారు. వాళ్లను చూస్తే నాకు నవ్వు వస్తున్నది అని పేర్కొన్నారు.
157 మెడికల్ కళాశాల ఇస్తే, నర్సింగ్ కాలేజి ఇస్తే తెలంగాణకు ఒక్కటి ఇవ్వలేదు. ఒక్క నవోదయ విద్యాలయం ఇవ్వలేదు.. నల్లధనం తెస్తా అని మాట మార్చారు. ఓట్ల కోసం జుమ్లా చెప్పించామని అమిత్ షా అన్నారు అని గుర్తు చేశారు.
ఏడాదికి రెండు కోట్లు అంతే పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి.. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలి.. 20 కోట్లు అన్నారు, 6.5 లక్షలు ఇచ్చారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచారు, ఎన్నికలు రాగానే కొంత తగ్గించారు. రాజకీయాలు తప్ప ప్రజల కోసం ఏనాడు ఆలోచించలేదు అని విమర్శించారు.
కేంద్ర బీజేపీ హామీలు ఇచ్చి మోసం చేస్తే, ఇక్కడి ఎంపీ అభ్యర్థి రఘునందన్ ఎడ్లు, నాగలి, నిరుద్యోగ భృతి, కార్పొరేట్ ఆసుపత్రి, స్కూటీ ఇస్తా అని మోసం చేశాడు.. అందుకే దుబ్బాక ప్రజలు చిత్తుగా ఓడించారు అని హరీష్ పేర్కొన్నారు.
వెంకట్రామి రెడ్డి మంచి వ్యక్తి.. ఆయనకు సంగారెడ్డితో ఎంతో అనుబంధం ఉంది.. ఇక్కడి ఓటర్.. పదేళ్లుగా అధికారిగా పని చేశాడు. నిరుపేదల పిల్లల చదువుల కోసం ఎంతో ఖర్చు చేసి వారి కలలను సాకారం చేశారు. ఎంపీగా పోటీ చేయాలని ఆయన అడగలేదు.. మేము వెళ్లి అడిగాము..మెదక్ తరుపున పార్లమెంటులో గళం విప్పాలని కోరాము అని తెలిపారు.
కరీంనగర్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, చేవెళ్లలో కాంగ్రెస్ వీక్ అభ్యర్థులను పెట్టింది. బీజేపీకి పూర్తి సహకారం అందిస్తున్నది.. బీజేపీ, కాంగ్రెస్ ఏకమై పనిచేస్తున్నాయి అని తేల్చి చెప్పారు.
జిల్లాలు ఎక్కువ అయ్యాయాట.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి, రుణమాఫీ కాలేదు.. పంటకు రూ. 500 బోనస్ అని కొనడం లేదు.. రైతు బంధు ఇవ్వడం లేదు.. ఆసరా పింఛన్లు ఇవ్వడం లేదు.. తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు.. మహాలక్ష్మి పథకం అమలు లేదు.. కేసీఆర్ కిట్ కూడా ఇవ్వడం లేదు అని దుయ్యబట్టారు.
విద్యార్థుల విషయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి మోసం చేశారు.. ఇచ్చిన ఒక్క హామీ అమలు చేయలేదు. నాలుగు నెలలలో ఆగం పట్టించారు.. ఇంకో నాలుగు ఏండ్లు ఉంటే భరించగలమా. నమ్మి ఓటు వేస్తే రైతు జీవితాలను ఆగం చేసిండు రేవంత్ రెడ్డి అని అన్నారు.
నువ్వు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కట్టన్న రైతులకు చేసావా బహిరంగ చర్చకు సిద్ధమా? సాగు నీళ్ళు లేవు, కరెంట్ లేదు. రంజాన్‌కు తోఫా కూడా ఇవ్వలేదు.. ముస్లిం సోదరులు ఆలోచించాలి అని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటే.. దొందూ దొందే. ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే గొంతు వెంకట్రామి రెడ్డిని గెలిపించాలని కోరుతున్నా. పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదు.. ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టారు అని గుర్తు చేశారు.
పోరాడితే పోయేది ఏది లేదు బానిస సంకెళ్లు తప్ప.. కార్యకర్తలను కాపాడుకునేందు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఒక్కసారి జై తెలంగాణ అని అనని వ్యక్తి రేవంత్ రెడ్డి.. పైగా తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదికి వచ్చాడు. ఇప్పటికైనా అమరుల త్యాగాలను గుర్తించు.. కనీసం వాళ్లకు పువ్వులు వేసి నివాళి అర్పించు అని రేవంత్ రెడ్డికి సూచించారు.
తల్లి లాంటి బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది.. అందరం కలిసి మన సత్తా చాటాలి అని పిలుపునిచ్చారు.